అనుకున్నదే జరిగిందా? నెట్ ఫ్లిక్స్ ది మామూలు ప్లాన్ కాదు బాబోయ్!
నెట్ ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్ సూపర్ సుబ్బు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆ విషయం ప్రస్తావనకు వచ్చింది.
రాజమౌళి సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ ఉండటం కొత్త విషయం కాదు. అందులోనూ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసిపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. షూటింగ్ ఇంకా కొనసాగుతుండగానే ఆ సినిమా డిజిటల్ రైట్స్ పై వస్తున్న వార్తలు కూడా అదే స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం రూమర్ గానే ఉన్న విషయం... ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఆఫీసర్ చేసిన కామెంట్స్ తో మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నెట్ ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్ సూపర్ సుబ్బు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆ విషయం ప్రస్తావనకు వచ్చింది. వారణాసి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ నేరుగా ఆన్సర్ ఇవ్వలేదు. "కొన్ని విషయాలు ఫ్యూచర్ లో సర్ప్రైజ్ గా ఉంటేనే బాగుంటుంది" అంటూ నవ్వుతో స్పందించారు.
అక్కడితో ఆగకుండా.. "ప్రపంచంలోని బెస్ట్ స్టోరీలు, బిగ్ రేంజ్ క్రియేటర్లు ఎప్పుడూ నెట్ ఫ్లిక్స్ తో కలిసి ప్రయాణిస్తారు" అని ఆమె చెప్పడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ స్టార్ట్ అయింది. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా.. ఆమె కామెంట్స్ చూస్తే వారణాసి డిజిటల్ హక్కుల విషయంలో ఏదో పెద్ద ఒప్పందం కుదిరినట్లే ఉందని టాక్ వినిపిస్తోంది.
నిజానికి వారణాసి ఓటీటీ హక్కులపై గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు మోనికా కామెంట్స్ తో ఆ రూమర్స్ కు బలం చేకూరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజమౌళి గత చిత్రాలు బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్.. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకున్నాయి.
ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ లో మరింత గుర్తింపు తెచ్చుకోవడంలో ఓటీటీ కూడా కీలక పాత్ర పోషించింది. అదే కారణంగా ఇప్పుడు వారణాసి కూడా నెట్ ఫ్లిక్స్ కే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా రూపొందుతున్న వారణాసిని దాదాపు రూ.1,200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకే థియేట్రికల్ విడుదలకు ముందే ఆ సినిమా డిజిటల్ హక్కులపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే వారణాసికి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఆఫీసర్ చేసిన ఒక్క కామెంట్ తో మరోసారి సినిమా వార్తల్లో నిలిచింది. నిజంగానే డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందా? లేక ఇంకా చర్చల దశలోనే ఉన్నాయా? అనే ప్రశ్నలకు మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్నవి చూస్తుంటే... అభిమానులు చాలాకాలంగా అనుకుంటున్నదే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, నెట్ ఫ్లిక్స్ పెద్ద ప్లాన్ వేసిందని నెట్టింట చర్చ సాగుతోంది.