నారా రోహిత్ స్టన్నింగ్ మేకోవర్ సర్‌ప్రైజింగ్
వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్ నటించిన `సౌండ్ ఇంజినీర్` ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్ నటించిన `సౌండ్ ఇంజినీర్` ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఆయన పూర్తిగా డిఫరెంట్‌గా.. ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్‌లో కనిపించబోతున్నారని చిత్ర యూనిట్ షేర్ చేసిన పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది.
ఈ పోస్టర్‌లో నారా రోహిత్ తెల్లటి ప్రశాంతమైన లాల్చీ-పైజామా ధరించి.. ఒక భవంతి పైకప్పు గోడపై పద్మాసనంలో ప్రశాంతంగా కూర్చుని కనిపించారు. ఆయన వెనుక భాగంలో నగర వాతావరణం, ఆకాశహర్మ్యాలు ఉన్నా.. బయటి శబ్దాలకు దూరంగా కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలో ఉన్న ఆయన రూపం సినిమాలో తన పాత్ర ఎంత విలక్షణంగా ఉండబోతోందో సూచిస్తోంది.
పోస్టర్ చుట్టూ ఉన్న ఆసక్తికరమైన చేతిరాత కామెంట్లు ఈ సినిమా కాన్సెప్ట్‌పై మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి. ``గట్టిగా ఊపిరి తీసుకోకు.. వాడికి వినిపిస్తుంది!``, ``చీమ చిట్టుక్కుమన్నా వినిపిస్తుంది`` వంటి వాక్యాలు కథానాయకుడి పాత్రకు ఉన్న అసాధారణమైన వినికిడి శక్తిని లేదా శబ్దాలతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని తెలియజేస్తున్నాయి.
యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి `SOUND ENGINEER` అని రంగురంగుల 3D ఫాంట్‌లో టైటిల్ డిజైన్ చేశారు. టైటిల్‌లో `O` ఆకారాన్ని గుండె-స్పీకర్ సింబల్‌తో మలచడం కథలోని భావోద్వేగాలను ప్రతిబింబిస్తోంది. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం నారా రోహిత్ కెరీర్‌లో మరొక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.
నటుడు నారా రోహిత్ కెరీర్‌లో 23వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై భరత్ చౌదరి నిర్మిస్తుండగా, చినమిల్లి మణికమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రోమాన్స్, కామెడీ,బలమైన కుటుంబ విలువలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నారా రోహిత్ సరసన నయన్ సారిక కథానాయికగా నటిస్తోంది. నరేష్ వికె, రోహిణి, సంపత్, అజయ్ కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, వెన్నెల కిషోర్, సుదర్శన్, బ్రహ్మాజీ, రఘు కరుమంచిల కామెడీ టైమింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
బాణం రోజులు గుర్తుకొస్తున్నాయ్!
నిజానికి రోహిత్ లుక్ బిగ్ సర్ ప్రైజ్. అతడి మేకోవర్ ఊహించనిది. `బాణం` సినిమా టైమ్ లో రోహిత్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా మారాడు. ఇటీవలి కాలంలో అతడు అధికబరువుతో సతమతమయ్యాడు. దాని నుంచి బయటపడేందుకు అతడు చాలా శ్రమించాడని తాజా లుక్ చూస్తుంటే అర్థమవుతుంది. బరువు తగ్గడం అనేది సంవత్సరాల పాటు చేసే ఒక యజ్ఞం. బాలీవుడ్ లో చాలా మంది నవతరం నటీమణులు 100 కేజీలు పైబడిన బరువు నుంచి 60 కేజీలకు తగ్గి ఔరా! అనిపించారు. అయితే నారా రోహిత్ ప్రస్తుత మేకోవర్ చూస్తుంటే అతడు తిరిగి గ్రేట్ కంబ్యాక్ అంటే ఏంటో చూపిస్తాడనే నమ్మకం పెరుగుతోంది.