టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: వారసత్వ బిరుదులు!
స్టార్ హీరోల పేర్ల ముందుండే బిరుదులకు (టాగ్స్) ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వెండితెరపై నటనతో మాత్రమే కాకుండా అభిమానుల గుండెల్లో హీరో స్థానాన్ని బిరుదులు మరింత పదిలం చేస్తాయి.
స్టార్ హీరోల పేర్ల ముందుండే బిరుదులకు (టాగ్స్) ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వెండితెరపై నటనతో మాత్రమే కాకుండా అభిమానుల గుండెల్లో హీరో స్థానాన్ని బిరుదులు మరింత పదిలం చేస్తాయి. అయితే టాలీవుడ్‌లో నటన, స్టార్‌డమ్ మాత్రమే కాకుండా తండ్రుల నుంచి ..కుటుంబ పెద్దల నుంచి సదరు బిరుదులను వారసత్వంగా స్వీకరించే సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. తరం మారుతున్న కొద్దీ ఆయా స్టార్ హీరోల ఇమేజ్ - మార్కెట్ పరిధిని బట్టి బిరుదులు కూడా తదుపరి తరానికి బదిలీ అవుతున్నాయి. ఈ ట్రెండ్‌లో తాజాగా వినిపిస్తున్న పేరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.
`చిరుత` సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పేరు ముందు మెగా పవర్ స్టార్ అనే బిరుదు ఉండేది. మెగాస్టార్ చిరంజీవి లోని మెగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లోని పవర్ కలిపి ఈ ట్యాగ్‌ను డిజైన్ చేశారు. అయితే `ఆర్ఆర్ఆర్` వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ అని కాకుండా చిరంజీవి లెగసీని పూర్తిగా ముందుకు తీసుకెళ్లేలా `న్యూ ఏజ్ మెగాస్టార్` అనే కొత్త బిరుదుకు డాడ్ ఇవ్వడం విశేషం.ఇది మెగా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
తండ్రి బిరుదును వారసత్వంగా పుచ్చుకోవడం టాలీవుడ్‌లో మొదటిసారి కాదు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ ను తొలుత ప్రిన్స్ అని పిలిచేవారు. కెరీర్ ఆరంభంలో చాక్లెట్ బాయ్‌గా, లవర్ బాయ్‌గా మెప్పించిన మహేష్.. ఆ తర్వాత `పోకిరి`, `దూకుడు` వంటి ఇండస్ట్రీ హిట్లతో మాస్ పొటెన్షియల్‌ను నిరూపించుకున్నారు. కృష్ణ తర్వాత ఆ స్థాయి రికార్డులను, స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని ట్రేడ్ లీడర్‌గా ఎదగడంతో ప్రిన్స్.. సూపర్ స్టార్ గా మారిపోయింది. తండ్రి లెగసీని ఆయన విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇదే పంథాలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా వచ్చిన ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ కూడా సాగింది. `ఈశ్వర్` సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రభాస్‌ను యంగ్ రెబెల్ స్టార్ అని పిలిచేవారు. కృష్ణంరాజు మాస్ ఇమేజ్, ఆవేశం ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌లోనూ కనిపించడంతో అభిమానులు ఆ ట్యాగ్‌ను అమితంగా ఇష్టపడ్డారు. అయితే `బాహుబలి` చిత్రంతో దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించి ఇండియన్ బాక్సాఫీస్ బాద్‌షాగా మారిన తర్వాత ఆయన పేరు ముందు నుంచి యంగ్ అనే పదం తొలిగిపోయింది. కృష్ణంరాజు అసలైన రెబెల్ స్టార్ బిరుదును ప్రభాస్ పూర్తిగా సొంతం చేసుకున్నారు.
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన నాగచైతన్య సైతం అక్కినేని నాగార్జున బిరుదును వారసత్వంగా అందు కున్నారు. ఇండస్ట్రీలో నాగార్జునను కింగ్ అని పిలిచినా? కెరీర్ ఆరంభంలో యువ సామ్రాట్ అనే క్రేజీ ట్యాగ్ ఉండేది. `జోష్` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నాగచైతన్యకు ఆ యువ సామ్రాట్ బిరుదును అక్కినేని అభిమానులు బహుమతిగా ఇచ్చారు. లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకు న్నారు చైతన్య. తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జునల క్లాస్ లెగసీని ఈ బిరుదు ద్వారా ప్రతిబిం బిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది అవకాశాలకే పరిమితం కాకుండా అభిమానుల సెంటిమెంట్‌తో ముడిపడిన బిరుదుల విషయంలోనూ కొనసాగుతోంది. సీనియర్ హీరోలు సాధించిన ఘనతలను, వారి లెగసీని గౌరవిస్తూనే.. ప్రస్తుత జనరేషన్ స్టార్స్ ఆయా బిరుదులను తమ భుజాలపై వేసుకుని బాక్సాఫీస్ వద్ద పరుగు తీస్తున్నారు.బిరుదులు అందుకున్నంత ఈజీ కాదు కెరీర్ లో విజయాలు అందుకోవడం. అందుకోసం ఎంతో కష్టప డాలి.మారుతున్న కాలానికి అనుగుణంగా వైవిధ్యమైన కథలతో ఆయా బిరుదుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నవ తరం వారసులపై ఎంతైనా ఉందన్నది కాదనలేని నిజం.