కల్పిత కథతో ప్రేక్షకుల్ని మభ్య పెట్టబోతున్న బిగ్ స్టార్
ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, దౌత్య సంబంధాల ప్రభావం సినిమా రంగంలోను ప్రముఖ పాత్ర పోషించనుంది.;
ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, దౌత్య సంబంధాల ప్రభావం సినిమా రంగంలోను ప్రముఖ పాత్ర పోషించనుంది. ఒక యథార్థ దేశభక్తి గాథను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఇప్పుడు తన కథాంశాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి రావడం ప్రధానంగా చర్చకు వచ్చింది. పొరుగు దేశం చైనాతో నెలకొన్న తాజా దౌత్య సంబంధాల నేపథ్యంలో, వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా ఉండాలని భావించిన చిత్ర బృందం స్క్రిప్టులో పెను మార్పులు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే చిత్రీకరించిన కీలక సన్నివేశాలను పక్కన పెట్టి.. కోట్లాది రూపాయలు నష్టపోయి.. ఇప్పటికీ అదనపు వ్యయంతో రీషూట్‌లు నిర్వహిస్తోంది.
వార్ జోనర్ నుంచి ప్రేమకథ వైపు..
మొదట రెండు దేశాల మధ్య జరిగిన సైనిక ఘర్షణను ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు పూర్తిగా ఒక `ఫిక్షన్` (కల్పిత) కథగా రూపుదిద్దుకుంటోంది. యథార్థ ఘటనల ఆధారంగా తీస్తే దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో కథలోని వాస్తవికతను తగ్గించి కల్పిత అంశాలకు పెద్దపీట వేశారు. ఫలితంగా సినిమా టైటిల్‌ను కూడా మార్చడం గమనార్హం. యుద్ధ భూమిలోని పోరాటం కంటే ఒక సైనిక అధికారి తన వృత్తిపరమైన బాధ్యతలకు, వ్యక్తిగత ప్రేమకు మధ్య పడే సంఘర్షణనే ఇప్పుడు ప్రధానంగా చూపిస్తున్నారని కథనాలొస్తున్నాయి.
తగ్గుతున్న ఆసక్తి?
నిజానికి ఈ చిత్రం విక్కీ కౌశల్ `యూరి` తరహాలో ఒక రియలిస్టిక్ కథగా వస్తుందని ప్రేక్షకులు ఎంతో ఆశించారు. అయితే ఇది కేవలం కల్పిత కథ మాత్రమేనని ప్రచారం జరుగుతుండటంతో ప్రేక్షకుల్లో ఉండాల్సిన సహజమైన క్యూరియాసిటీ తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశభక్తి భావజాలాన్ని బలంగా రగిలించే అవకాశం ఉన్న కథను కేవలం రొమాంటిక్ డ్రామాగా మార్చేయడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విడుదల వాయిదా:
స్క్రిప్టులో చేసిన భారీ మార్పుల వల్ల షూటింగ్ షెడ్యూల్స్ కూడా తారుమారయ్యాయి. రక్షణ మంత్రిత్వ శాఖ నుండి తుది అనుమతులు రావాల్సి ఉండటంతో ఈ చిత్రం తొలుత అనుకున్న సమయం కంటే కొన్ని నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రధాన భాగం షూటింగ్ ముగిసినా.. వేసవిలో కొంత ప్యాచ్ వర్క్ పూర్తి చేసి అక్టోబర్ నాటికి సినిమాను సిద్ధం చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. వాస్తవానికి దూరంగా జరిగి కేవలం `లవ్ అండ్ వార్` అనే నినాదంతో వస్తున్న ఈ కొత్త వెర్షన్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. దేశభక్తిని రగిలించాల్సిన సినిమాని పూర్తిగా ఫిక్షనలైజ్ చేయడంతో దీనిపై సహజంగానే ఆసక్తి తగ్గిపోయిందనే గుసగుస వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమా కథాంశాన్ని, టైటిల్ ని మొదటిసారి ప్రకటించినప్పుడు చాలా క్యూరియాసిటీ ఉండేది. ఇప్పుడు అదంతా జీరో అయిపోయింది.