కృష్ణ జింకను చంపి జైలు పాలైన స్టార్ హీరో కథతో..చివరికి లీగల్ నోటీస్!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ దశాబ్ధాల క్రితం `హమ్ ఆప్ కే కౌన్ హై` సినిమా షూటింగ్ సమయంలో అడవిలో వేటకు వెళ్లి కృష్ణ జింకను వేటాడి చంపడంతో అది తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ దశాబ్ధాల క్రితం `హమ్ ఆప్ కే కౌన్ హై` సినిమా షూటింగ్ సమయంలో అడవిలో వేటకు వెళ్లి కృష్ణ జింకను వేటాడి చంపడంతో అది తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అతడు అలా వేటకు వెళ్లిన సమయంలో తనతో పాటే ఇద్దరు కథానాయికలు, ఇతర సహనటులు కూడా ఉన్నారు. ఆ తర్వాత కృష్ణ జింకను దేవతగా ఆరాధించే బిష్ణోయ్ కమ్యూనిటీ సల్మాన్ ఖాన్ ని క్షమాపణ కోరడం, దానికి అతడు నిరాకరించడంతో అతడిపైనా, అతడి కుటుంబంపైనా పగ పట్టడం, సల్మాన్ ని జీవితాంతం ఈ కేసు వెంటాడడం తెలిసిందే. అడవి జంతువును వేటాడిన కేసులో సల్మాన్ కొన్ని నెలల పాటు జైలులో కూడా ఉన్నాడు. అయితే సల్మాన్ జైలు నుంచి బయట పడిన తర్వాత కూడా బిష్ణోయ్ కమ్యూనిటీలోని మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తీవ్రమైన మరణ బెదిరింపుల్ని ఎదుర్కొంటున్నాడు. సల్మాన్ ని, అతడి కుటుంబాన్ని చంపేస్తానని బిష్ణోయ్ అతడి గ్యాంగ్ బెదిరిస్తూనే ఉన్నారు. అతడి ఫ్రెండ్స్ కి కూడా హత్యాబెదిరింపులు ఎదురవ్వడం, ఒక ముఖ్యమైన స్నేహితుడిని చంపిన సంఘటన కూడా సంచలనం అయిన సంగతి తెలిసిందే.
నిజ జీవిత కథలో ఇన్ని ట్విస్టులు ఉన్న కేసు ఇంకొకటి లేదు. ఇది నిజానికి ఒక సినిమా కథను తలపిస్తుంది. అయితే దీనిని ఇప్పుడు సినిమా తీసేస్తున్నారని తెలిసిన సల్మాన్ ఖాన్ దానిని రిలీజ్ కానివ్వకుండా కోర్టుకెక్కడం హాట్ టాపిగ్గా మారింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన నిజ జీవిత కథతో సినిమా తీస్తున్నారని భావించిన `కాలా హిరణ్: ది బాటిల్ ఫర్ లెగసీ` చిత్ర నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ సినిమా విడుదల , ప్రమోషన్లపై తక్షణమే నిషేధం విధించాలని సల్మాన్ బృందం ఆ నోటీసులో డిమాండ్ చేసింది.
కృష్ణ జింకను చంపి జైలు పాలైన ఒక స్టార్ హీరో వాస్తవ జీవిత చట్టపరమైన పోరాటాలు, సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో సల్మాన్ ఖాన్ వర్గం తీవ్రంగా స్పందించింది. సల్మాన్ పంపిన లీగల్ నోటీస్ ప్రకారం.. మేకర్స్ ఈ సినిమా విడుదలను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేశారు. దాంతో పాటు.. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ఇతర పోస్టర్లు, వీడియోలను సామాజిక మాధ్యమాలు...ఇతర డిజిటల్ వేదికల నుండి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తే... భవిష్యత్తులో తీవ్రమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సల్మాన్ ఖాన్ న్యాయ బృందం గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
ఈ వివాదాస్పద చిత్రాన్ని జానీ ఫైర్‌ఫాక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అమిత్ జానీ నిర్మిస్తున్నారు. గతంలోనూ వివాదాస్పద- హై-ప్రొఫైల్ అంశాలపై సినిమాలు తీసిన నేపథ్యం ఈ నిర్మాతకు ఉంది. ఈ లీగల్ వివాదాలు నడుస్తున్నా.. భరత్ ఎస్. శ్రీనేత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కథానాయకుడి పాత్ర ఎంతో తీవ్రంగా క్రిప్టిక్‌గా కనిపిస్తూ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.
ఈ లీగల్ నోటీసుపై చిత్ర నిర్మాత అమిత్ జానీ తీవ్రంగా స్పందించారు. సల్మాన్ ఖాన్ బృందం తీసుకున్న ఈ చర్య తమను భయభ్రాంతులకు గురిచేయడానికి .. ఈ ప్రాజెక్ట్‌కు మద్దతుగా నిలుస్తున్న వారు వెనక్కి తగ్గేలా ఒత్తిడి తీసుకురావడానికేనని ఆయన ఆరోపించారు. ఈ బెదిరింపుల కారణంగా సినిమా విడుదల గడువుపై కాస్త నీలి నీడలు కమ్ముకున్నా చిత్ర యూనిట్ మాత్రం ముందుగా ప్రకటించినట్లే జూన్ 20న సినిమా మొదటి టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుతానికి నిర్మాత అమిత్ జానీ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై అటు సల్మాన్ ఖాన్ గానీ... ఇటు ఆయన లీగల్ బృందం గానీ బహిరంగంగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ చిత్రం సల్మాన్ ఖాన్ జైలు జీవితం, `బ్లాక్ బక్ కేసు` ఆధారంగానే రూపొందుతోందని టైటిల్ - కథనాలు స్పష్టం చేస్తుండడంతో ఈ లీగల్ ఫైట్ మునుముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి