సంగీత దర్శకుడి లైంగిక దాడి కేసుపై లాయర్ వ్యాఖ్యలు
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు సచిన్ సంఘ్వి 20 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.;
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు సచిన్ సంఘ్వి 20 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ తర్వాత అతడు బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా అతడి లాయర్ ఒక ప్రకటనను విడుదల చేసారు. ఇవన్నీ అర్హత ప్రమాణం లేని ఆరోపణలు అని కొట్టి పారేసారు.
లాయర్ ఆదిత్య మిథే మాట్లాడుతూ ''నా క్లయింట్‌పై ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ఈ కేసు అనర్హమైనది. పోలీసులు నా క్లయింట్‌ను నిర్బంధించడం చట్టవిరుద్ధం. అందుకే అతడు వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు'' అని అన్నారు.
సచిన్ - జిగర్ జోడీ ఇటీవలే విడుదలైన ఆయుష్మాన్ ఖురానా- రష్మిక మందన్నల థామ చిత్రానికి సంగీతం అందించారు. గతంలో భేదియా, మాలిక్, పరమ్ సుందరి, గో గోవా గాన్ వంటి బాలీవుడ్ చిత్రాలకు సచిన్-జిగర్ జంటగా స్వరాలను అందించారు. 20 ఏళ్ల మహిళపై సచిన్ సంఘ్వి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాగా దీనిపై అతడు ఇప్పటివరకూ స్పందించలేదు.
సచిన్‌ను అక్టోబర్ 23న ముంబైలో అదుపులోకి తీసుకుని తరువాత పోలీసులు బెయిల్ మంజూరు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే... సచిన్ సంఘ్వి గత సంవత్సరం ఫిబ్రవరిలో తన మ్యూజిక్ ఆల్బమ్‌కు పని చేయాల్సిందిగా 20ఏళ్ల యువతిని ఇన్‌స్టా ద్వారా సంప్రదించాడు. ఆ తర్వాత ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. ఇద్దరూ రెగ్యులర్ గా కలవడం ప్రారంభించారు. బాధితురాలి కథనం ప్రకారం.. సచిన్ సంఘ్వి ఆమెను తన స్టూడియోకు పిలిచిన తర్వాత తనతో పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఆ తర్వాత అతడు ఆమెపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
అయితే ఈ ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి అని సచిన్ సంఘ్వి లాయర్ ఖండిస్తున్నారు. ఇప్పటివరకూ లైంగిక వేధింపుల కేసుపై సచిన్ కానీ అతడి ప్రొఫెషనల్ పార్టనర్ జిగర్ మౌనంగా ఉన్నారు. ఈ కేసుపై సచిన్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అతడి ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్ ఖాతాలు కూడా యాక్టివ్ గా లేవు.
సచిన్ ఇప్పటికే వివాహితుడు. అతడు శీతల్ ని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమార్తె ఉంది. కుమార్తె తనిష్కా సంఘ్వి కూడా ఒక గాయని. ఆమె 2015లో విడుదలైన `కోక్` స్టూడియోలో లాడ్కి పాటను పాడింది. సచిన్ పై ఆరోపణలు రావడంతో ఆ కుటుంబంలో ఆందోళన నెలకొంది.