శ్రీకాంత్ కొడుకు ప్లానింగ్ కరెక్టేనా?

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకడైన శ్రీకాంత్ ఘన వారసత్వాన్ని అందుకుంటూ సినీ రంగంలోకి అడుగు పెట్టిన కుర్రాడు రోషన్ మేక.;

Update: 2026-01-02 14:30 GMT

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకడైన శ్రీకాంత్ ఘన వారసత్వాన్ని అందుకుంటూ సినీ రంగంలోకి అడుగు పెట్టిన కుర్రాడు రోషన్ మేక. అతను చిన్నపిల్లాడిగా ఉండగానే ‘రుద్రమదేవి’ చిత్రంలో బాల నటుడిగా ఓ పాత్ర చేశాడు. ఆ తర్వాత టీనేజీలో ఉండగానే ‘నిర్మలా కాన్వెంట్’ అనే సినిమాలో నటించాడు. జెన్-జి భాషలో చెప్పాలంటే అదొక నిబ్బా-నిబ్బీ కథ. వర్కవుట్ కాలేదు. తర్వాత గ్యాప్ తీసుకుని ‘పెళ్ళిసంద-డి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ మారుతున్న కాలానికి తగ్గట్లు సినిమాలు తీయలేక చాలా ఏళ్ల ముందే సినిమాలు మానేసిన రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఒక లేడీ డైరెక్టర్ తీసిన ఈ సినిమా ప్రేక్షకులను టార్చర్ పెట్టింది.

కాకపోతే రోషన్, శ్రీలీల జంట అందం, అభినయం ఆకట్టుకోవడం.. పాటలు బాగుండడంతో సినిమా ఓ మోస్తరుగా ఆడింది. హీరో హీరోయిన్లు ఇద్దరికీ తర్వాత ఛాన్సులకు లోటు లేకపోయింది. కానీ శ్రీలీల వరుసగా సినిమాలు చేసుకుంటూ పోగా.. రోషన్ మాత్రం ఆచితూచి అడుగులు వేశాడు. ఇలా తొందరపడకుండా, జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదే కానీ.. రోషన్‌ కెరీర్లో మరీ ఎక్కువ గ్యాప్ వచ్చేసింది. అతణ్ని జనం మరిచిపోయారు. ఈసారి అతను ‘ఛాంపియన్’ రూపంలో మంచి కథనే ఎంచుకున్నాడు. కానీ కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న హీరోకు అది మోయలేని భారం అయిపోయింది. మరీ సీరియస్ కథ కావడం, కమర్షియల్ హంగులు లేకపోవడం కూడా దీనికి మైనస్ అయ్యాయి.

‘ఛాంపియన్’ను బ్యాడ్ మూవీ అనలేం. కానీ రోషన్‌ ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాక, స్టార్ ఇమేజ్ వచ్చాక అతను ఇలాంటి కథను ఎంచుకోవాల్సింది. ఈ పొరపాటుకు అతను మూల్యం చెల్లించుకుంటున్నాడు. తొలి వీకెండ్ వరకు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ‘ఛాంపియన్’ తర్వాత నిలబడలేకపోయింది. చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టేయడం, వసూళ్లు పెద్దగా లేకపోవడంతో బాక్సాఫీస్ భాషలో దీన్ని డిజాస్టర్ అనే అనాలి. ఇన్నేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన సినిమాకు ప్రతికూల ఫలితం వస్తే రోషన్ కెరీర్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందో వేరే చెప్పాల్సిన పని లేదు. ఇప్పటిదాకా అయితే రోషన్ కథల ఎంపిక సరిగ్గా లేదన్నది స్పష్టం. ఇక నుంచి అయినా అతను సరైన స్టోరీ తీసుకుని, ఎక్కువ ఆలస్యం చేయకుండా వేగంగా సినిమా పూర్తి చేసి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తే మంచిది.

Tags:    

Similar News