మూవీ రివ్యూ : కొరియన్ కనకరాజు

Korean Kanakaraju Movie Review

Update: 2026-08-07 04:30 GMT

'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ

నటీనటులు: వరుణ్ తేజ్ - రితిక యాదవ్ - సత్య - సునీల్ - మురళీధర్ గౌడ్ - వీటీవీ గణేష్ - అవసరాల శ్రీనివాస్ - చిన్నా - తులసి తదితరులు

సంగీతం: తమన్

ఛాయాగ్రహణం: మనోజ్ రెడ్డి

నిర్మాతలు: రాజీవ్ రెడ్డి - సాయిబాబు జాగర్లమూడి

రచన - దర్శకత్వం: మేర్లపాక గాంధీ

ఒక మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. దర్శకుడు మేర్లపాక గాంధీది కూడా అదే పరిస్థితి. వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా.. కొరియన్ కనకరాజు. క్రేజీ ప్రోమోలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలోకి దిగింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కనకరాజు (వరుణ్ తేజ్) ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో పెనుగొండకు చెందిన కుర్రాడు. ఆ ప్రాంతంలో చెక్క భజన బృందాన్ని నడిపిస్తూ జీవిస్తుంటాడు. మహా కోపిష్టి అయిన అతను.. తన జోలికి వచ్చిన ఎవ్వరిని వదిలి పెట్టడు. అతను ఒక గొడవ తర్వాత అరాచకంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అప్పుడే అతడికి దెయ్యం పట్టిందని తెలుస్తుంది. కానీ అది కొరియన్ దయ్యం అని తెలిసి అందరూ అవక్కవుతారు. పెనుగొండలో ఉండే కనకరాజుకు కొరియన్ దయ్యం పట్టడం ఏంటి.. ఇంతకీ ఆ దెయ్యం కథేంటి.. ఈ దయ్యం బారి నుంచి కనకరాజు తప్పించుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

మేర్లపాక గాంధీ వినోదానికి పేరుపడ్డ దర్శకుడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.. ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాల్లో అతను ఎంతగా నవ్వించాడో తెలిసిందే. కామెడీ పండే కథ కుదిరితే.. అతను ట్రెండీ వినోదంతో చెలరేగిపోతాడనడానికి ఈ సినిమాలే ఉదాహరణ. కానీ ఆ తర్వాత తన బలాన్ని విడిచిపెట్టి భిన్నంగా ఏదో చేయాలని ట్రై చేసి ‘కృష్ణార్జున యుద్ధం’.. ‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. ఐతే ఈసారి మాత్రం అతను తన బలాన్నే నమ్ముకున్నాడు. కామెడీ మీద గురి పెట్టాడు. అందుకోసం నేలవిడిచి సాము ఏమీ చేయలేదు. తెలుగు సినిమాల్లో ఎన్నోసార్లు చూసిన.. మారుతి సహా చాలామంది దర్శకులు అరగదీసేసిన హార్రర్ కామెడీ జానరే ఎంచుకున్నాడు. కాకపోతే ఎప్పుడూ చూసే లోకల్ దయ్యాలను కాకుండా కొరియన్ దయ్యాన్ని తన కథలోకి తీసుకురావడమే ఈ సినిమా స్పెషాలిటీ. సినిమా రొటీన్ గానే అనిపించినా సరే.. ఈ ‘కొరియన్’ టచ్ వల్ల కాస్త భిన్నమైన సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక కామెడీ రాయడంలో-తీయడంలో తనకున్న పట్టును మళ్లీ చూపించిన మేర్లపాక గాంధీ.. కొన్ని పేలిపోయే ఎపిసోడ్లతో ప్రేక్షకులను బాగానే నవ్వించాడు. ఇది ఆహా ఓహో అనిపించే సినిమా కాదు కానీ.. కాలక్షేపానికైతే ఢోకా లేదు.

