కరీనాని పెళ్లి చేసుకోవడానికి సైఫ్ పడ్డ కష్టాలు!

అక్కడి అందమైన లొకేషన్లలో రొమాంటిక్ వాతావరణం మధ్య కరీనాకు ప్రపోజ్ చేయగా.. ఆమె దాన్ని వెంటనే అంగీకరించకుండా సమయం కావాలని దాటవేసింది.

Update: 2026-10-18 08:30 GMT

బాలీవుడ్ రాయల్ కపుల్ సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ ఖాన్‌ల బంధం ఇప్పటికీ ఇండస్ట్రీలో ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది. అయితే తెరపై ఎంతటి రొమాంటిక్ వాతావరణం కనిపించినా? రియల్ లైఫ్‌లో కరీనా మనసు గెలుచుకుని ఆమెతో పెళ్లికి ఓకే చెప్పించుకోవడానికి సైఫ్ పడిన పాట్లు తక్కువేమీ కావు. ప్రపంచంలోనే అందమైన నగరాలైన ముంబై, పారిస్, గ్రీస్‌లలో సైఫ్ ప్రపోజ్ చేసినా? కరీనా నుంచి వెంటనే ఎస్ రాలేదంటే సైప్ ఎంత‌ కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు.

`తషాన్` షూటింగ్ సమయంలో ఇద్ద‌రి మధ్య ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కరీనా అందానికి.. వ్యక్తిత్వానికి ఫిదా అయిన సైఫ్ ఎలాగైనా? ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకోవాలని బ‌లంగా నిర్ణయించుకున్నారు. ప్రేమను ప్రకటించడం తేలికే అయినా? దాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లడానికి సైఫ్ ఓపికగా.. సరైన సమయం కోసం వేచి చూడాల్సి వచ్చింది.

తన ప్రేమను తెలియజేయడానికి సైఫ్ మొదట ఎంచుకున్న ప్రదేశం గ్రీస్. అక్కడి అందమైన లొకేషన్లలో రొమాంటిక్ వాతావరణం మధ్య కరీనాకు ప్రపోజ్ చేయగా.. ఆమె దాన్ని వెంటనే అంగీకరించకుండా సమయం కావాలని దాటవేసింది. అయినా వెనక్కి తగ్గని సైఫ్‌ ఆ తర్వాత పారిస్ పర్యటనలో మరోసారి రింగ్ తో గ్రాండ్‌గా ప్రపోజ్ చేశారు. పారిస్ అనేది సైఫ్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ.. తల్లి షర్మిలా ఠాకూర్‌కు ప్రపోజ్ చేసిన నగరం కావడంతో ఆ ప్రదేశానికి వారి కుటుంబంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

అంతటి ప్రత్యేకమైన పారిస్ నగరంలో ప్రపోజ్ చేసినా? కరీనా మళ్లీ ఆలోచనలో పడింది. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండటం.. పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుందోననే చిన్నపాటి సందేహాల వల్ల క‌రీనా వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయింది. దాంతో ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత కూడా సైఫ్ ప్రయత్నాలను మానలేదు. క‌రీనా పట్ల ఉన్న అంకితభావాన్ని.. ప్రేమను ప్రతిక్షణం వ్యక్తపరుస్తూనే వచ్చారు.

చివ‌రికి సైఫ్ చూపించిన నిజాయితీ, ఓపిక, కరీనా పట్ల ఉన్న అపరిమితమైన ప్రేమ ఆమె మనసును పూర్తిగా కరిగించాయి. పెళ్లి అనేది కెరీర్‌కు అడ్డంకి కాదని.. సైఫ్ లాంటి అర్థం చేసుకునే భాగస్వామి తోడుంటే జీవితం మరింత అందంగా ఉంటుందని నమ్మిన కరీనా? చివరికి సైఫ్‌ ప్రేమ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా దాదాపు ఐదేళ్ల డేటింగ్ తర్వాత 2012లో ఇద్ద‌రు వివాహ బంధంతో ఒకటయ్యారు.

ప్రస్తుతం ఇద్ద‌రు పిల్లలతో సంతోషకరమైన దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. బాలీవుడ్‌లో కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు. ఒక పక్క నటనలో బిజీగా ఉంటూనే.. మరోపక్క వ్యక్తిగత జీవితాన్ని ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు. పారిస్ నుంచి ముంబై వరకు సైఫ్ పడ్డ పట్టుదల.. ప్రేమ నేటికీ అనేకమంది ప్రేమికులకు స్పూర్తిగా నిలిచింది.

Tags:    

Similar News