సర్దార్ 2 కోసం వచ్చాడు.. అడిగింది మాత్రం ఖైదీ 2!
ఖైదీ 2019లో వచ్చింది. అది ఒక రాత్రిలో జరిగే యాక్షన్ కథ మాత్రమే. దిల్లీ ఎవరు, జైలు ఎందుకు వెళ్లాడు, అతని గతం ఏంటి అనే విషయాలు పూర్తిగా చెప్పలేదు.
సర్దార్ 2 రిలీజ్‌కు ఇంకా మూడు రోజులే ఉంది. దాని ఈవెంట్ కోసం కార్తి హైదరాబాద్ వచ్చాడు. కానీ స్టేజ్ దగ్గర నుంచి ఫ్యాన్స్ వేసిన ప్రశ్న మాత్రం మరో సీక్వెల్ గురించి. ఖైదీ 2 ఎప్పుడు అంటూ అరవడంతో, ఖైదీ 2 వస్తది అమ్మ.. దానికి ముందు ఈ సినిమా చూద్దాం అంటూ కార్తి నవ్వేశాడు. లోకేష్‌తో మాట్లాడతానని కూడా ఇదివరకే చెప్పాడు. తన కొత్త సీక్వెల్ ప్రమోషన్‌లో కూడా ఖైదీ 2 పేరు రావడం చూస్తే బజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు.
ఖైదీ 2019లో వచ్చింది. అది ఒక రాత్రిలో జరిగే యాక్షన్ కథ మాత్రమే. దిల్లీ ఎవరు, జైలు ఎందుకు వెళ్లాడు, అతని గతం ఏంటి అనే విషయాలు పూర్తిగా చెప్పలేదు. సినిమా చివర్లో కూడా ఆ పాత్రకు ఇంకా కథ ఉందనేలా వదిలేశారు. అందుకే రెండో భాగం వస్తుందనే మాట మొదటి సినిమా నుంచే ఉంది. కార్తి కూడా అప్పట్లో లోకేష్‌కు తన డేట్స్ ఎక్కువ అవసరం లేదని, ఖైదీ 2 చేయొచ్చని చెప్పాడు.
కానీ ఆ తర్వాత ఖైదీ చుట్టూ ఉన్న ప్రపంచమే పెద్దదైపోయింది. విక్రమ్ వచ్చాక ఖైదీలో కనిపించిన డ్రగ్స్ కథ, పోలీస్ క్యారెక్టర్లు మరో సినిమాలోకి వెళ్లాయి. తర్వాత లియో కూడా అదే ఎల్‌సీయూలో భాగమైంది. ఒకప్పుడు దిల్లీ కథకు సీక్వెల్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్, ఇప్పుడు ఆ మొత్తం యూనివర్స్‌లో దిల్లీ ఎక్కడికి వస్తాడో చూడాలని వెయిట్ చేస్తున్నారు. మధ్యలో రోలెక్స్ లాంటి పాత్ర కూడా రావడంతో ఖైదీ 2 మీద లెక్కలు ఇంకా పెరిగాయి.
సమస్య ఏంటంటే లోకేష్ మాత్రం ఒక్కోసారి మరో సినిమాకు వెళ్లిపోతున్నాడు. ఖైదీ తర్వాత మాస్టర్, విక్రమ్, లియో, కూలీ చేశాడు. ఒక దశలో ఖైదీ 2 త్వరలో మొదలవుతుందని మాటలు వచ్చాయి. కానీ అది జరగలేదు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో కూడా లోకేష్ సినిమా ప్రకటించాడు. పైగా దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ బిజీ అయ్యాడు. అందుకే కార్తి కూడా ఇటీవల లోకేష్ నటిస్తూ తిరుగుతున్నాడని సరదాగా కామెంట్ చేశాడు.
ఇక్కడ విచిత్రం ఏంటంటే కార్తి దగ్గర ఇప్పటికే మరో సీక్వెల్ రెడీ అయిపోయింది. సర్దార్ తర్వాత సర్దార్ 2 కూడా థియేటర్లలోకి వస్తోంది. కానీ ఖైదీ మాత్రం ఏడు సంవత్సరాలుగా మొదటి భాగం దగ్గరే ఆగిపోయింది. కార్తి ఎక్కడికి వెళ్లినా ఖైదీ 2 ప్రశ్న రావడానికి ఇదే కారణం. తమిళ ప్రమోషన్స్‌లోనూ, తెలుగు ఈవెంట్స్‌లోనూ దిల్లీ ఎప్పుడు వస్తాడనే ప్రశ్న అతన్ని వదలడం లేదు.
పైగా ఇప్పుడు ఖైదీ 2 చేయడం 2019లో అనుకున్నంత సింపుల్ కూడా కాదు. అప్పటికి దిల్లీ ఒక్క సినిమా హీరో. ఇప్పుడు అతన్ని విక్రమ్, లియో, రోలెక్స్ ఉన్న ప్రపంచంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. లోకేష్ ఆ కనెక్షన్లు ఎంతవరకు కలుపుతాడు, దిల్లీ కథనే ముందుకు తీసుకెళ్తాడా అనేది మరో లెక్క. ఇక లోకేష్ ఆ కథపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి