యంగెస్ట్ ప్రొడ్యూసర్ కాదు.. కొత్త తరం నిర్మాత!

ఆమెను కేవలం యంగెస్ట్ ప్రొడ్యూసర్ గా పరిచయం చేయడం కంటే, ఈ తరం నిర్మాతల ఆలోచనా విధానానికి ప్రతినిధిగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Update: 2026-09-07 16:30 GMT

సినీ ఇండ‌స్ట్రీలో నిర్మాత అంటే ఎంతో ఎక్స్‌పీరియెన్స్, కోట్ల రూపాయల పెట్టుబడులు, స్టార్ హీరోలతో పరిచయాలు.. సాధారణంగా కనిపించే ఈ ఫార్ములాకు 21 ఏళ్ల అనుప్రియ నాగర్ జ‌ర్నీ పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఆమెను కేవలం యంగెస్ట్ ప్రొడ్యూసర్ గా పరిచయం చేయడం కంటే, ఈ తరం నిర్మాతల ఆలోచనా విధానానికి ప్రతినిధిగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇంగ్లండ్‌లో ఎకనామిక్స్ చదువుతున్న టైమ్ లో టెక్నాలజీ కంపెనీలు, వాటి వ్యవస్థాపకుల గురించి పరిశోధన చేస్తూ స్టీవ్ జాబ్స్‌పై చదివిన ఒక అంశం అనుప్రియ దృష్టిని నీమ్ కరోలీ బాబా వైపు మళ్లించింది. అక్క‌డ మొద‌లైన ఇంట్రెస్ట్ కేవలం ఇన్ఫ‌ర్మేష‌న్ ను తెలుసుకోవడానికే ఆమె పరిమితం చేయ‌లేదు. ఒక బుక్ లేదా కామిక్ రూపంలో ఆ కథను చెప్పాలనుకున్న ఆలోచన, భారత్‌కు వచ్చిన తర్వాత అనుకోకుండా సినిమా నిర్మాణం వరకు వెళ్లింది. ఒక్క సమాచారం, చిన్న పరిశోధన కూడా ఒక వ్యక్తి లైఫ్ ను ఎంత‌గా మార్చ‌గ‌ల‌దో ఆమెను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

అయితే అనుప్రియ స్పెషాలిటీ ఏజ్ లో లేదు, ఆమె తీసుకున్న డెసిష‌న్‌ లో ఉంది. మామ‌లూగా ఎవ‌రైనా స‌రే సినిమా చేయాలి అనుకున్న‌ప్పుడు స్టార్ హీరో, భారీ బడ్జెట్ లేదా సేఫ్ కమర్షియల్ ఫార్ములాను ఆశ్రయించే ప్రయత్నం చేస్తారు. కానీ అనుప్రియ టీమ్ మాత్రం భిన్నమైన అంశాన్ని నమ్మింది. ప్రముఖ స్టార్ పవర్ లేకుండానే, కథలో ఉన్న ఎమోష‌న్, ఆధ్యాత్మిక నేపథ్యం ఆడియ‌న్స్ ను రీచ్ అవుతాయ‌నే నమ్మకంతో ముందుకు వెళ్లింది. అదే ఇప్పుడు హనుమాన్ అంశ్ స‌క్సెస్‌కు మెయిన్ డిస్క‌ష‌న్‌గా మారుతోంది.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే.. చిన్న అంచనాలతో, లిమిటెడ్ బడ్జెట్‌తో మొద‌లైన సినిమా ఇప్పుడు ఫ్రాంచైజీగా విస్తరించే దశకు చేరింది. ఇప్పటికే మరో రెండు భాగాలపై ఆలోచనలు ఉన్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. కానీ అసలు ఛాలెంజ్ కూడా ఇక్కడే మొదలవుతుంది. తక్కువ అంచనాలతో వచ్చిన సినిమా భారీ స‌క్సెస్ ను అందుకోవ‌డం ఒక ఎత్తయితే, ఆ స‌క్సెస్ త‌ర్వాత పార్ట్2, పార్ట్3పై ఏర్పడే అంచనాలను అందుకోవడం మరో ఎత్తు.

మొదటి భాగం స‌క్సెస్ త‌ర్వాత బడ్జెట్ పెరగొచ్చు, సినిమా స్కేల్ విస్తరించొచ్చు, కమర్షియల్ ప్రెజ‌ర్ కూడా పెరగొచ్చు. అయితే మొదటి సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసిన సరళత, కథపై ఉన్న నమ్మకం అదే స్థాయిలో కంటిన్యూ అవుతాయా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అందుకే అనుప్రియకు హనుమాన్ అంశ్ స‌క్సెస్ త‌ర్వాతి సినిమాల విష‌యంలో అస‌లు ప‌రీక్ష‌గా మారింది. 21 ఏళ్ల వయసులో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకోవడం ఒక రికార్డు అయితే, ఆ గుర్తింపును కొత్త తరహా కథలతో నిలబెట్టుకోవడమే ఆమె ముందున్న అసలైన‌ ఛాలెంజ్.

Tags:    

Similar News