డిఎస్పీ సంకి ఊచకోత: కల్ట్ రిలీజ్ ట్రైలర్ ఎలా ఉందంటే?
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ చిత్రం 'కల్ట్' రేపే థియేటర్లలోకి రాబోతోంది.
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ చిత్రం 'కల్ట్' రేపే థియేటర్లలోకి రాబోతోంది. సందీప్ కాకర్ల నిర్మించిన ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్లు సోషల్ మీడియాలో యూత్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు ప్రేక్షకుల్లో మరింత హైప్ పెంచేందుకు మేకర్స్ ఒక పదునైన రిలీజ్ ట్రైలర్ ను వదిలారు. ఇందులో పూర్తిగా విశ్వక్ సేన్ పోషించిన డిఎస్పీ సంకి పాత్ర మీదే ఫోకస్ పెట్టారు.
ట్రైలర్ కట్ చూస్తే కథ అసలు పాయింట్ ఏంటో క్లియర్ గా అర్థమవుతోంది. గోవా బీచ్ లో తెలుగు వాళ్లపై జరిగిన దాడి చుట్టూ ఈ కథ తిరుగుతోంది. నాన్ లోకల్స్ స్థానికులు చేసే దాడులు, అరాచకాలను అణచివేయడానికి రంగంలోకి దిగిన ఒక అన్ కాంప్రమైజింగ్ పోలీస్ ఆఫీసర్ గా విశ్వక్ సేన్ కనిపిస్తున్నారు. "నాన్ లోకల్ సంతోషంగా ఉంటేనే లోకల్ లో సంచి నిండుతుంది రా.. లేదంటే గోవా గాలికి పోతది" అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఈ కాన్ఫ్లిక్ట్ తీవ్రతను తెలియజేస్తోంది.
తన కోపాన్ని ఆపుకోలేని స్వభావం ఉన్న పాత్ర కావడంతో, ఆయన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ చాలా అగ్రెసివ్ గా డిజైన్ చేశారు. మేకింగ్ పరంగా చూస్తే దర్శకుడు రెగ్యులర్ పోలీస్ డ్రామాలా కాకుండా, దీన్ని ఒక రా స్లాషర్ యాక్షన్ చిత్రంగా మలిచారు. క్లబ్ సెటప్ లో సాగే ఫైట్లు, నియోన్ లైటింగ్, గొంతులు తెగడం, తలల్లోకి ఆయుధాలు దిగడం లాంటి సన్నివేశాలు చూస్తుంటే ఇది పక్కా 'ఎ' సర్టిఫికేట్ కంటెంట్ అని అర్థమైపోతోంది.
రక్తపాతం, హింస విషయంలో ఎక్కడా తగ్గకుండా నేటి తరం యాక్షన్ ప్రియులను మెప్పించేలా విజువల్స్ ప్లాన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆ ఇంటెన్స్ మూడ్ కు సరిగ్గా సెట్ అయింది. అయితే ఈ తరహా సినిమాలకు కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. మితిమీరిన హింస, పచ్చి బూతులు ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం కాస్త కష్టమే.
అలాగే ఈ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఇష్యూ కేవలం నాలుగు ఫైట్లు, రక్తం పారే సీన్లకే పరిమితం కాకుండా కథలో బలమైన ఎమోషన్ ను కలిగి ఉంటేనే థియేటర్లలో నిలబడుతుంది. ట్రైలర్ లో చూపించిన జోష్ సినిమా అంతా మెయింటైన్ అయి స్క్రీన్ప్లే గ్రిప్పింగ్ గా సాగితే, మాస్ ఆడియన్స్ కు కావాల్సినంత పైసా వసూల్ కిక్ దక్కడం ఖాయం. నటుడిగా, దర్శకుడిగా విశ్వక్ సేన్ తీసుకున్న ఈ స్లాషర్ జానర్ రిస్క్ ఎంతవరకు ఫలిస్తుందో రేపటి బాక్సాఫీస్ రిపోర్ట్ తేల్చనుంది.