ఈ ఏడాది సల్మాన్ కు నో రిలీజ్?
బాలీవుడ్‌లో మూడు దశాబ్దాలకు పైగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తున్న సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా రిలీజవడం దాదాపు ఆనవాయితీగా మారింది.
బాలీవుడ్‌లో మూడు దశాబ్దాలకు పైగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తున్న సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా రిలీజవడం దాదాపు ఆనవాయితీగా మారింది. ఈద్, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగ సీజన్లను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చే సల్మాన్ సినిమాలు బాక్సాఫీస్‌కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అయితే 2026 మాత్రం ఆయన కెరీర్‌లో భిన్నమైన సంవత్సరంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఏడాది సల్మాన్ నుంచి ఒక్క సినిమా కూడా థియేటర్లలోకి రాకపోవచ్చనే డిస్కషన్ బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా మాతృభూమి. భారత సైనికుల త్యాగాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ వార్ డ్రామాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని అన్నారు. అయితే తాజా బాలీవుడ్ ట్రేడ్ కథనాల ప్రకారం ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని, 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇంకా వెలువడలేదు.
అదే జరిగితే 2026లో సల్మాన్ ఖాన్‌కు థియేట్రికల్ రిలీజ్ లేకపోవడం ఆయన కెరీర్‌లో అరుదైన పరిణామంగా మారే అవకాశముంది. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. కేవలం వేగంగా సినిమాలు పూర్తి చేయడం కంటే, కథ, నిర్మాణ విలువలు, ప్రేక్షకుల అంచనాలకు సరిపోయేలా ప్రాజెక్టులను సిద్ధం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో స్టార్ హీరోలు కూడా రిలీజ్ డేట్స్ విషయంలో తొందరపడటం లేదు. పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, మార్కెటింగ్, సరైన రిలీజ్ విండో వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సినిమాలు ఆలస్యమవుతున్నాయి. అదే ధోరణి మాతృభూమి విషయంలోనూ కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే సల్మాన్ ఫ్యాన్స్ మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. 2026లో సినిమా రిలీజ్ కాకపోయినా, మరింత క్వాలిటీతో మాతృభూమిని ఆడియన్స్ కు అందించడానికే ఈ డెసిషన్ తీసుకుంటే అభిమానులు స్వాగతించే అవకాశముంది. అదే సమయంలో, మాతృభూమి నిజంగా 2027కు వాయిదా పడితే, ఆ ఏడాది సల్మాన్ ఖాన్‌కు భారీ కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశాలపై ఇప్పటికే బాలీవుడ్‌లో చర్చ మొదలైంది.