తెలుగులో చాలా త్వరగా ప్రేక్షకులకు మొనాటనీ తెప్పించేసిన జానర్లలో ‘హార్రర్ కామెడీ’ ఒకటి. ఈ జానర్ సినిమా అనగానే ఒకే రకమైన కథలు తెరకెక్కడంతో జనాలకు విసుగొచ్చేసింది. లీడ్ క్యారెక్టర్లోకి దయ్యం దూరి.. అందరినీ ఒక ఆటాడుకునే కథలకు తెలుగులో లెక్కే లేదు. ‘కొరియన్ కనకరాజు’ కూడా ఇలాంటి సగటు హార్రర్ స్టోరీనే. కాకపోతే గాంధీ.. కొరియా నుంచి వచ్చిన ఒక దయ్యం ఆత్మ అనంతపురం కుర్రాడిలోకి చేరడం అనే పాయింటుతో మార్కులు కొట్టేశాడు. ఇందుకోసం ఆ ప్రాంతంలోని ‘కియా’ కారు కంపెనీతో పెట్టిన కనెక్షన్ హైలైట్. దయ్యంతో ముడిపడ్డ సినిమాలంటేనే లాజిక్కులతో పనిలేదు కాబట్టి.. కొరియన్ దయ్యం అనంతపురం కుర్రాడి ఒంట్లోకి చేరడం.. ఆ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో కొంచెం కన్వీనియెంట్ గానే కథాకథనాలు రాసుకున్నాడు గాంధీ. మూల కథ వరకు బాగున్నా.. కథను మొదలుపెట్టిన తీరు బాగున్నా.. ఆ తర్వాత దాన్ని నడిపించిన విధానం అంత ఎగ్జైటింగ్ గా ఏమీ కనిపించదు. హీరో పరిచయ సన్నివేశాలతో మొదలుకుని కొంత వరకు చాలా సాధారణంగా అనిపిస్తుంది ‘కొరియన్ కనకరాజు’. కానీ కనకరాజు పాత్ర మామూలుగా అనిపించినా.. అతడిలోకి కొరియా ఆత్మ చేరాక మాత్రం కథ ఊపందుకుంటుంది.

క్రేజీగా మారే హీరో పాత్ర.. దానికి తోడు పక్కనే సత్య లాంటి తిరుగులేని కామెడీ టైమింగ్ ఉన్న నటుడు.. ఇక వినోదానికి ఢోకా ఏముంది? హీరోను కూడా డామినేట్ చేస్తూ సత్య పండించిన వినోదంతో ‘కొరియన్ కనకరాజు’ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా కొరియా.. కొరియా.. అని అరుచుకుంటూ సత్య పరుగులు పెట్టే ఎపిసోడ్ బాగా పేలింది. సెకండాఫ్ లో కూడా క్షుద్ర పూజల నేపథ్యంలో వచ్చే మరో ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. హీరో అండ్ కో కొరియాలో అడుగు పెట్టాక కాసేపు విసుగు పుట్టించే ‘కొరియన్ కనకరాజు’ ఈ ఎసిసోడ్ నుంచే మళ్లీ పుంజుకుంటుంది. ప్రథమార్ధంలో నెమ్మదిగా మొదలై తర్వాత పైకి లేచినట్లే.. రెండో అర్ధంలో కూడా సినిమా కాస్త కింద పడి.. మళ్లీ పైకి లేస్తుంది. హీరో శరీరంలోకి చేరిన కొరియన్ ఆత్మ ‘కథ’ అయితే అంత ఆసక్తికరంగా లేదు. తన ఫ్లాష్ బ్యాక్ గురించి ఏదో ఊహించుకుంటాం కానీ.. అది తేలిపోయింది. కథ కొరియాకు షిఫ్ట్ అయ్యాక ఒక దశలో ‘కొరియన్ కనకరాజు’ బాగా బోర్ కొట్టిస్తుంది. కానీ అంతలో సత్య అందుకుని మళ్లీ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాడు. ‘కొరియన్’ మేకోవర్ తో వరుణ్ తేజ్ పెర్ఫామెన్స్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. చివర్లో ట్రెండుకు తగ్గ ‘డివైన్’ యాంగిల్ జోడించి తీర్చిదిద్దిన క్లైమాక్స్ కొందరికి నచ్చొచ్చు. కొందరికి రుచించకపోవచ్చు. చివర్లో ఇచ్చిన ఫినిషింగ్ టచ్ లో మాత్రం గాంధీ మళ్లీ తన మార్కు చూపించాడు. ప్రేక్షకులను నవ్వులతో థియేటర్ నుంచి బయటికి పంపించాడు. ఓవరాల్ గా చెప్పాలంటే.. ‘కొరియన్ కనకరాజు’ స్టోరీ ఫార్మాట్ కొత్తది కాకపోయినా.. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ వల్ల వెరైటఅగా అనిపిస్తుంది. సినిమా ఫుల్ ఫ్లోతో సాగకపోయినా.. టికెట్ డబ్బులకు సరిపడా నవ్వుల్ని పంచడంలో మాత్రం విజయవంతమైంది.

