ఈషా యోగా సెంటర్‌లో సమంత: ఐదేళ్ల ఆధ్యాత్మిక ప్రయాణంపై ఎమోషనల్!
గత ఐదేళ్లుగా ఈ ఆధ్యాత్మిక కేంద్రంతో ఉన్న అనుబంధం తన జీవితంలో తెచ్చిన మార్పులను, వ్యక్తిగత ఎదుగుదలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేసుకున్నారు.
సమంత రూత్ ప్రభు కోయంబత్తూరులోని `ఈషా యోగా సెంటర్`ను మరోసారి సందర్శించారు. గత ఐదేళ్లుగా ఈ ఆధ్యాత్మిక కేంద్రంతో ఉన్న అనుబంధం తన జీవితంలో తెచ్చిన మార్పులను, వ్యక్తిగత ఎదుగుదలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేసుకున్నారు. అక్కడ గడిపిన ప్రశాంతమైన క్షణాలతో పాటు తన మనసులోని భావాలను వివరిస్తూ ఒక సుదీర్ఘమైన స్ఫూర్తిదాయక నోట్‌ను పోస్ట్ చేశారు.
సమంత తన పోస్ట్‌లో పేర్కొంటూ .. మిమ్మల్ని విస్తరింపజేసే.. మీ పరిధిని పెంచే వ్యక్తులను.. ప్రాంతాలను వెతుక్కోండి. జీవితంలో ఒకానొక దశకు వచ్చాక మన గురించి మనకు అన్నీ తెలుసని.. ఇవే మన బలాలు.. ఇవే మన పరిమితులు అని అనుకుంటూ ఉంటాం. బహుశా మనం ఇంతవరకే వెళ్లగలమని ఒక హద్దు గీసుకుంటాం... కానీ గత ఐదేళ్లు నాకు అంతకుమించినది ఏదో ఉందని నేర్పించాయి! అని తెలిపారు.
ప్రతిసారి ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించినప్పుడు తనలో కొత్త కోణాలు ఆవిష్కృతమవుతాయని సమంత పేర్కొన్నారు. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ.. నాలో మరిన్ని కొత్త అవకాశాలు ఉన్నాయనే నమ్మకంతో తిరిగి వెళ్తాను. నేర్చుకోవాల్సింది.. మారాల్సింది.. సాధించాల్సింది ఇంకా చాలా ఉందనే భావన నాలో కలుగుతుంది. మనల్ని సరైన మార్గంలో నడిపించే మార్గదర్శకులు చేసే పని కూడా ఇదే అని సామ్ రాసుకొచ్చారు.
గురువుల ప్రాముఖ్యత గురించి వివరిస్తూ .. సరైన మార్గదర్శకులు మనం ఎలా ఉండాలో నిర్దేశించరు.. కానీ మన ఆవిష్కరణ ఇంకా పూర్తికాలేదని నిరంతరం గుర్తుచేస్తారు. వారు మన ప్రయాణానికి అవసరమైన ఇంధనాన్ని నింపుతారు. అటువంటి మంచి వ్యక్తులను, ప్రాంతాలను కనుగొనండి. మిమ్మల్ని మీరు నిరంతరం కొత్తగా ఆవిష్కరించుకుంటూ ముందడుగు వేయండి! అని అభిమానులకు పిలుపునిచ్చారు.
ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేస్తున్న సమంత ఈ ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఎంతో ఉపశమనాన్ని పొందుతున్నారు. సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు ..తను రాసిన సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అగ్ర నటి సమంత సింప్లిసిటీకి.. ప్రశాంతమైన జీవనశైలికి అభిమానులు కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు.