సిట్టింగ్స్ వరకు వెళ్లిన బోయపాటి, కార్తి.. సినిమా ఎక్కడ ఆగింది?
సర్దార్ 2 ఈవెంట్‌లో బోయపాటి శ్రీను సరదాగా చెప్పిన ఒక మాట పాత కాంబినేషన్‌ను మళ్లీ గుర్తు చేసింది. కార్తితో గతంలో చాలా సిట్టింగ్స్ వేశానని ఆయన స్టేజ్ మీదే చెప్పారు.
సర్దార్ 2 ఈవెంట్‌లో బోయపాటి శ్రీను సరదాగా చెప్పిన ఒక మాట పాత కాంబినేషన్‌ను మళ్లీ గుర్తు చేసింది. కార్తితో గతంలో చాలా సిట్టింగ్స్ వేశానని ఆయన స్టేజ్ మీదే చెప్పారు. వెంటనే అవి కథా చర్చలేనని నవ్వుతూ క్లారిటీ ఇచ్చారు. అంటే బోయపాటి, కార్తి సినిమా గురించి బయట వినిపించిన మాటలు పూర్తిగా గాల్లో పుట్టినవి కావన్న విషయం ఇప్పుడు ఆయన మాటలతోనే తెలిసింది.
నిజానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే బోయపాటి, కార్తి కలిసి సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం వచ్చింది. కార్తికి సరిపోయే మాస్ కథను బోయపాటి సిద్ధం చేశారని కూడా వార్తలు వచ్చాయి. అప్పట్లో అధికారికంగా ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగిన విషయాన్ని బోయపాటి స్వయంగా చెప్పాడు. ఆ సిట్టింగ్స్ ఏ కథ కోసం జరిగాయి, ఎంత దూరం వెళ్లాయి అన్నది మాత్రం బయటకు రాలేదు.
ఈ కాంబినేషన్ వినగానే ఆసక్తి రావడానికి కారణం ఇద్దరి స్టైల్ పూర్తిగా ఒకేలా లేకపోవడమే. బోయపాటి హీరో అంటే భారీ ఎలివేషన్స్, కుటుంబ నేపథ్యం, మాస్ యాక్షన్ ఎక్కువగా కనిపిస్తాయి. కార్తి మాత్రం ఖైదీ, ఖాకీ, సర్దార్ లాంటి యాక్షన్ సినిమాలు చేసినా ప్రతి సినిమాలో ఒకే రకమైన హీరోగా కనిపించడు. పాత్రకు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడం అతని సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
అందుకే కార్తిని బోయపాటి తన రెగ్యులర్ హీరోల తరహాలో చూపిస్తారా, లేక కార్తి కోసం తన మాస్‌ను కొంచెం మార్చుకుంటారా అనేది అప్పట్లోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. కార్తికి తెలుగులో కూడా ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. యుగానికి ఒక్కడు నుంచి ఆవారా, ఖాకీ, ఖైదీ, సర్దార్ వరకు డబ్బింగ్ సినిమాలతోనే ఇక్కడ సొంత హీరోలా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి హీరో తెలుగు మాస్ దర్శకుడితో సినిమా చేస్తే ఆ కాంబినేషన్‌కు రెండు మార్కెట్లలోనూ మంచి బేస్ దొరుకుతుంది.
అయితే సిట్టింగ్స్ జరిగిన ప్రతి కథ సినిమా వరకు వెళ్లదు. హీరో డేట్స్, కథపై ఇద్దరికీ పూర్తి నమ్మకం రావడం, నిర్మాత, బడ్జెట్ ఇలా చాలా లెక్కలు కుదరాలి. కార్తి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు సర్దార్ 2 తర్వాత కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా చేయబోతున్నాడు. మరోవైపు ఖైదీ 2 కోసం కూడా అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి కూడా ఒక హీరోను తన మాస్ టెంప్లేట్‌లోకి తీసుకొచ్చినప్పుడు కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక కార్తీ తో కలిస్తే ఎలాంటి అవుట్ పుట్ వస్తుందో చూడాలి.