రైలు బుకింగ్స్‌కు 'అవెంజర్స్' ట్విస్ట్ ఇచ్చిన IRCTC

మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న అత్యంత భారీ చిత్రం 'అవెంజర్స్: డూమ్స్‌డే' ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Update: 2026-07-25 17:03 GMT

మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న అత్యంత భారీ చిత్రం 'అవెంజర్స్: డూమ్స్‌డే' ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా ఒక పాప్ కల్చర్ ట్రెండ్‌గా మారింది. ట్రైలర్ హుషారు పెంచ‌గా.. ఐఆర్‌సిటిసి (IRCTC) ఆ ట్రైలర్‌లోని ఒక సీన్‌ను తన డిజిటల్ ప్రచారానికి ఉప‌యోగించుకోవ‌డం ఆస‌క్తిని పెంచింది.

ట్రైలర్‌లో థోర్ , స్టీవ్ రోజర్స్ ఎమోష‌న‌ల్ రీ-యూనియన్ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ ఐఆర్‌సిటిసి దాని ప్రయాణానికి సంబంధించిన వినూత్నమైన ట్విస్ట్ ఇచ్చింది. ఈ సోషల్ మీడియా పోస్ట్‌కు `కొందరు సూపర్ హీరోలు ప్రపంచాన్ని కాపాడతారు.. మరికొందరు మీ గ్రూప్ ట్రిప్‌ను కాపాడతారు!`` అని ఆసక్తికరమైన క్యాప్షన్ జత చేసింది. తమ ప్లాట్‌ఫారమ్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా ప్రయాణికులను కోరుతూ చేసిన ఈ ప్రయత్నం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

సినిమాల క్రేజ్‌ను తమ బ్రాండ్ ప్రమోషన్ల కోసం వాడుకునే క్రమంలో ఐఆర్.సిటిసి చేసిన ఈ సృజనాత్మక ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సంవత్సరం అత్యంత భారీ చిత్రంగా విడుద‌ల కానున్న `అవెంంజర్స్: డూమ్స్‌డే` ప్రభావం సాధారణ వినోద రంగాన్ని దాటి కార్పొరేట్ - ప్రభుత్వ ప్రచారాల వరకు ఎంతలా విస్తరించిందో ఈ సంఘటన నిరూపిస్తోంది. కాగా ఈ మార్వెల్ చిత్రం డిసెంబర్ 18న భారత్‌లోని థియేటర్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

నిజానికి ఐఆర్.సిటిసి మాత్రమే కాకుండా..ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా సెలబ్రిటీలతో ఎంతో క్రియేటివ్‌గా ప్రకటనలు చేయిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. రోడ్డు భద్రత, హెల్మెట్ ధరించడం, సైబర్ నేరాల విష‌యంలో జాగ్రత్తగా ఉండటం వంటి అంశాలపై సూపర్ స్టార్ల పాపులర్ డైలాగులు , మీమ్‌లను వాడుకుంటూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ యాడ్స్ అంటే బోరింగ్‌గా ఉంటాయనే భావనను చెరిపేస్తూ... వినోదాత్మకంగా మెసేజ్ ఇవ్వడం నిజంగా అభినందించదగ్గ పరిణామం.

గతంలో కూడా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్.. టాలీవుడ్‌లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ సెక్యూరిటీపై చేసిన క్రియేటివ్ యాడ్స్ సమాజంలో ఎంతో మార్పు తెచ్చాయి. ఇటు పాప్ కల్చర్ ట్రెండ్స్‌ను వాడుకునే ఐఆర్.సిటిసి వంటి సంస్థలు.. అటు సెలబ్రిటీలతో సామాజిక స్పృహ పెంచే పోలీస్ శాఖలు చేస్తున్న ఈ తరహా ప్రయోగాలు ప్రజలకు వేగంగా చేరువవుతున్నాయి.

Tags:    

Similar News