సాయి పల్లవికి భర్తపైన ఇన్ని ఆశలు ఉన్నాయా..!
సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో.. సహజమైన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన వ్యక్తిగత విషయాల గురించి మాత్రం ఎక్కువగా మాట్లాడరు.
సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో.. సహజమైన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన వ్యక్తిగత విషయాల గురించి మాత్రం ఎక్కువగా మాట్లాడరు. అయితే తాజాగా తనకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలో సాయి పల్లవి చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా తన భర్తకు వంట చేయడం కూడా వచ్చి ఉండాలని ఆమె చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాయి పల్లవి ప్రస్తుతం నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీత పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె తన సహనటులు రణబీర్ కపూర్, రవి దూబేతో కలిసి ప్రముఖ టీవీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 18 లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్.. సాయి పల్లవిని తనకు కాబోయే జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారని అడిగారు. దీనికి ఆమె చాలా సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. తనకు పెద్దగా కోరికలు లేవని, ముందుగా అతను మంచి మనిషి అయి ఉండాలని చెప్పారు.
“అన్నింటికంటే ముందు అతను మంచి మనిషి అయి ఉండాలి. నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలి. ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పులు చేస్తుంటారు. అయితే తాను చేసిన తప్పు ఏమిటో తెలుసుకునే మనస్తత్వం ఉండాలి. తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించి, మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తన తప్పులకు ఇతరులను బాధ్యులను చెయ్యకూడదు,” అని నాలుగు లక్షణాలు చెప్పుకొచ్చింది సాయి పల్లవి.
అన్నిటికన్నా మించి తనకు వంట చేయడం కూడా రావాలి అని చెప్పింది. మొత్తానికి ఇన్ని కోరికలు చెప్పడంతో.. సాయి పల్లవికి భర్త పైన ఎన్ని ఆశలు ఉన్నాయా అని అందరూ తమాషాగా కామెంట్లు పెడుతున్నారు.
ఇదే కార్యక్రమంలో సాయి పల్లవి తన రామాయణం సినిమా గురించి కూడా మాట్లాడారు. సాధారణంగా ఒక పాత్రను అంగీకరించినప్పుడు ఆ పాత్రకు తాను ఏమి చేయగలననే విషయాన్ని ఆలోచిస్తానని చెప్పారు. కానీ సీత పాత్ర విషయంలో మాత్రం తన ఆలోచన మారిందని తెలిపారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళిక సిద్ధం చేసింది.