టీవీ షో వివాదం: రాఖీ సావంత్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ !

వివరాల్లోకి వెళ్తే... ఈ కేసు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ అహిర్వార్ అనే వ్యక్తి ఆత్మహత్యకు సంబంధించినది.

Update: 2026-10-18 06:32 GMT

బాలీవుడ్ నటి, మోడల్ రాఖీ సావంత్‌కు ఉత్తరప్రదేశ్ కోర్టు తీవ్ర షాక్ ఇచ్చింది. 2010లో చోటుచేసుకున్న ఒక వ్యక్తి ఆత్మహత్యకు సంబంధించి దాఖలైన కేసులో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ రాఖీ వరుసగా గైర్హాజరు కావడంతో న్యాయస్థానం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... ఈ కేసు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ అహిర్వార్ అనే వ్యక్తి ఆత్మహత్యకు సంబంధించినది. 2010 నవంబర్ 10న లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. రాఖీ సావంత్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన `రాఖీ కా ఇన్సాఫ్` అనే రియాలిటీ టీవీ షోలో తనపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు తట్టుకోలేకే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని కేసు నమోదు అయ్యింది.

ఈ సంఘటనపై మృతుడి తల్లి సావిత్రి ఝాన్సీలోని ప్రేమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2010 అక్టోబర్‌లో ప్రసారమైన ఒక ఎపిసోడ్‌లో రాఖీ సావంత్ తన కుమారుడి పట్ల అనుచిత, అభ్యంతరకరమైన భాషను ఉపయోగించి తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. లక్ష్మణ్ .. అతని భార్య అనితల మధ్య ఉన్న దాంపత్య వివాదాల పరిష్కారం కోసం వారిని ఆ టీవీ షోకి ఆహ్వానించినట్లు ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది.

ఝాన్సీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు చెందిన అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఈ వారెంట్‌ను జారీ చేశారు. కోర్టుకు హాజరుకావాలని పలుమార్లు సమన్లు పంపినా? రాఖీ సావంత్ వరుసగా విచారణకు దూరంగా ఉండటంతో న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కౌన్సెల్ మృదుల్ కాంత్ శ్రీవాత్సవ మీడియాకు వెల్లడించారు.

బుల్లితెరపై ఎంతో సంచలనం సృష్టించిన `రాఖీ కా ఇన్సాఫ్` షో ప్రసారమైన సమయంలోనే అనేక విమర్శలు ఎదుర్కొంది. షోలో పాల్గొనే వారి వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. అవమానించడం లాంటివి వివాదాస్పదమయ్యాయి. అందులో భాగమే ఈ కేసు కూడా ఇప్పటికీ న్యాయస్థానాల్లో విచారణలో ఉంటూ రాఖీ సావంత్‌కు చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడుతోంది.

ఈ కేసు తదుపరి విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టు డిసెంబర్ 1కి వాయిదా వేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినందున ఈ లోగా రాఖీ సావంత్ కోర్టు ముందు హాజరవుతారా? లేదా? పోలీసుల చర్యలు ఎలా ఉండబోతు న్నాయనేది బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రాఖీ సావంత్ జీవితం మొదటి నుంచీ వివాదాలకు మారు పేరుగానే నిలిచింది. ఆమె వ్యక్తిగత జీవితంలోని నాటకీయ పరిణామాలు, వివాహాలు, సోషల్ మీడియాలో చేసే హల్చల్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. మ‌రి నాన్ బెయిల్ వారెంట్ విష‌యంలో రాఖీ ఎలా స్పందిస్తుంది? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News