హిట్ 4: ట్విస్ట్ ల కంటే ఇదే పెద్ద ఛాలెంజ్
‘HIT 4’లో కార్తి ఏసీపీ వీరప్పన్‌గా రాబోతున్న సంగతి హిట్ 3 చివర్లోనే చెప్పేశారు. కానీ కార్తిని పోలీస్‌గా చూడటం మాత్రం ప్రేక్షకులకు కొత్త కాదు.
‘HIT 4’లో కార్తి ఏసీపీ వీరప్పన్‌గా రాబోతున్న సంగతి హిట్ 3 చివర్లోనే చెప్పేశారు. కానీ కార్తిని పోలీస్‌గా చూడటం మాత్రం ప్రేక్షకులకు కొత్త కాదు. ‘సిరుత్తై’, ‘ఖాకీ’, ‘సర్దార్’లో ఇప్పటికే ఖాకీ వేసుకున్నాడు. ‘వా వాతియార్’లో కూడా పోలీస్ పాత్రే చేశాడు. అందుకే ఈసారి కార్తి పోలీస్‌గా సెట్ అవుతాడా అనే డౌట్ కంటే, శైలేష్ కొలను అతన్ని హిట్ ప్రపంచంలో ఎంత డిఫరెంట్ గా చూపిస్తాడన్నదే అసలు ఛాలెంజ్ అనుకోవచ్చు.
హిట్ సిరీస్ లలో ట్విస్ట్ లకు స్పేస్ ఇచ్చే శైలేష్ ఇప్పుడు కార్తి పాత్రతోనే కిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు వచ్చిన పోలీసులందరికీ ఒకే టోన్ పెట్టలేదు. మొదటి సినిమాలో విశ్వక్ సేన్ చేసిన విక్రమ్ రుద్రరాజు తన గతంతో ఇబ్బంది పడుతూ కేసును వెంబడించే ఆఫీసర్. హిట్ 2లో అడివి శేష్ చేసిన కేడీ మాత్రం చాలా కూల్‌గా, తన మీద నమ్మకంతో కనిపించాడు.
హిట్ 3 వచ్చేసరికి నాని అర్జున్ సర్కార్‌ను మరింత రఫ్‌గా, హింసకు వెనకాడని పోలీస్‌గా మార్చారు. కార్తి వీరప్పన్ ఎంట్రీ దగ్గరే చిన్న తేడా చూపించారు. అర్జున్ సర్కార్‌లా గట్టిగా కనిపించకుండా, కాస్త లైట్‌గా మాట్లాడే వ్యక్తిగా పరిచయం చేశారు. పైగా చెన్నైలో పోస్టింగ్ ఉన్న ఏసీపీగా చూపించారు. అంటే పేరు, యూనిఫాం మాత్రమే కాదు, అతని నడవడి కూడా ముందు ముగ్గురి నుంచి వేరే రూట్‌లో వెళ్లే అవకాశం ఉంది. అదే కొనసాగితే ‘హిట్ 4’కు తనదైన టోన్ దొరుకుతుంది.
కార్తి దగ్గర మరో సమస్య కూడా ఉంది. ‘ఖాకీ’లో అతని పోలీస్ పాత్ర ఇప్పటికీ బాగా గుర్తుండిపోయింది. అక్కడ నిజాయితీగా కేసు వెంట పడే ఆఫీసర్‌గా కనిపించాడు. ‘సర్దార్’లో మాత్రం పోలీస్ పాత్రకు మరో షేడ్ ఉంది. ఇలాంటి పాత్రలు చేసిన తర్వాత మళ్లీ ఖాకీ వేస్తే పోలికలు రావడం సహజం. అందుకే వీరప్పన్‌ను మరో ‘ఖాకీ’ పోలీస్‌లా కాకుండా, కొత్త మేనరిజమ్స్‌తో రాయాల్సి ఉంటుంది. లేకపోతే పేరు మారినా కార్తి పాత పోలీస్ పాత్రలే గుర్తొచ్చే ప్రమాదం ఉంటుంది.
ఇక శైలేష్ ప్రతి భాగంలో కేసును మారుస్తున్నాడు, హీరో మారుతాడు, ఆఫీసర్ స్వభావం కూడా మారుతుంది. అదే పద్ధతిని కార్తితో కూడా కొనసాగించొచ్చు. కానీ ఈసారి తమిళ ప్రేక్షకులు కూడా కార్తిని తమ హీరోగా చూస్తారు. కాబట్టి తెలుగు హిట్ టోన్ అలాగే ఉంచుతూ, కార్తి స్క్రీన్ ఇమేజ్‌కు సరిపోయే కొత్త పోలీస్ క్యారెక్టర్ ను హైలెట్ చేయాలి. కథ ఎక్కడ నడుస్తుందన్నది కూడా ఈ పాత్రకు కొత్త ఫీల్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం శైలేష్ రోషన్ మేకాతో ‘ఎమో ఎమో ఇది’ అనే సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా తర్వాతే ‘HIT 4’ స్క్రిప్ట్‌పై పూర్తి ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. డైలాగ్ డ్రాఫ్ట్ డిసెంబర్ నాటికి సిద్ధం చేయాలని చూస్తుండగా, కార్తి డేట్స్ 2027 జూన్ నుంచి దొరికే అవకాశం ఉందని టాక్.