స్టార్ హీరో సినిమా గౌత‌మ్‌ని గ‌ట్టెక్కించిందా?

అయితే ఒకే ఒక్క మూవీ ఆయ‌న కెరీర్‌ని ఒక్క‌సారిగా త‌ల‌కిందులు చేసింది. అదే చియాన్ విక్ర‌మ్ న‌టించిన `ధృవ‌న‌క్ష‌త్రం`.;

Update: 2026-02-12 15:30 GMT

సినిమా ఇండస్ట్రీలో ఎవ‌రి కెరీర్ ఎప్పుడు ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటుందో ఎవరూ ఊహించ‌లేరు. డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ కెరీర్ కూడా ఇలాగే ఊహించ‌ని మ‌లుపులు తిరిగింది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీస్‌ని ఒక ద‌శ‌లో కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్‌. `చెలియా`, కాక కాక‌, వెంటాడు వేటాడు, సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్‌, యేమాయ చేసావె, ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు, సాహ‌సం స్వ‌స‌గా సాగిపో వంటి సినిమాలు అందించారు. ప్రేమ కథా చిత్రాల ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు.

అయితే ఒకే ఒక్క మూవీ ఆయ‌న కెరీర్‌ని ఒక్క‌సారిగా త‌ల‌కిందులు చేసింది. అదే చియాన్ విక్ర‌మ్ న‌టించిన `ధృవ‌న‌క్ష‌త్రం`. రీతూ వ‌ర్మ, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్‌గా న‌టించారు. దీనికి నిర్మాత కూడా గౌత‌మ్ మీన‌నే. 2017లో షూటింగ్ మొద‌లైన ఈ సినిమాని 17 దేశాల్లో చిత్రీక‌రించారు. భారీ బ‌డ్జెట్‌తో స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా గౌత‌మ్ మీన‌న్ దీన్ని ప్లాన్ చేశాడు. అత్య‌ధిక కాలం ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా ఈ సినిమా నిర్మాణ ద‌శ‌లోనే ఆగిపోయి చిత్ర విచిత్ర‌మైన ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటూ ఇప్ప‌టికీ రిలీజ్‌కు నోచుకోవ‌డం లేదు.

ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ సొంత నిర్మాణ సంస్థ ఓండ్రాంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో ఎదురైన ఆర్థిక స‌వాళ్ల కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ నివ‌ధికంగా ఆగుతూ వ‌చ్చింది. ఈ వివాదం మ‌ద్రాస్ హైకోర్టుకు చేర‌డంతో 2023, న‌వంబ‌ర్‌లో ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ రూ.8 కోట్లు క‌ట్టాల్సిందేన‌ని మ‌ద్రాస్ కోర్టు తీర్పు ఇచ్చింది. న‌వంబ‌ర్ 24, 2023లో రిలీజ్ చేయాల‌ని అన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. దాదాపు ఎనిమిదేళ్లుగా సినిమా రిలీజ్‌కు నోచుకోక‌పోవ‌డంతో గౌత‌మ్ మీన‌న్ దీన్ని బ‌య‌టికి తీసుకురావ‌డం కోసం సినిమాల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టారు.

`మెరుపు క‌ల‌లు` నుంచి చిన్న చిన్న అతిథి పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌చ్చిన గౌత‌మ్ మీన‌న్ మ‌ల‌యాళ మూవీ `ట్రాన్స్‌`తో పూర్తి స్థాయి న‌టుడిగా మారిపోయారు. అయితే ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన `లియో` మూవీ గౌత‌మ్ మీన‌న్ కు చాలా వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డిందట‌. ఇందులో గౌత‌మ్ మీన‌న్ ..విజ‌య్‌కి స‌పోర్ట్‌గా ఉండే క్యారెక్ట‌ర్‌లో న‌టించాడు. ఇది త‌న ఆర్థిక ఇబ్బందుల‌ను కొంత మేర దూరం చేసింద‌ట‌. `ధృవ‌న‌క్ష‌త్రం` రిలీజ్ కోసం స‌హాయం చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదు. అందుకే నేను సినిమాల్లో న‌టించాల‌ని నిర్ణ‌యించుకున్నాను.

నా ఆర్థిక ఇబ్బందుల్ని అధిగ‌మించ‌డంలో `లియో` ప్ర‌ముఖ పాత్ర పోషించింది. నా పేరుతో `ధృవ‌న‌క్ష‌త్రం` సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఓ చిన్న స‌మ‌స్య మాత్ర‌మే పెండింగ్‌లో ఉంది. అది వారంలోపు స‌రిష్కారం అవుతుంది` అని తెలిపారు గౌత‌మ్ మీన‌న్‌. అంటే గ‌త ఎనిమిదేళ్లుగా రిలీజ్‌కు నోచుకోని `దృవ‌న‌క్ష‌త్రం` ఈ ఏడాది ఎట్టిప‌రిస్థితుల్లోనూ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తుంద‌ని గౌత‌మ్ మీన‌న్ కాన్ఫిడెన్స్‌ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. మ‌రి త‌ను అనుకున్న‌ట్టే ఈ ఏడాదైనా దీనికి మోక్షం ల‌భిస్తుందా? అన్న‌ది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Tags:    

Similar News