సినిమాల్లేకపోయినా 'తూనీగ' పోరాటానికి హ్యాట్సాఫ్‌!

టాలీవుడ్‌లో మెగా ప్రొడ్యూసర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో వచ్చిన `తూనీగ తూనీగ` సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన బెంగాలీ బ్యూటీ రియా చక్రవర్తి అందరికీ గుర్తే ఉంటుంది.

Update: 2026-06-21 08:30 GMT

టాలీవుడ్‌లో మెగా ప్రొడ్యూసర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో వచ్చిన `తూనీగ తూనీగ` సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన బెంగాలీ బ్యూటీ రియా చక్రవర్తి అందరికీ గుర్తే ఉంటుంది. ఆ సినిమాలో తూనీగలా అల్లరి చేస్తూ కుర్రకారు మనసులను దోచుకున్న ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టులలో నటించింది. అయితే ఒకానొక దశలో కెరీర్ అద్భుతంగా సాగుతుందనుకున్న సమయంలో త‌న స్నేహితుడు- బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆక‌స్మిక మరణం ఆమె జీవితాన్ని తీవ్రమైన మలుపు తిప్పింది. ఆ కేసులో రియా అనేక ఆరోపణలు ఎదుర్కొని తీవ్రమైన మానసిక వేదనను ఎదుర్కొన్నారు.



 


సుశాంత్ సింగ్ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత రియా చక్రవర్తి నిర్ధోషిగా బయటపడినా సినీ ప్రపంచం మాత్రం త‌న విష‌యంలో అస‌లు కనికరం చూపించలేదు. రియా జైలుకు వెళ్లి వచ్చిన క్రమంలో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తీవ్ర చర్చ నడిచింది. ఆ సమయంలో రియాకు మద్దతుగా నిలిచిన హిందీ చిత్రసీమలోని కొందరు నిర్మాతలు, దర్శకులు తమ సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని ప్రామిస్ చేశారు. అలాగే టాలీవుడ్‌లో మంచు కాంపౌండ్ సైతం రియా చక్రవర్తికి తమ సినిమాల్లో అవకాశాలిస్తామని బహిరంగంగానే ప్రకటించారు. కానీ ఇవేవీ ప్రాక్టికల్‌గా జరగలేదు. రియా గ‌త ప‌రాభ‌వాల‌ ఇంపాక్ట్ వల్ల ఏ ఒక్కరూ మళ్లీ వెండితెరపై ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదు.



 


సినిమా అవకాశాలు పూర్తిగా సన్నగిల్లడంతో ఈ తూనీగ తన కెరీర్‌ను కాపాడుకోవడానికి బుల్లితెర (టీవీ) వైపు మళ్లింది. ప్రస్తుతం రియా చక్రవర్తి ఎంటీవీ లో ప్రసారమయ్యే అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో `రోడీస్`లో గ్యాంగ్ లీడర్‌గా, హోస్ట్‌గా వ్యవహరించింది. ఈ షోలో కంటెస్టెంట్లను గైడ్ చేస్తూ తనదైన శైలిలో టాస్కులు ఇస్తూ బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్తగా దగ్గరైంది. వెండితెర తలుపులు మూసుకుపోయినా టీవీ హోస్టింగ్ ద్వారా రియా మళ్లీ పరిశ్రమలో తన ఉనికిని చాటుకుంటూ సెలబ్రిటీ హోదాను నిలబెట్టుకుంటోంది. రోడీస్ త‌ర‌హాలో ప‌లు రియాలిటీ షోల‌తో బిజీ అవుతోంది.



 


టీవీ షోలతో పాటు రియా చక్రవర్తి సోషల్ మీడియా ఆర్జనలపై కూడా గట్టిగా దృష్టి సారించి బతుకు వెళ్లదీస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉండటంతో దానిని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంది. ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన ప్రమోషన్లు, బ్యూటీ ప్రొడక్ట్స్, లైఫ్‌స్టైల్ యాడ్ పోస్టింగుల ద్వారా ప్రతి నెలా లక్షల్లో ఆదాయం వస్తోంది. సినిమాల్లేకపోయినా సోషల్ మీడియాలో నిరంతర గ్లామరస్ ఫోటోషూట్లు, పాజిటివ్ కోట్స్ షేర్ చేస్తూ డిజిటల్ వరల్డ్‌లో క్వీన్‌లా సంపాదిస్తోంది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలగాలని కలలు గన్న ఈ `తూనీగ`... జీవితంలోని ఎదురుదెబ్బలకు కుంగిపోకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతోంది. పెద్ద తెరపై అవకాశాలు రాకపోయినా.. లక్ కలిసిరాకపోయినా.. టీవీ హోస్టింగ్, సోషల్ మీడియా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లను నమ్ముకుని ఆర్థికంగా స్థిరపడుతోంది. సినీ పరిశ్రమ తనను దూరం పెట్టినా.. స్వయంకృషితో సరికొత్త కెరీర్‌ను నిర్మించుకుంటూ రియా చక్రవర్తి ముందుకు సాగుతున్న తీరు నిజంగా స్ఫూర్తిని నింపుతోంది.

ఐదేళ్ల క్రితం రియా చ‌క్ర‌వ‌ర్తి చెహ్రే అనే చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత త‌న జీవితంలో ఊహించ‌ని మెలోడ్రామా ఎదురైంది. అన్నిటినీ ఎదుర్కొని ఇప్పుడు రియా తదుపరి పెద్ద అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నారు. వెండితెర క‌థానాయిక‌గా తన కెరీర్‌ను తిరిగి ప్రారంభించడానికి ఉత్సాహంగా వేచి చూస్తోంది. అయితే త‌న‌కు ప్రామిస్ చేసిన గ‌త స్నేహితులు త‌న‌కోసం ఏదైనా స‌హాయం చేయ‌లేరా? అన్న‌దే ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌!

Tags:    

Similar News