రావు బహదూర్.. వంగా మస్ట్ వాచ్ ట్యాగ్
తాజాగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలపడం విశేషంగా మారింది.
సత్యదేవ్ ప్రధాన పాత్రలో, వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన రావు బహదూర్ సినిమా రిలీజైనప్పటి నుంచి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంటోంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, పెర్ఫార్మెన్స్, టెక్నికల్ వాల్యూస్ పరంగా ఈ సినిమాను ఇప్పటికే పలువురు ప్రముఖులు అభినందించగా, తాజాగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలపడం విశేషంగా మారింది.
ఎన్ని సినిమాలను చూసినా కేవలం తనకు నిజంగా నచ్చిన సినిమాలకే తన అభినందనలు తెలియజేస్తుంటారు సందీప్. అలాంటి వంగా, రావు బహదూర్ ను చూసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రశంసలు చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని అందించడమే కాకుండా, సినిమా చూడని ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ విషయమై ఎక్స్ వేదికగా రెస్పాండ్ అయిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడే రావు బహదూర్ చూశానని, మనం సినిమాలను ఎందుకు ప్రేమించడం ప్రారంభించామో మరోసారి గుర్తు చేసే అరుదైన, విలువైన సినిమాల్లో ఇది కూడా ఒకటని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒక మంచి కథను ఎంత హృద్యంగా చెప్పవచ్చో ఈ సినిమా నిరూపించిందని ఆయన అభినందించారు.
అంతేకాకుండా ప్రతి నిజమైన సినిమా ప్రేమికుడికి తన అభ్యర్థనగా ఓ మాటను కూడా చెప్పారు. మీ లైఫ్ లో మూడు గంటలు ఈ సినిమాకు కేటాయించండని, ఈ సినిమా మీ టైమ్, మీ ఓపిక, మీ చప్పట్లు పొందడానికి పూర్తిగా అర్హత ఉందంటూ ఆడియన్స్ ను థియేటర్లకు రావాలని కోరారు. చివరగా చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్తూ, ఇలాంటి సినిమాలను తప్పకుండా సెలబ్రేట్ చేయాలని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే మహేష్ బాబు, సుకుమార్, నాగచైతన్య, నాని, అడివి శేష్ వంటి టాలీవుడ్ సెలబ్రిటీలు రావు బహదూర్ సినిమాను ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఆ లిస్ట్ లో చేరడంతో సినిమాకు మరింత బలమైన మౌత్ పబ్లిసిటీ లభిస్తోంది. ఇక చెన్నైలో నిర్వహించిన స్పెషల్ ప్రీమియర్ నుంచి కూడా సినిమాకు మంచి ప్రశంసలొచ్చాయి. స్టోరీ టెల్లింగ్, క్యారెక్టర్స్ డిజైన్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్, టెక్నికల్ క్వాలిటీ రావు బహదూర్‌ను క్లాసిక్ స్థాయికి తీసుకెళ్లాయని వారు అభిప్రాయపడ్డారు. ప్రముఖ దర్శకులు, సినీ ప్రముఖుల నుంచి వరుసగా వస్తున్న ప్రశంసలు రావు బహదూర్ కు బాక్సాఫీస్ వద్ద మరింత ఊపునిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంటెంట్‌కు ప్రాధాన్యతనిచ్చే ఆడియన్స్ ఈ సినిమాను థియేటర్లలో ఆదరిస్తుండగా, తాజాగా సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ సినిమా చుట్టూ మరింత చర్చకు దారితీశాయి.