ఆదర్శ కుటుంబం డేట్ నేను చెబితే తంతారు-నాగవంశీ
ఐతే అక్టోబరు 30న ‘ఆదర్శ కుటుంబం’ వస్తుందని మాత్రం చెప్పకనే చెప్పేశాడు నాగవంశీ.
దసరా సెలవులు ఆరంభం కాబోతుండగా.. ఈ నెల 9వ తారీఖున రావాల్సిన సినిమా ‘ఆదర్శ కుటుంబం’. సెలవుల్లో ఈ ఫ్యామిలీ సినిమాను ఎంజాయ్ చేద్దామని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా ఆ సినిమా వాయిదా పడిపోయింది. దీంతో ప్రేక్షకుల ఆగ్రహం మామూలుగా లేదు. అందరూ ఈ విషయంలో నిర్మాత నాగవంశీపై తీవ్ర ఆగ్రహమే చూపించారు.
అక్టోబరు 2కు అనుకున్న సినిమాను వారం వాయిదా వేసి.. విడుదలకు నాలుగు రోజుల ముందు కూడా రిలీజ్ గురించి కాన్ఫిడెంట్గా ట్వీట్ వేసిన నాగవంశీ, చివరికి మళ్లీ సినిమా వాయిదా వేయడాన్ని అందరూ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఎంత వివరణ ఇచ్చినప్పటికీ ఆగ్రహం చల్లారలేదు. ఐతే ఆ ప్రెస్ మీట్లో కొత్త డేట్ చెప్పమంటే నోరు విప్పలేదు నాగవంశీ. ఇంకోసారి డేట్ చెప్పి, ఏమైనా తేడా అయితే కష్టం అనుకున్నాడేమో. తాజాగా ‘జైలర్-2’ సక్సెస్ ప్రెస్ మీట్లో కూడా నాగవంశీ ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించడానికి భయపడ్డాడు.
ఐతే అక్టోబరు 30న ‘ఆదర్శ కుటుంబం’ వస్తుందని మాత్రం చెప్పకనే చెప్పేశాడు నాగవంశీ. తాను ఈసారి రిలీజ్ డేట్ ప్రకటించినా జనాలు నమ్మరని.. పట్టుకుని తంతారు అని నాగవంశీ కామెంట్ చేయడం విశేషం. అక్టోబరు 30న సినిమా రిలీజవడం ఖాయమని చెబుతూనే.. తాను మాత్రం ఆ డేట్ను అఫీషియల్గా ప్రకటించనని తేల్చేశాడు నాగవంశీ.
‘ఆదర్శ కుటుంబం’ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఊటీలో ‘జనవరి 12 విడుదల’ షూటింగ్లో ఉన్నారని.. ఆయన 21న లేదా 22న హైదరాబాద్ వస్తారని.. ఆయనతో తమ సినిమా ట్రైలర్ లాంచ్ చేయించి, వెంకీతోనే అదే రోజు రిలీజ్ డేట్ చెప్పిస్తామని నాగవంశీ తెలిపాడు. కాబట్టి అక్టోబరు 30న ‘ఆదర్శ కుటుంబం’ వస్తుందనే విషయంలో ఇంకే డౌట్లు పెట్టుకోవాల్సిన పని లేదని అర్థమవుతోంది. కాబట్టి 30కి ఫిక్స్ అయిన ‘ఇట్లు అర్జున’ సహా వేరే చిత్రాలు ఇంకో డేట్ చూసుకోక తప్పదన్నమాట.