హిట్ సినిమా బాటలోనే కల్ట్..!

సినిమాల్లో వైలెన్స్ ఎక్కువగా ఉంటే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అయితే అదే సమయంలో కొంతమంది ప్రేక్షకులు అలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడరు.

Update: 2026-10-29 09:13 GMT

సినిమాల్లో వైలెన్స్ ఎక్కువగా ఉంటే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అయితే అదే సమయంలో కొంతమంది ప్రేక్షకులు అలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడరు. ముఖ్యంగా చిన్న పిల్లలు, గుండె ధైర్యం తక్కువగా ఉన్నవాళ్లు, గర్భిణీలు ఇలాంటి సినిమాలకు దూరంగా ఉండాలని హీరోలు చెప్పడం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా తన కొత్త సినిమా కల్ట్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు.

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా కల్ట్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను కేవలం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తీయలేదని, ప్రేక్షకులకు ఒక వైల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నించానని విశ్వక్ చెప్పాడు.

అంతేకాదు, వీక్ హార్టెడ్ పీపుల్, చిన్న పిల్లలు తన సినిమాకు దూరంగా ఉండాలని సూచించాడు. గర్భిణీలు కూడా సినిమా చూడటానికి రావద్దని కోరాడు. థియేటర్లలో సౌండ్ వాల్యూమ్‌ను 6 లేదా 7 స్థాయిలో ఉంచాలని థియేటర్ యజమానులకు విజ్ఞప్తి చేశాడు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే సినిమాలో యాక్షన్, హింస ఏ స్థాయిలో ఉంటాయోననే ఆసక్తి పెరుగుతోంది.

అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మన హీరోలకి ఇదే మొదటిసారి కాదు. గతంలో నాని నటించిన హిట్ 3 సినిమా విషయంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఆ సినిమాలోనూ హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో, వీక్ హార్టెడ్ పీపుల్ సినిమా చూడటానికి ముందు ఆలోచించాలని, గర్భిణీలు దూరంగా ఉండాలని నాని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు. అయితే ఇలా ముందుగానే హెచ్చరించడం వల్ల కొంతమంది ప్రేక్షకులు సినిమా చూడటానికి వెనుకడుగు వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకునేవారు తప్పకుండా చూడకూడదు అనుకుంటారు.

అయినా విశ్వక్ సేన్ తన సినిమా విషయంలో ఇంత ధైర్యంగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు తాను చేసిన సినిమాల్లో కల్ట్ అతిపెద్ద కమర్షియల్ సినిమా అని కూడా చెప్పాడు. హసినిమా విడుదలైన తర్వాత నవంబర్ 1న దాని గురించి మాట్లాడుకుందామని విశ్వక్ సేన్ సవాల్ విసిరినట్లుగా వ్యాఖ్యానించాడు. మరి హిట్ సినిమా తరహాలో కల్ట్ కూడా ప్రేక్షకుల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచి సూపర్ హిట్ అందుకునే దారిలో వెళుతుందా.. విశ్వక్ చెబుతున్న వైల్డ్ ఎక్స్‌పీరియన్స్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.



Tags:    

Similar News