30,000 కోట్ల ఆస్తి వివాదం: స్టార్ హీరోయిన్ పిల్ల‌ల‌కు వాటా ద‌క్కిన‌ట్టేనా?

అంతేకాకుండా సంజయ్ కపూర్‌కు చెందిన విదేశీ బ్యాంకు ఖాతాల నిర్వహణను, క్రిప్టో కరెన్సీ లావాదేవీలను కూడా కోర్టు నిలిపివేసింది.;

Update: 2026-04-30 18:22 GMT

ప్రముఖ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ మరణం తర్వాత ఆయన వారసత్వ సంపదపై సాగుతున్న పోరులో కీలక మలుపు చోటుచేసుకుంది. సుమారు 30,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తి వివాదంలో కరిష్మా కపూర్ పిల్లలైన సమైరా, కియాన్‌లకు ఢిల్లీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. సంజయ్ కపూర్ మరణాంతరం ఆయన వీలునామాను భార్య ప్రియా కపూర్ మార్చివేసిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ ఆస్తులపై స్టే విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

సంజయ్ కపూర్ జూన్ 2025లో లండన్‌లో కన్నుమూశారు. ఆయన మరణం తర్వాతే ఈ ఆస్తి వివాదం మొదలైంది. సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ .. కరిష్మా కపూర్ పిల్లలు కలిసి కోర్టును ఆశ్రయించారు. సంజయ్ రాసిన అసలు వీలునామాను ప్రియా కపూర్ ఫోర్జరీ చేశారని.. భారీ మొత్తంలో సంపదను కోర్టుకు తెలియకుండా దాచిపెట్టారని వారు తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ జ్యోతి సింగ్ వీలునామా ప్రామాణికతపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ.. అది తేలేవరకు ఆస్తులను తాకకూడదని స్పష్టం చేశారు.

ఢిల్లీ హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో భాగంగా సంజయ్ కపూర్‌కు చెందిన అన్ని రకాల ఆస్తులను ఫ్రీజ్ చేసింది. ప్రియా కపూర్ ఆ ఆస్తులను అమ్మడం గానీ.. ఇతరుల పేరు మీదకు మార్చడం గానీ చేయకూడదని ఆదేశించింది. ``ఆస్తులు వృధా కాకూడదు, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉంది`` అని కోర్టు అభిప్రాయపడింది. వీలునామాపై విచారణ సాగుతున్నందున.. ఆస్తుల విలువ తగ్గకుండా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

అంతేకాకుండా సంజయ్ కపూర్‌కు చెందిన విదేశీ బ్యాంకు ఖాతాల నిర్వహణను, క్రిప్టో కరెన్సీ లావాదేవీలను కూడా కోర్టు నిలిపివేసింది. భారతీయ బ్యాంకుల్లోని మూడు ప్రధాన ఖాతాల నుండి డబ్బు ఉపసంహరించుకోకుండా ప్రియా కపూర్‌పై ఆంక్షలు విధించింది. అయితే గతంలో విడాకుల సమయంలో కరిష్మా కపూర్ పిల్లల బాధ్యతలకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ప్రతివాదులు తమ బ్యాంకు ఖాతాల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

ప్రియా కపూర్ తరఫు న్యాయవాదులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తాము ఆస్తులకు సంబంధించి అన్ని వివరాలను వెల్లడించామని.. వీలునామాలో ఎలాంటి మార్పులు చేయలేదని వాదించారు. అయినా సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ తన కుమారుడి ఆస్తిలో అధిక భాగాన్ని కోడలు ప్రియా కపూర్ దాచిపెట్టిందని వాదిస్తున్నారు. 30,000 కోట్ల రూపాయల భారీ మొత్తం కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదంలో తుది తీర్పు వచ్చే వరకు కరిష్మా కపూర్ పిల్లల వాటా భద్రంగా ఉన్నట్లేనని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News