వ్వాటే ట్యాలెంట్: గోదారి యాసతో అదరగొడుతున్న సంగీత్ శోభన్.. వేదికపై మాట తీరుకు ఫిదా అవ్వాల్సిందే!
టాలీవుడ్‌లో తనదైన టైమింగ్‌తో, సహజ సిద్ధమైన నటనతో యంగ్ జనరేషన్ ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్న కథానాయకుడు సంగీత్ శోభన్.
టాలీవుడ్‌లో తనదైన టైమింగ్‌తో, సహజ సిద్ధమైన నటనతో యంగ్ జనరేషన్ ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్న కథానాయకుడు సంగీత్ శోభన్. సినిమా వేదికలైనా.. ప్రెస్ మీట్లైనా తడుముకోకుండా.. ఎలాంటి భయం- సంకోచాలు లేకుండా మాట్లాడటం అతడి ప్రత్యేకత. ఆ సమయస్ఫూర్తి... మాట తీరు వెనక ఉన్న అపారమైన ప్రతిభే అతడిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. తాజాగా `అంతా రాములు చూసుకుంటారు` సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ వేడుకలో కూడా సంగీత్ శోభన్ తన సంభాషణలతో... ముఖ్యంగా గోదావరి యాసతో ఈవెంట్ మొత్తాన్ని ఎంతో ఆకట్టుకునేలా మార్చేశాడు.
గోదావరి జిల్లా పరిసరాల నేపథ్యం అనగానే గుర్తొచ్చే అమాయకత్వం.. అతిథి మర్యాదలు.. ఆత్మీయత కలబోసిన యాసను సంగీత్ శోభన్ వేదికపై పలికించిన తీరు ఆకట్టుకుంది. యాంకర్ కోరిక మేరకు ప్రసంగం ప్రారంభంలోనే ``ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? రేయ్ అందరికీ వాటర్ ఇచ్చేయండిరా.. కూలింగ్ ఉండాలి!`` అంటూ గోదావరి శైలిలో సరదాగా పలకరించడం అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తింది. ఉదయాన్నే ప్రెస్ మీట్ కి వచ్చిన మీడియా మిత్రులను అంత ఆప్యాయంగా పలకరించడం.. తనకున్న హ్యూమర్ సెన్స్‌ను, యాసపై ఉన్న పట్టును మరోసారి నిరూపించింది.
తెలుగు సినీ పరిశ్రమలో గోదావరి యాసను సంభాషణల్లో వాడటం కొత్తేమీ కాదు. కానీ సంగీత్ శోభన్ తన పాత్రలలో ఆ యాసను ఉపయోగించేటప్పుడు అందులో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. గతంలో అతడు నటించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ MAD చిత్రంలో తన నటన- సంభాషణల శైలితో ప్రేక్షకులను మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో కనిపించిన కామెడీ టైమింగ్.. డైలాగ్ డెలివరీ అతడికి ఎంతో ప్లస్ అయ్యాయి. అదే బాటలో రానున్న `అంతా రాములు చూసుకుంటారు` చిత్రంలో కూడా పక్కా గోదావరి కుర్రాడిగా నటిస్తూ.. ఆ ప్రాంతపు యాస - అమాయకత్వాన్ని వినోదాత్మకంగా చూపించబోతున్నాడు.
ఈ వేడుకలో సంగీత్ మాట్లాడిన విధానం ఆయన ప్రతిభను ఎలుగెత్తి చాటింది. MAD సినిమా సమయం నుంచి లభిస్తున్న ఆదరణను ప్రస్తావిస్తూ.. ఈ పాజిటివిటీని ఏదో రకంగా `ఆ రాముడే చూసుకుంటున్నాడు` అని సమయస్ఫూర్తితో చెప్పడం విశేషం. తాను ఆరు నెలలకోసారి మాత్రమే మీడియా ముందుకు వస్తానని.. ఆ సమయంలో అసలు ఫోన్లు కూడా ఎత్తనని నవ్వుతూ నిజాయితీగా వ్యాఖ్యానించడం అతడి కేర్‌ఫ్రీ మానరిజాన్ని ప్రతిబింబించింది. సుదీర్ఘమైన ప్రసంగాలతో విసిగించకుండా.. ఆడియన్స్‌తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టాలని కోరడం మీడియాపై ఆయనకున్న గౌరవానికి నిదర్శనం.
ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా... మైక్ ముందుకు రాగానే వేదికపై తడుముకోకుండా మాట్లాడే సంగీత్ శోభన్ నైజం నిజంగా అభినందనీయం. వేదికపై ఏ విషయం మాట్లాడినా ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా... ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా మార్చగలిగే విలక్షణమైన టాలెంట్ అతడి సొంతం. గోదావరి యాసను ఆయుధంగా మలచుకుని... స్పాంటేనియస్‌గా పంచ్‌లు వేస్తూ ముందుకు సాగుతున్న ఈ యంగ్ హీరో, `అంతా రాములు చూసుకుంటారు` చిత్రంతో బాక్సాఫీస్ వద్ద కూడా మరిన్ని విజయాలు సాధిస్తాడని ఆశిద్దాం.