నటీనటులు:

వరుస ఫ్లాపుల తర్వాత వరుణ్ తేజ్ బాగా టైం తీసుకుని తనకు సూటయ్యే పాత్రను.. కథనే ఎంచుకున్నాడు. బాగా పెర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్న పాత్రలో అతను ఆకట్టుకున్నాడు. తన భారీ విగ్రహం దయ్యం పాత్రకు ప్లస్ అయింది. మరో హీరో చేస్తే ఇంత ఇంపాక్ట్ ఉండేాదా అన్న ఆలోచన కలిగేలా అతను ఈ పాత్రలో బలమైన ఇంపాక్ట్ చూపించాడు. దయ్యం పట్టాక వచ్చే మార్పులకు అనుగుణంగా అతను చూపించిన బాడీ లాంగ్వేజ్.. ముఖ్యంగా కొరియాలో వచ్చే మేకోవర్లో వరుణ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హీరోయిన్ రితిక యాదవ్.. క్యూట్ గా కనిపించి ఆకట్టుకుంది. ఆమె పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా లేకపోయినా.. ఓకే అనిపిస్తుంది. ఇక సత్య గురించి చెప్పేదేముంది? చిన్న హింట్ ఇస్తే అల్లుకుపోయే అతడికి అదిరిపోయే క్యారెక్టర్ పడింది. తన హావభావాలు.. కామెడీ టైమింగ్ పేలిపోయాయి. కొరియన్ దయ్యంగా చేసిన నటుడు మామూలుగానే అనిపిస్తాడు. అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఏమీ లేదు. వీటీవీ గణేష్ నవ్వించలేకపోయాడు. సునీల్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. మిగతా ఆర్టిస్టులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

‘కొరియన్ కనకరాజు’కు తమన్ అందించిన సంగీతం అనుకున్నంత ప్లస్ కాలేదు. రాసా గుమ్మాడి పాట ఒకటి ఓకే. మిగతా సాంగ్స్ అన్నీ సాధారణంగా సాగిపోయాయి. తమన్ బీజీఎం ఎగుడుదిగుడుగా సాగింది. కొన్ని చోట్ల బాగున్నా.. కొన్ని చోట్ల ఆల్రెడీ విన్న ఫీలింగ్ కలిగిస్తుంది. కథలోకి కొరియన్ యాంగిల్ రాగానే.. మనం చూస్తోంది ‘కొరియన కనకరాజు’నా లేక ‘ఓజీ’నా అనిపించేలా.. అవే సౌండ్స్ తో చాలా వరకు సినిమాను లాగించేశాడు. పైగా అక్కడక్కడా వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్-హావభావాలు కూడా పవన్ కళ్యాణ్ ను గుర్తుచేయడంతో ఈ ఫీలింగ్ ఇంకా పెరుగుతుంది. మనోజ్ రెడ్డి ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గా సాగింది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. సినిమాను మంచి క్వాలిటీతో నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ.. తన తొలి రెండు చిత్రాల స్థాయిలో కాకపోయినా మంచి ఎంటర్టైనరే తీశాడు. అతను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కొన్ని కామెడీ ఎపిసోడ్లను భలేగా తీశాడు. తన డైలాగులు కూడా బాగున్నాయి. ఈ మధ్యే సోషల్ మీడియాలో పాపులర్ అయిన సీనియర్ ఎన్టీఆర్ ‘అమెచ్యూరిష్ పంచ్’ డైలాగ్ మీదా పంచ్ పేల్చడం తన సెన్సాఫ్ హ్యూమర్ కు నిదర్శనం. తన రాతలో-తీతలో కొన్ని లోపాలున్నప్పటికీ.. ఒక కంప్లీట్ ఫిల్మ్ తీయకపోయినప్పటికీ.. గత రెండు సినిమాల్లా ఈసారి బోర్ అయితే కొట్టించలేదు.

చివరగా: కొరియన్ కనకరాజు.. నవ్వించే ఫారిన్ దయ్యం

రేటింగ్ - 2.75/5

Tags:    

Similar News