వెబ్ సిరీస్‌గా 'రెట్రో' ఎక్స్‌టెండెడ్ వెర్షన్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.;

తమిళ్ స్టార్ హీరో సూర్య ఇటీవల 'రెట్రో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. సినిమా ప్రారంభం మొదలుకుని విడుదల వరకు అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా అంటే మంచి కంటెంట్ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులు ముఖ్యంగా సూర్య అభిమానులు తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేసే విధంగా రెట్రో సినిమా ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ సైతం రెట్రో సినిమా ఫలితం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాను అనుకున్నట్లుగా కాకుండా కాస్త అటు ఇటుగా ఈ సినిమా వచ్చిందని సన్నిహితులతో అన్నాడని తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. థియేట్రికల్ రిలీజ్ సమయంలో నిరాశ పరిచిన రెట్రో సినిమాకు కాస్త ఊరట కలిగించే విధంగా ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలో మంచి ఫలితం దక్కింది. ఓటీటీ లో రెట్రో సినిమాను తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు, ఇతర భాషల ప్రేక్షకులు సైతం చాలా మంది చూశారని తెలుస్తోంది. రెట్రో సినిమాను ఓటీటీ ప్రేక్షకులకు మరింతగా చేరువ చేయడం కోసం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరిపినట్లు చెప్పుకొచ్చాడు. రెట్రో సినిమాను పొడిగించి కొన్ని నెలల తర్వాత అదే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే ఉద్దేశంతో కార్తీక్ సుబ్బరాజ్ ఉన్నాడట.
నెట్ ఫ్లిక్స్‌తో తాను చర్చలు జరుపుతున్నానని, మూడు నాలుగు నెలల తర్వాత ఓటీటీలో ప్రీమియర్ చేసిన సినిమాను పొడిగించి కొత్త సన్నివేశాలతో ఒక పరిమిత ఎపిసోడ్‌ల సిరీస్‌గా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు పేర్కొన్నాడు. ఎక్స్‌టెండెడ్ వర్షన్ లో కేవలం సినిమాలో తొలగించిన సన్నివేశాలు మాత్రమే కాకుండా కథ, కథనంలో కూడా మార్పులు ఉండే విధంగా ఉంటుందని దర్శకుడు హమీ ఇచ్చాడు. సినిమాగా విడుదలైన కంటెంట్‌ను అదే కథతో, అవే సీన్స్, నటీనటులతో వెబ్ సిరీస్‌గా స్ట్రీమింగ్ చేయడం ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ ఆ ప్రయత్నం చేయబోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ ప్రయత్నం ఏం అవుతుందో చూడాలి.
సాధారణంగా సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఓటీటీలో అదే వర్షన్‌ను విడుదల చేస్తారు. కొందరు మాత్రం కొన్ని సన్నివేశాలను యాడ్ చేయడం చేస్తారు. అంతే తప్ప గంటలు గంటల కంటెంట్‌ను సినిమాకు కొత్తగా యాడ్ చేయడం అనేది జరగదు. కానీ రెట్రో సినిమాను దాదాపు అయిదు గంటల నిడివితో ఓటీటీలో మినీ వెబ్ సిరీస్‌గా ఎక్స్‌టెండెడ్ వర్షన్‌గా స్ట్రీమింగ్ చేయాలని భావించడం కచ్చితంగా పెద్ద ప్రయోగం. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ముందు ముందు ఇలాంటివి పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది చర్చల దశలో ఉంది. రెట్రో వెబ్ సిరీస్‌గా రావడానికి కనీసం మూడు నాలుగు నెలల సమయం అయినా పట్టవచ్చు. హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన రెట్రో కనీసం ఓటీటీలో వెబ్ సిరీస్‌గా అయినా సక్సెస్ దక్కించుకునేనా చూడాలి.