ఇలాంటి పని ఎందుకు చేశారు బుచ్చిబాబు..!

దర్శకుడు బుచ్చిబాబు సాన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Update: 2026-10-29 09:19 GMT

దర్శకుడు బుచ్చిబాబు సాన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మొదటి సినిమా ఉప్పెనతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్ పాత్రతో పాటు హీరోయిన్ బేబమ్మ పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. కృతి శెట్టి తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రకు బుచ్చిబాబు.. ఇచ్చిన ప్రాధాన్యత అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది.

అలాంటి దర్శకుడు తన రెండో చిత్రమైన పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను ఎలా రాశారనే ప్రశ్నలు అందరిలోనూ మొదలయ్యాయి. మొదటి సినిమాలో హీరోయిన్ పాత్రను అంత బలంగా చూపించిన బుచ్చిబాబు, ఈ సినిమాలో మాత్రం ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు చాలా గట్టిగా వినిపించాయి. ప్రాధాన్యత ఇవ్వకపోగా అసలు ఆ సినిమాలో జాన్వి కపూర్ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు అని కూడా ఎంతోమంది ప్రశ్నలు వేశారు.

ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తాజాగా జాన్వీ కపూర్ కూడా పెద్ది సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ సినిమాలో జరిగిన విషయాలకు తన వంతు బాధ్యత తీసుకోవాల్సి ఉందని చెప్పారు. సినిమాలో మహిళను చూపించిన విధానం సమస్యాత్మకంగా ఉందని, మహిళలను కేవలం అందాల ప్రదర్శనకు పరిమితం చేయడం తప్పని ఆమె అభిప్రాయపడ్డారు.

దక్షిణాది సినిమాల్లో చాలా సందర్భాల్లో ముందుగానే పూర్తిస్థాయి స్క్రిప్ట్ ఉండదని, కెమెరా యాంగిల్స్ వంటి వివరాలు కూడా స్క్రిప్ట్‌లో స్పష్టంగా ఉండకపోవచ్చని జాన్వీ చెప్పారు. దర్శకుడు చెప్పినట్లు వృత్తిపరంగా నడుచుకోవాలనే ఒత్తిడి కూడా ఉంటుందని వివరించారు. అయితే, తనకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని మరింత గట్టిగా ప్రశ్నించాల్సిందని ఇప్పుడు అనిపిస్తోందని అంగీకరించారు.

అయితే..ఇక్కడే బుచ్చిబాబు గురించి ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఉప్పెనలో హీరోయిన్ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దిన ఆయన, 'పెద్ది' విషయంలో ఇలాంటి విమర్శలు వచ్చేలా ఎందుకు చేశారు అనేది చాలామందిలో మొదలైన ప్రశ్న. జాన్వీ పాత్రను ఎంతో బాగా రాశానని ఆయన సినిమా విడుదల సమయంలో కూడా చెప్పారు. కానీ తెరపై ఆ పాత్ర అసలు అర్థం పడటం లేకుండా కనిపించింది.

బుచ్చిబాబు గురువైన సుకుమార్ పుష్ప సినిమాలో రష్మిక క్యారెక్టర్ పెద్దగా రాసుకోకపోయినా ఆ తప్పుని రెండో భాగంలో పూర్తిగా సరిదిద్దారు. అందుకే అప్పట్లో అతని పైన ఎలాంటి వివాదాలు రాలేదు. కానీ బుజ్జి బాబు మాత్రం పెద్ది సినిమాలో జాన్వి కపూర్ కి అర్థం పడటం లేని క్యారెక్టర్ ఆలోచించకుండా రాసినట్లే అందరికీ అనిపించడం.. ఆయన మీద నెగిటివిటీ పెంచింది.

ఒక సినిమా ద్వారా మహిళల గురించి సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తుందో కూడా దర్శకులు ఆలోచించాలి. హీరోయిన్ లేకపోయినా సినిమాలు చూసే పరిస్థితిలో ప్రస్తుతం ప్రేక్షకులు ఉన్నారు కానీ.. హీరోయిన్ ని అసలు ఎందుకు పెట్టారో అర్థం కాకపోయినా చూసే పరిస్థితిలో మాత్రం వాళ్ళు లేరు.. మన దర్శకులు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే.

Tags:    

Similar News