సుకుమార్ సినిమాలు ఇప్పుడు పుస్తకంలోకి!
ఇప్పుడు దర్శకుడు సుకుమార్‌పై అలాంటి ప్రయత్నమే జరిగింది. డాక్టర్ ప్రవీణ్ యజ్జల రాసిన ‘స్క్రీన్‌ప్లే మాస్టర్.. సుకుమార్’ పుస్తకాన్ని ప్రకటించారు.
ఒక దర్శకుడి సినిమాలు హిట్ అయిన తర్వాత వాటి కథ, మేకింగ్ గురించి మాట్లాడటం కామన్. కానీ ఆ దర్శకుడు స్క్రీన్‌ప్లే ఎలా రాస్తాడు, కథను ఎక్కడ మలుపు తిప్పుతాడు, పాత్రలతో ప్రేక్షకుడిని ఎలా ప్రిపేర్ చేయిస్తాడు అనే విషయాలపై ఏకంగా పుస్తకం రావడం మాత్రం అరుదు. ఇప్పుడు దర్శకుడు సుకుమార్‌పై అలాంటి ప్రయత్నమే జరిగింది. డాక్టర్ ప్రవీణ్ యజ్జల రాసిన ‘స్క్రీన్‌ప్లే మాస్టర్.. సుకుమార్’ పుస్తకాన్ని ప్రకటించారు.
సుకుమార్ సినిమాల్లో కథ చెప్పే విధానం మొదటి సినిమా నుంచే కొంచెం భిన్నంగా ఉంటుంది. ‘ఆర్య’లో ప్రేమకథను తీసుకున్నా, ‘జగడం’లో హీరో క్యారెక్టర్‌ను నడిపించినా, ‘వన్ నేనొక్కడినే’లో ప్రేక్షకుడినే కన్ఫ్యూజన్‌లో పెట్టినా ఆయన స్క్రీన్‌ప్లే మీద ఎక్కువ ఆలోచిస్తారనే గుర్తింపు వచ్చింది. ఒక సీన్‌లో కనిపించిన చిన్న విషయం తర్వాత కథలో ఎక్కడో ఉపయోగపడటం ఆయన సినిమాల్లో చాలాసార్లు కనిపిస్తుంది.
‘రంగస్థలం’ వచ్చాక సుకుమార్ కథలు మరో లెవెల్ కు వెళ్లాయి. క్లిష్టమైన స్క్రీన్‌ప్లే మాత్రమే కాదు, చాలా సింపుల్‌గా కనిపించే గ్రామీణ కథలో కూడా తన మార్క్ చూపించాడు. చిట్టిబాబు వినికిడి సమస్యను కథలో భాగంగా మార్చిన విధానం, చివర్లో వచ్చే ట్విస్ట్ తీరుపై అప్పట్లో ఎక్కువగా మాట్లాడుకున్నారు. తర్వాత ‘పుష్ప’తో అదే రచనాతో పూర్తిగా కమర్షియల్ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.
ఇక సుకుమార్‌పై వచ్చిన ఈ పుస్తకం ఆయన సినిమాల కథలను చెప్పే బయోగ్రఫీ తరహాలో ఉండడం లేదు. ప్రపంచ సినిమా సిద్ధాంతాలను తెలుగు కథల్లో సుకుమార్ ఉపయోగించే విధానం, ఆయన స్క్రీన్‌ప్లే నిర్మాణం, ఎమోషన్స్ ను కథలో కలిపే పద్ధతిపై డాక్టర్ ప్రవీణ్ యజ్జల వివరణ ఇచ్చారు. సుకుమార్‌కు రచయితగా కూడా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన దగ్గర పనిచేసిన రచయితలు, సహాయ దర్శకుల్లో చాలామంది తర్వాత దర్శకులుగా మారారు.
‘సుకుమార్ రైటింగ్స్’ పేరుతో ఆయన కొత్త దర్శకులను కూడా ప్రోత్సహిస్తున్నారు. కథపై గంటల తరబడి చర్చించడం, ఒక సీన్‌కు చాలా వెర్షన్లు రాయించడం గురించి ఆయనతో పనిచేసిన వాళ్లు గతంలో పలుమార్లు చెప్పారు. ఈ పుస్తకాన్ని సుకుమార్‌కు అందించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. పుస్తకాన్ని చేతిలో పట్టుకోవడమే కాకుండా ఆయన చదువుతున్న ఫొటో కూడా షేర్ చేశారు. ఇక నెక్స్ట్ సుకుమార్ రామ్ చరణ్ తో మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది.