'రేజర్' మూవీ రివ్యూ

విలక్షణమైన సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణీ ఏర్పరుచుకున్నాడు రవిబాబు.;

Update: 2026-05-08 10:28 GMT

'రేజర్' మూవీ రివ్యూ

నటీనటులు: రవిబాబు- తనీష్- బెనర్జీ తదితరులు

సంగీతం: రాజేష్

ఛాయాగ్రహణం: చరణ్ మాధవనేని

నిర్మాతలు: రవిబాబు- సురేష్ బాబు

స్క్రీన్ ప్లే: సత్యానంద్

కథ-మాటలు-దర్శకత్వం: రవిబాబు

విలక్షణమైన సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణీ ఏర్పరుచుకున్నాడు రవిబాబు. ఐతే ఈ మధ్య సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్న ఆయన.. తనే ప్రధాన పాత్ర పోషిస్తూ స్వీయ నిర్మాణంలో రూపొందించిన సినిమా రేజర్. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి కనకరాజుకు సంబంధించిన సీక్రెట్ వీడియో ఒక వ్యక్తి దగ్గరికి చేరుతుంది. దీంతో ఆ వ్యక్తితో పాటు తన భార్యనూ హోం మంత్రి మనుషులు చంపేస్తారు. ఈ బాధితుల కూతురు మాత్రం తప్పించుకుని బయటపడుతుంది. ఈ పాప ఇంటికి డాగ్ గ్రూమింగ్ కోసం వచ్చిన రుద్ర (రవిబాబు) కాపాడి.. తన సంరక్షణ బాధ్యతలు తీసుకుంటాడు. తమ ఇద్దరినీ చంపేద్దామని ప్రయత్నిస్తున్న వారిని అతనెలా ఎదుర్కొన్నాడు.. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.. అది ఏమైంది.. దాన్ని రుద్ర సంపాదించి ఏం సాధించాడు అన్న ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: తెలుగులో ఎన్నో హింసాత్మక సినిమాలు చూసి ఉంటారు. ‘రేజర్’ వాటన్నింటినీ భారీ తేడాతో ఓడించేస్తుంది. మనుషులను ఎన్ని రకాలుగా చంపొచ్చు.. హింసలో కూడా ఎంత క్రియేటివిటీ చూపించొచ్చు అన్నదానికి ఒక డెమోలా రవిబాబు ఈ సినిమా తీర్చిదిద్దాడేమో అనిపిస్తుంది. ట్రైలర్లో చూపించింది జస్ట్ శాంపిల్. థియేటర్లో కూర్చున్నాక అసలు సినిమా కనిపిస్తుంది. రెండు గంటల నిడివిలో లెక్కలేనన్ని ఫైట్లు చేసే రవిబాబు.. కనీసం వంద మందికి తక్కువ కాకుండా చంపి అవతలేస్తాడు. ఆ వంద మందిలో ఏ ఒక్కరినీ ఒకేలా చంపడు. ఆ హింసనంతా చూసి తట్టుకుని చివరి వరకు కూర్చోవడమే ఒక పరీక్ష. ఇది చాలదన్నట్లు వీడియో గేమ్ తరహాలో ఇందులో ఒక స్టోరీ నడుస్తుంటుంది. దాన్నంతా కూడా చివరి వరకు ఫాలో అవడం ఇంకో పెద్ద టెస్టు. తెర మీద రకరకాల పద్ధతుల్లో హింసకు గురవుతున్న రౌడీల పరిస్థితినే దాదాపుగా ప్రేక్షకులు కూడా ఎదుర్కొంటారు. ఈ రవిబాబే ఒకప్పుడు ‘అనసూయ’ లాంటి అద్భుతమైన థ్రిల్లర్ తీశాడా అని షాకవకుండా ఉండలేరు ఆయన అభిమానులు. అంతగా భరించలేని హింస పెడుతుంది ‘రేజర్’.

