అదంతా నాటకం.. దాడిపై సైఫ్ రియాక్షన్!

Update: 2025-10-09 16:30 GMT

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ ఏడాది అతిపెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ సంగతి మనకు తెలిసిందే. ఆయనపై గుర్తుతెలియని ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఆ సమయంలో బీ టౌన్ మొత్తం సైఫ్ అలీ ఖాన్ కత్తిదాడి గురించే మాట్లాడుకున్నారు .అంతేకాదు సైఫ్ అలీఖాన్ పై దాడి గురించి పలు రూమర్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న సైఫ్ అలీ ఖాన్.. తనపై జరిగిన కత్తి దాడి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదంతా ఓ నాటకం అంటూ సైఫ్ అలీ ఖాన్ మాట్లాడిన మాటలు బాలీవుడ్లో సంచలనంగా మారాయి.

తాజాగా సైఫ్ అలీ ఖాన్ "టూ మచ్" టాక్ షోలో పాల్గొన్నారు.అయితే ఈ టాక్ షోలో ఈ ఏడాది తనపై జరిగిన కత్తిదాడి గురించి మాట్లాడుతూ.. "నాపై కత్తి దాడి జరిగిన సమయంలో చాలామంది అదంతా ఓ నాటకం అన్నారు. ఆ సమయంలో చాలా బాధేసింది. అయితే నాటకం అని రాయడానికి ప్రధాన కారణం హాస్పిటల్ నుండి నేను డిశ్చార్జ్ అయి వస్తున్న టైమ్ లో నా అభిమానులతో పాటు ఎంతోమంది మీడియా వాళ్ళు నన్ను చూడ్డానికి హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో నేను వీల్ చైర్ లో లేదా అంబులెన్స్ లో ఇంటికి వెళ్తానని అందరూ అనుకున్నారు.కానీ నాకు ఎంత పెద్ద గాయమైనా సరే అభిమానులు బాధపడకూడదని ఆలోచించి నా గాయాన్ని కూడా కప్పిపుచ్చుకొని ఫేక్ నవ్వు నా మొహంపై చూపిస్తూ బాగున్నాను అని సందేశం ఇచ్చేలా బయటికి వచ్చాను.

కేవలం నా అభిమానులు నా గాయం చూసి ఆందోళన చెందకూడదనే ఇలా చేశాను. కానీ నేను అలా ఏమీ జరగనట్టుగా కామన్ గానే నడుచుకుంటూ వచ్చే సరికి చాలామంది నేను పెద్ద డ్రామా చేశానని, అసలు నాపై కత్తి దాడే జరగలేదని,అదంతా ఓ నాటకం అంటూ రాసుకొచ్చారు. ఫ్యాన్స్ ఆందోళన చెందకుండా బాగానే ఉన్నానని వారికి చెప్పాలంటే ఇంతకంటే మరో మార్గం నాకు లేదు. అందుకే అలా నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కాను. అయితే దీన్ని కూడా కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని నాటకం అని రాశారు. ఈ వార్తలు చూసినప్పుడు చాలా బాధనిపించింది. అసలు ఇలాంటి సమాజంలోనా మనం బతుకుతున్నది అంటూ అసహనం వ్యక్తం చేశారు" నటుడు సైఫ్ అలీ ఖాన్.

అయితే సైఫ్ అలీ ఖాన్ కత్తి దాడి జరిగి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన సమయంలో ఆయన చెప్పినట్టు ఇలాంటి వార్తలే చక్కర్లు కొట్టాయి. కత్తిపోటుకు గురైతే ఏమీ జరగనట్లు అలా నాచురల్ గా ఎలా నడుచుకుంటూ వస్తారు. ఆయనకు ఏమీ కాలేదు. కత్తి దాడి జరిగిందని ఒక డ్రామా చేశారన్నారు. అంతేకాదు దాడి జరిగిన కొద్ది రోజులకే అలా ఎలా నవ్వుకుంటూ ఎవరి సపోర్ట్ లేకుండా నడుచుకుంటూ వస్తారు అని అనుమానాలు వ్యక్తం చేశారు. అలా తాను నాటకం చేశాననే రూమర్లపై తాజాగా స్పందించి అసహనం వ్యక్తం చేశారు సైఫ్.

ఈ ఏడాది జనవరి 16న నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేశారు. అయితే ఈ పని చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని విచారించగా.. తనది బంగ్లాదేశ్ అని, 30 వేల కోసమే తాను సైఫ్ ఇంట్లోకి చొరబడి ఆయన పై దాడి చేసినట్లు నేరం ఒప్పుకున్నారు.

Tags:    

Similar News