ఒకే ఫ్రేమ్ లో మహేష్ - తారక్ - చరణ్..
MM కీరవాణి స్వరపరచిన అద్భుత సంగీతాన్ని రాయల్ ఫిల్హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రా సమక్షంలో బెన్ పోప్ నేతృత్వంలో వినిపించనున్నారు.;
ఇటీవల కాలంలో తెలుగు సినిమా సత్తాను అంతర్జాతీయంగా చాటి చెప్పిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఒక్కో సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రసీమ ప్రతిష్టను పెంచుతూ వస్తున్న ఆయన, భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు క్రియేట్ చేయనున్నట్లు ఆడియెన్స్ లో కూడా ఒక నమ్మకం ఏర్పడింది. ఇక నెక్స్ట్ మహేష్ బాబుతో గ్లోబల్ అడ్వెంచర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు మరోసారి గర్వించదగిన వేదికపై అడుగుపెట్టబోతున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లండన్ రాయల్ అల్బర్ట్ హాల్ వేదికగా RRR సినిమా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించబడుతోంది. ఇంతవరకు ఒక భారతీయ సినిమా ఇటువంటి ప్రతిష్టాత్మక వేదికపై ప్రదర్శించబడడం అరుదు. అయితే రాజమౌళి మాత్రం ఇప్పటికే ఈ ఘనతను ‘బాహుబలి 2’ తో 2019లో సాధించారు.
ఇప్పుడు అదే బాటలో RRR చిత్ర సంగీతాన్ని కూడా లైవ్ గా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. MM కీరవాణి స్వరపరచిన అద్భుత సంగీతాన్ని రాయల్ ఫిల్హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రా సమక్షంలో బెన్ పోప్ నేతృత్వంలో వినిపించనున్నారు. ఈ కార్యక్రమానికి మరింత ప్రాముఖ్యతను తెచ్చింది మహేష్ బాబు హాజరుకావడమే. ప్రస్తుతం SSMB29 కోసం రాజమౌళితో పనిచేస్తున్న మహేష్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు.
ఇది అలాగే RRR స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా రానున్నారు. ఇక ముగ్గురు టాప్ స్టార్లు ఒకే వేదికపై కనిపించే అరుదైన సందర్భంగా నిలిచిపోనుంది. అభిమానులు ఈ ముగ్గురి కలయికలో ఒక ఫొటో పడితే అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మహేష్ తాజా లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక రామ్ చరణ్ ఇప్పటికే లండన్‌లో ఉన్నారు.
మేడమ్ టుస్సాడ్స్ లో తన మొమెంటో ఆవిష్కరణ సందర్భంగా అక్కడకు వెళ్లిన ఆయన, RRR కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్టీఆర్ ఇప్పటికే షోలో భాగంగా పాల్గొనడానికి సిద్ధమయ్యారు. ఈ ముగ్గురు స్టార్ హీరోల మధ్య స్నేహబంధం, మ్యూజిక్ ఫెస్టివల్ తో కలిపి ఈ కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చబోతోంది.
RRR పాటలు, ముఖ్యంగా ‘నాటు నాటు’ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో, ఈ లైవ్ కాన్సర్ట్‌కు భారీ స్పందన లభిస్తోంది. మ్యూజిక్ లవర్స్‌తో పాటు సినిమా అభిమానులు కూడా ఈ ప్రదర్శనను ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది కేవలం సంగీత ప్రదర్శన మాత్రమే కాకుండా, తెలుగు సినిమా కల్చరల్ రికార్డ్ గా నిలవబోతున్నది.