ఏక్ దిన్.. ఆలోచన మార్చుకున్న సాయి పల్లవి?
సాయి పల్లవి ప్రస్తుతం ప్రతిష్టాత్మక 'రామాయణ' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది.
సాయి పల్లవి ప్రస్తుతం ప్రతిష్టాత్మక 'రామాయణ' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. రావణాసురుడి పాత్రలో కన్నడ స్టార్ యశ్ కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా మొదటి పార్ట్‌ను ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. హిందీలో రూపొందుతున్న ఈ సినిమాను పలు భాషల్లో డబ్ చేయబోతున్నారు. ముఖ్యంగా హిందీతో పాటు, తమిళ్, తెలుగు, కన్నడం, మలయాళం, మరాఠి, బెంగాళీ భాషల్లో విడుదల చేయడం కోసం డబ్ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా డబ్బింగ్ విషయమై పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సినిమాలో నటించిన నటీనటులతో డబ్బింగ్ చెప్పించే ఆలోచనతో దర్శకుడు నితేష్ తివారీ ఉన్నారని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సాయి పల్లవి డబ్బింగ్...
రాముడి పాత్రలో నటించిన రణబీర్ కపూర్ చేత హిందీలోనే కాకుండా మరో రెండు మూడు భాషల్లోనూ డబ్బింగ్ చెప్పించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన భాష పై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు సాయి పల్లవి సైతం హిందీతో పాటు సౌత్‌లో అన్ని భాషల్లోనూ డబ్బింగ్ చెప్పబోతుందనే వార్తలు వస్తున్నాయి. గతంలో సౌత్ సినిమాలకు సాయి పల్లవి డబ్బింగ్ చెప్పింది. తెలుగు, తమిళ్, మలయాళ ప్రేక్షకులకు సాయి పల్లవి మాత్రమే కాకుండా ఆమె వాయిస్ పరిచయం. తన పాత్రలకు తగ్గట్లుగా సాయి పల్లవి డబ్బింగ్ చెప్పడం మనం చూశాం. అయితే హిందీలో సాయి పల్లవి డబ్బింగ్ విషయమై విమర్శలు ఎదుర్కొంది. తాజాగా సాయి పల్లవి హిందీలో నటించిన 'ఏక్ దిన్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కోసం సాయి పల్లవి సొంతంగా డబ్బింగ్ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.
బాలీవుడ్ మూవీ ఏక్ దిన్...
ఏక్ దిన్ సినిమాలో సాయి పల్లవి హిందీ డబ్బింగ్ విషయంలో విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా హిందీ భాషను ఆమె స్పష్టంగా పలకలేక పోయిందని, కొన్ని పదాలను ఉచ్చరించడంలో చాలా ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది. పైగా ఆమె బాడీ లాంగ్వేజ్‌కి హిందీ భాష సెట్ కావడం లేదని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. సాయి పల్లవి ఏక్ దిన్ కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పి విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రామాయణ విషయంలో ఆలోచన మార్చుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. నితేష్ తివారీ ఇప్పటి వరకు సాయి పల్లవితోనే సీత పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని భావించారని, కానీ ఏక్ దిన్ సినిమా తర్వాత ఆయన నిర్ణయంలో మార్పు ఉండే అవకాశం ఉందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ప్రతిష్టాత్మక రామాయణ విషయంలో ఆయన ప్రయోగాలు చేయకుంటేనే ఉత్తమం అని పలువురు భావిస్తున్నారు.
రామాయణ మూవీలో...
రామాయణ సినిమాలో డైలాగ్స్ మరింత కఠినంగా ఉంటాయి. హిందీలో స్పష్టంగా మాట్లాడలేని సాయి పల్లవితో డబ్బింగ్ చెప్పించడం అనేది సాహస నిర్ణయం అనే అభిప్రాయం మొదలైంది. అయితే సాయి పల్లవి తెలుగు, తమిళ్ ఇతర సౌత్ భాషల్లో డబ్బింగ్ చెప్పడం మాత్రం కన్ఫర్మ్. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కనుక అప్పటి వరకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి అయిందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రామాయణ సినిమాల కారణంగా సాయి పల్లవి పలు సినిమాలను తిరస్కరిస్తూ వచ్చింది. షూటింగ్ పూర్తి అయిన నేపథ్యంలో సాయి పల్లవి కొత్త సినిమాలకు కమిట్ అవుతుందేమో చూడాలి. ప్రస్తుతం తమిళ్‌లో ధనుష్ తో ఒక సినిమాను చేస్తుంది, తెలుగులో ఈమె కొత్త సినిమాలు ఏమీ చేయడం లేదు. ఒకటి రెండు చర్చల దశలో ఉన్నాయని సమాచారం అందుతోంది.