హై-ఎండ్ కలర్ గ్రేడింగ్ ఎఫెక్ట్.. వీడియోలు AIలా కనిపించే కొత్త ట్రెండ్!
'సలార్', 'కెజిఎఫ్' వంటి చిత్రాలలో వాడిన మోనోక్రోమ్యాటిక్, డార్క్ హై-కాంట్రాస్ట్ కలర్ గ్రేడింగ్ వల్ల ఈ కొత్త గందరగోళం మొదలైంది.
సోషల్ మీడియా టైమ్‌లైన్‌లో ఒక పవర్‌ఫుల్ యాక్షన్ క్లిప్ తెగ వైరల్ అవుతోంది. హాలీవుడ్ లెవెల్ లైటింగ్, స్లో-మోషన్ షాట్లతో ఉన్న ఆ వీడియోను చూసి కొందరు పాకిస్థానీ సినిమా అని, మరికొందరు ఏఐ సృష్టించిన మాయాజాలమని పొరబడుతున్నారు. అయితే అది ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా ఆధారంగా ఒక డిజిటల్ క్రియేటర్ చేసిన ఫ్యాన్ మేడ్ లైవ్ యాక్షన్ వీడియో. టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న నేటి కాలంలో అసలైన వీడియోలకు, AIకి, ఫ్యాన్ మేడ్‌కి మధ్య తేడా గుర్తించడం ఎంత కష్టంగా మారిందో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
డార్క్ కలర్ టోన్‌ల వెనుక ఉన్న మాయ:
'సలార్', 'కెజిఎఫ్' వంటి చిత్రాలలో వాడిన మోనోక్రోమ్యాటిక్, డార్క్ హై-కాంట్రాస్ట్ కలర్ గ్రేడింగ్ వల్ల ఈ కొత్త గందరగోళం మొదలైంది. రన్ వే, సోరా వంటి అధునాతన ఏఐ విజువల్ టూల్స్ కూడా సాధారణంగా ఇవే డార్క్ టోన్‌లను ఎక్కువగా వాడి వీడియోలను జనరేట్ చేస్తుంటాయి. ఇక దీంతో సాధారణ క్రియేటర్లు తమ కెమెరాలతో కష్టపడి షూట్ చేసి, హై-ఎండ్ సాఫ్ట్‌వేర్‌లతో కలర్ గ్రేడింగ్ చేసినా కూడా.. నెటిజన్లు దానిని "ఏఐ క్రియేషన్" అని పొరబడే పరిస్థితులు వచ్చాయి.
ఫ్యాక్ట్ చెకింగ్ లేని సోషల్ మీడియా ప్రచారం:
నేటి డిజిటల్ యుగంలో వార్త నిజమా కాదా అని సరి చూసుకునే టైమ్ ఎవరికీ ఉండటం లేదు. వ్యూస్, క్లిక్స్ కోసం ఒక క్రియేటర్ ఎంతో శ్రమపడి గౌరవంతో చేసిన ఫ్యాన్ మేడ్ వీడియోను, కొన్ని సోషల్ మీడియా పేజీలు "పాకిస్థానీ సినిమా సలార్‌ను కాపీ కొట్టింది" అంటూ తప్పుడు ప్రచారం చేశాయి. సరైన మీడియా అక్షరాస్యత లేకపోవడం మరియు వ్యూస్ కోసం నెటిజన్లను తప్పుదోవ పట్టించడం వల్ల అసలైన ఆర్టిస్టుల కష్టం మరుగున పడిపోతోంది.
మీడియాకు కొత్త సవాళ్లు:
సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఫోన్లలోనే ప్రశాంత్ నీల్ రేంజ్ విజువల్స్ తెచ్చే వెసులుబాటు పెరిగింది. అయితే దీనివల్ల రెండు పెద్ద సమస్యలు వస్తున్నాయి. ఒకటి క్రియేటర్లు రక్తం చిందించి తీసిన రియల్ లైవ్ యాక్షన్ షాట్లను కూడా "ఇది ఏఐతో చేసిందిలే" అని తీసిపడేస్తున్నారు. రెండు, రాబోయే రోజుల్లో ఒరిజినల్ సినిమా లీకులకు, ఏఐ తో క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలకు తేడాను కనిపెట్టడం సినీ పరిశ్రమకు, జర్నలిజానికి పెద్ద సవాలుగా మారనుంది.
స్క్రీన్ మీద కంటికి కనిపించే ప్రతిదీ నిజం కాదని ఈ ‘సలార్’ రీక్రియేషన్ రచ్చ హెచ్చరిస్తోంది. మనం ప్రస్తుతం విజువల్ మాయాజాలం నడుస్తున్న కాలంలో ఉన్నాం. కాబట్టి సోషల్ మీడియాలో ఎలాంటి వీడియో చూసినా వెంటనే గుడ్డిగా నమ్మేయకుండా, దాని వెనుక ఉన్న టెక్నాలజీని, అసలు నిజాలను గ్రహించేలా ప్రతి వీక్షకుడు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.