రామ్ కు జోడీగా లక్కీ హీరోయిన్!
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ పేరు చాలా గట్టిగా వినిపిస్తోంది.
రామ్ పోతినేని కెరీర్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న #RAPO23 చుట్టూ ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. హీరోగా వరుస సినిమలతో ప్రేక్షకులను అలరించిన రామ్, ఈసారి పూర్తిగా కొత్త బాధ్యతను తీసుకుంటూ స్టోరీ రైటర్, డైరెక్టర్ గా కూడా తన లక్ ను టెస్ట్ చేసుకోబోతున్నారు. ఇదే ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెరగడానికి మెయిన్ రీజన్‌గా మారింది. తన సొంత బ్యానర్ రాపో సినిమాటిక్స్‌పై కృష్ణ పొతినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కెరీర్‌లో ఇప్పటివరకు చేయని స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. రామ్ డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతీ విషయాన్ని స్వయంగా అతనే స్పెషల్ కేర్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ పేరు చాలా గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సంయుక్తను ఈ ప్రాజెక్ట్ కోసం సంప్రదించినట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. సంయుక్తకు అసలే టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అనే పేరుంది. ఆమె నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ఒకవేళ ఈ సినిమాలో ఆమె కనుక కన్ఫర్మ్ అయితే దీనిపై అంచనాలు పెరిగే అవకాశాలుండటంతో పాటూ, సినిమాలో రామ్- సంయుక్త జంట మొదటిసారి వెండితెరపై కనిపించనుంది.
#RAPO23 కథ పూర్తిగా రామ్ స్వయంగా రాసుకున్న ఒరిజినల్ కాన్సెప్ట్ అనే విషయం తెలిసిందే. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా నియో- నోయర్ శైలిలో సాగనుందని సమాచారం. ఇప్పటివరకు తెలుగు కమర్షియల్ సినిమాల్లో పెద్దగా టచ్ చేయని అంశాలను కథలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. కథలో క్యారెక్టర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో పాటు, ప్రతి క్యారెక్టర్ ఎమోషన్స్ కు బలమైన నేపథ్యం ఉండేలా స్క్రీన్‌ప్లేను రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఊహించని మలుపులతో కథ ముందుకు సాగేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.
టెక్నికల్ గా కూడా ఈ సినిమాను అత్యున్నత స్థాయిలో రూపొందించే ప్రయత్నం జరుగుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ తిరునవుక్కరసు ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతల్ని నిర్వహిస్తుండగా, ఇండియన్ సినీ హిస్టరీలో ఎంతో పేరున్న యాక్షన్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన పీటర్ హెయిన్స్ యాక్షన్ ఎపిసోడ్లను డిజైన్ చేస్తున్నారు. విజువల్ టోన్, యాక్షన్ బ్లాక్స్, కథ చెప్పే విధానం ఈ సినిమాకి ప్రధాన బలాలుగా నిలవనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశముంది. రామ్ కెరీర్‌లోనే ఎంతో ప్రిస్టీజియస్ ప్రాజెక్టుగా భావిస్తున్న రాపో23 ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.