ఇండ‌స్ట్రీకి స్వీటీ గుడ్ బై చెప్పేస్తుందా?

అనుష్క శెట్టి గ్లామర్ పాత్రలకే పరిమితం కాలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హీరోలకు సమానంగా వసూళ్లు రాబట్టిన నటి.

Update: 2026-09-07 13:30 GMT

లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న కథానాయిక అనుష్క శెట్టి. `అరుంధతి`, `భాగమతి`, `బాహుబలి` వంటి భారీ చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్వీటీ గత కొంతకాలంగా వెండితెరకు.. మీడియా ప్రమోషన్లకు దూరంగా ఉండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమ్మ‌డు నటించిన చిత్రాలు విడుద‌ల‌వుతున్నా? ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం అనుష్క నటనా జీవితానికి ముగింపు పలకాలనే ఆలోచనలో ఉన్నట్లు పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అనుష్క మలయాళంలో తెర‌కెక్కుతోన్న భారీ బడ్జెట్ జానపద చిత్రం `కథనార్: ది విల్డ్ సోర్సరర్` లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఫలితంపైనే అనుష్క భవిష్యత్తు ప్రణాళికలు ఆధారపడి ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గతంలో క్రమం తప్పకుండా వరుస సినిమాలు చేసిన అనుష్క ఇటీవల కాలంలో కథల ఎంపికలో అత్యంత జాగ్రత్త వహిస్తున్నారు. మనసుకు నచ్చిన, ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మాత్రమే ఓకే చెబుతున్నారు. అయితే సినిమాల ఎంపిక తగ్గించడంతో పాటుగా ఆయా చిత్రాల ప్రచార వేదికలపై ఆమె కనిపించకపోవడం అభిమానులను కలవరపెడుతోంది.

పర్సనల్ లైఫ్, ఫిట్‌నెస్ లైఫ్‌స్టైల్‌పై దృష్టి పెట్టడం వల్లే ఆమె గ్లామర్ ప్రపంచానికి కాస్త విరామం ఇచ్చారని కొందరు విశ్లేషిస్తున్నారు. `కథనార్` చిత్రం పాన్-ఇండియా స్థాయిలో అత్యంత అట్టహాసంగా విడుదల కానుంది. ఈ సినిమా కనుక బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధిస్తే అనుష్క‌ కెరీర్‌ను మరికొంత కాలం కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ప్రాజెక్ట్ ఫలితం తారుమారైతే స్వీటీ పూర్తిస్థాయిలో చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పి, వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్ర‌చారం మొద‌లైంది.

అనుష్క శెట్టి గ్లామర్ పాత్రలకే పరిమితం కాలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హీరోలకు సమానంగా వసూళ్లు రాబట్టిన నటి. టాలీవుడ్, కోలీవుడ్‌లలో తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న అమ్మ‌డు పరిశ్రమను వీడుతున్నారనే వార్తలు అభిమానులను నిరాశకు గురి చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా స్వీటీ తిరిగి పూర్తిస్థాయిలో సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఏది ఏమైనా? `కథనార్` చిత్రం విడుదలయ్యే వరకు ఈ ప్రచారాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. అనుష్క‌ నిర్ణయం ఏదైనా? అమ్మ‌డు మళ్లీ పూర్వ వైభవంతో వెండితెరపై మెరవాలని.. మరిన్ని పవర్‌ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని అభిమానులు మాత్రం బ‌లంగా కోరుకుంటున్నారు.

Tags:    

Similar News