‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!
| పైరసీ ముప్పు నుంచి `రామాయణ` చిత్రాన్ని రక్షించేందుకు గాడ్‌పవర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (న్యాయవాద సంస్థ) ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా పాపులరైన `రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్` చిత్రానికి బాంబే హైకోర్టులో కీలక లీగల్ విజయం లభించింది. నిర్మాత నమిత్ మల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ మాధవ్ జమ్దార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సినిమా కాపీరైట్లను పరిరక్షించేందుకు `అడ్-ఇంటరిమ్ డైనమిక్ ఇంజంక్షన్` జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా అజ్ఞాత వ్యక్తులు లేదా డిజిటల్ వేదికలు ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్, పాత్రలు, వీడియో ఫుటేజ్, పాటలు, ఆడియో రికార్డింగ్‌లను అనుమతి లేకుండా రికార్డ్ చేయడం, హోస్ట్ చేయడం లేదా స్ట్రీమింగ్ చేయడాన్ని న్యాయస్థానం పూర్తిగా నిషేధించింది.
పైరసీ ముప్పు నుంచి `రామాయణ` చిత్రాన్ని రక్షించేందుకు గాడ్‌పవర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (న్యాయవాద సంస్థ) ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆహ్వానితులకు మాత్రమే నిర్వహించిన ప్రివ్యూ స్క్రీనింగ్స్‌లో కఠినమైన ఒప్పందాలు ఉన్నా.. రెండు ట్రైలర్లు లీక్ అయి డిజిటల్ నెట్‌వర్క్‌లలో ప్రత్యక్షమయ్యానని నిర్మాతలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వ్యాపారపరంగా భారీ పెట్టుబడితో ముడిపడి ఉన్న మొదటి భాగం నిర్మాణం కోసం రూ.2,000 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసామని.. రెండు భాగాల మొత్తం బడ్జెట్ రూ.4,000 కోట్లు అని నిర్మాతలు న్యాయస్థానానికి వివరించారు.
సినిమా కంటెంట్ చట్టవిరుద్ధంగా లీక్ కావడంపై నిర్మాతలు ఆందోళన చెందగా.. దానిని పరిశీలించిన న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించేందుకు బలమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని గుర్తించింది. గూగుల్ ఎల్‌ఎల్‌సితో పాటు ఇతర ప్రముఖ గ్లోబల్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రతినిధులు ఈ ఉత్తర్వులపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. పైరసీకి సంబంధించి సమాచారం లేదా లింకులు అందగానే తక్షణమే వాటిని బ్లాక్ చేసి తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసిన కోర్టు అప్పటివరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది.
`దంగల్` ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వాల్మీకి మహర్షి రచించిన పురాణేతిహాసం రామాయణ కథ ఆధారంగా రూపుదిద్దుకుంది. డిఎన్ఇజి - ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ పతాకాలపై నమిత్ మల్హోత్రాతో కలిసి రాకింగ్ స్టార్ యష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియా ద్విభాగాత్మక చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల కానున్న ఈ సినిమాకు బాంబే హైకోర్టు ఇచ్చిన డైనమిక్ ఆదేశాలు పెద్ద ఊరటగా నిలిచాయి. పైరసీ- అనధికారిక లీకులపై కఠినంగా వ్యవహరించేలా జారీ చేసిన ఈ ఉత్తర్వులు భారతీయ చిత్రసీమలోని భారీ బడ్జెట్ సినిమాల కాపీరైట్ రక్షణకు ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తాయి. నవంబర్ 5న మొదటి భాగం విడుదలవుతోంది. రామాయణం రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కావాల్సి ఉంది.