ఒక‌రిని భ‌రించ‌డం నావ‌ల్ల కాదనేసిన రెబ‌ల్ క్వీన్

తెలుగు -హిందీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక ప్రముఖ నటి, తన వ్యక్తిగత జీవితం -వివాహంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Update: 2026-08-07 04:05 GMT

తెలుగు -హిందీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక ప్రముఖ నటి, తన వ్యక్తిగత జీవితం -వివాహంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X) లో అభిమానులతో నిర్వహించిన ఒక ప్రత్యేక మైన చాటింగ్ సెష‌న్ లో ఓ నెటిజన్ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని ప్రశ్నించగా ఈ బ్యూటీ ఏమాత్రం సందేహించకుండా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తను జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోనని... ఒంటరిగా (సింగిల్‌గా) ఉండటంలోనే తనకు పరిపూర్ణమైన సంతోషం ఉందని స్పష్టం చేశారు.

తన నిర్ణయానికి గల కారణాన్ని వివరిస్తూ.. తనకు అత్యంత ఆప్యాయతను పంచే 100 మందికి పైగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులు ఉన్నారని ఆ ప్రముఖ నటి పేర్కొన్నారు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న తన జీవితంలోకి ఒక పురుషుడు వచ్చి ఈ బంధాలను.. తన ప్రశాంతతను మార్చేయడాన్ని తాను ఏమాత్రం కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. సమాజం లేదా వయస్సు తెచ్చే ఒత్తిళ్లకు తలొగ్గి పెళ్లి చేసుకోవడం కంటే.. తన ఆత్మీయుల మధ్య స్వేచ్ఛగా జీవించడమే తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఈమె వెల్లడించారు.

గతంలో కూడా ఈ ప్రముఖ నటి తన ప్రేమ, సినీ కెరీర్ విష‌యంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి ఒక ప్రముఖ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో ఓపెన్‌గా మాట్లాడారు. దక్షిణ ముంబైకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తితో తాను తీవ్రమైన ప్రేమలో ఉన్నానని.. అయితే తాను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం అతనికి ఇష్టం లేకపోవడంతో ఆ బంధాన్ని తెంచుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తన భాగస్వామి లైమ్‌లైట్‌లో ఉండటానికి లేదా పబ్లిక్ ఫిగర్‌గా మారడానికి ఇష్టపడకపోవడంతో ఆ క్షణంలో ప్రేమ కంటే తన నటనా రంగాన్నే ఎంచుకున్నానని గుర్తుచేసుకున్నారు.

నిజమైన ప్రేమ అనేది అవతలి వ్యక్తి కెరీర్ ఎదుగుదలకు అడ్డుపడకూడదని... వారి కలలను ప్రోత్సహించాలని ఈ తెలుగు-హిందీ నటి అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ ధనిక కుటుంబాల నుండి వివాహ ప్రతిపాదనలు.. తన కంటే చిన్న వయస్సు ఉన్న మ‌గాళ్ల‌ నుండి ఆసక్తి క‌నిపిస్తున్నా వయస్సు కంటే మానసిక పరిపక్వత, అండ‌ర్ స్టాండింగ్ మాత్రమే తనకు ముఖ్యమని తెలిపారు. వయసులో పెద్దవారైనప్పటికీ తెలివితేటలు, మానసిక పరిపక్వత లేని పురుషులను తాను చాలామందిని చూశానని.. అందుకే సరైన అర్థం చేసుకునే తోడు దొరకనంత వరకు ఒంటరిగా ఉండటానికే మొగ్గు చూపుతున్నానని వివరించారు.

గతంలో 1999 త‌ర్వాత‌ ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడితో బంధంలో ఉండి వార్తల్లో నిలిచిన ఈ ప్రముఖ నటి.. తన జీవిత ప్రయాణంలో ప్రేమ, వృత్తిపరమైన నిర్ణయాల ద్వారా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నానని చెప్పారు. సొంత కాళ్లపై నిలబడటం, స్వీయ గౌరవాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ అనుభవాలు తనకు నేర్పాయని ఈ న‌టి తెలిపారు. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని..అదే అంతిమ గమ్యం కాదని స్పష్టం చేస్తూ ఈ భామ‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నారీమనుషులకు, యువతకు కొత్త ఆలోచనా ధోరణిని అందిస్తున్నాయి.

Tags:    

Similar News