‘‘నీకు ఇవ్వడానికి ఇంక అవార్డులు కూడా ఏమీ లేవు. కొత్తగా ఏవైనా క్రియేట్ చేయాల్సిందే. లేదంటే ఇప్పుడు నీకిస్తున్న అవార్డును వెనక్కి తీసుకుని మళ్లీ దాన్నే నీకివ్వాలి’’.. ‘రేజర్’ సినిమాలో హీరో రవిబాబును కొనియాడుతూ ఒక ఆర్మీ ఉన్నతాధికారి చెప్పే డైలాగ్ ఇది. ఇంకో సీన్లో.. ‘‘వాడ్ని చంపడానికి ఎంతమంది వెళ్లినా.. శవాలు పేరుకుపోతాయి తప్ప వాడినేమీ చేయలేరు’’ అంటూ హీరోకు మరో పాత్ర ఎలివేషన్ ఇస్తుంది. తెలుగులో సోకాల్డ్ కమర్షియల్ సినిమాల గురించి ఎప్పుడూ కౌంటర్లు వేసే రవిబాబు సినిమాలో ఇలాంటి డైలాగులు.. ఎలివేషన్లు చూశాక ఏం మాట్లాడాలో అర్థం కాదు. సినిమాలో వందల మంది రౌడీలు అతడి మీదికి వస్తుంటారు. అతనేమో రకరకాల ఆయుధాలు పట్టుకుని వాళ్లందరినీ పోగులు పెట్టి వదులుతుంటాడు. మరీ విడ్డూరమైన విషయం ఏంటంటే.. ఒక ఎపిసోడ్లో పదుల సంఖ్యలో స్పెషల్ కమాండోలు హీరో ఉండే ఇంటిని చుట్టుముడతారు. వాళ్లందరి చేతిలో మెషీన్ గన్నులుంటాయి. హీరో చేతిలో మాత్రం ఏ ఆయుధం ఉండదు.. ఒక టార్చ్ లైట్ తప్ప. అయినా వాళ్లు ఇతణ్ని ఏమీ చేయలేరు. కేవలం ఆ టార్చి లైట్ ముఖాల మీదికి వేసి వాళ్ల ఫోకస్ చెడగొట్టడమే కాక అదే టార్చితో అందరినీ చితకబాదేస్తాడు. వారిలో ఒక్కరు కూడా గన్ను వాడలేక హీరో చేతిలో తన్నులు తిని పలాయనం చిత్తగిస్తారు. ఇదెక్కడి హీరోయిజం.. ఇదేం లాజిక్కో రవిబాబుకే తెలియాలి.

రెండు గంటల రన్ టైం ఉన్న ‘రేజర్’లో సగం నిడివి ఫైట్లకే సరిపోతే.. మిగతా సగంలో ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తుంటుంది. ఒకపక్క విలన్ టీం ఒక సిస్టం పెట్టుకుని హీరో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు.. ఏం చేస్తున్నాడో చూస్తుంటుంది. ఇంకోవైపు హీరో టీం దగ్గరా ఒక సిస్టం ఉంటుంది. దాన్నుంచి వాళ్లు విలన్ గ్యాంగ్ కదలికల్ని గమనిస్తుంటారు. ఇరు వర్గాలూ పరస్పరం ఒకరినొకరు ఫాలో అవడం.. కౌంటర్ ఎటాక్స్ చేయడం.. ఇదీ వరస. ఒక సిస్టమ్-ఇంటర్నెట్ ఉంటే చాలు.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా మన కళ్ల ముందు కనిపించేస్తుంది.. ఏదైనా ఇట్టే కనిపెట్టేయొచ్చు అన్నట్లుగా రెండు గ్యాంగులూ కంప్యూటర్ స్క్రీన్లు పెట్టుకుని చేసే హడావుడి అంతా ఇంతా కాదు. రవిబాబు ఏ కాలంలో స్ట్రక్ అయిపోయాడో చెప్పడానికి ఈ ఎపిసోడ్లే రుజువు. కథలో కీలకమైన వీడియోను దాచడానికి ఒక వ్యక్తి ఏం చేశాడన్నది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లాగా చూస్తే మానవమాత్రుడికి ఎవరికైనా దీన్ని క్రాక్ చేయడం సాధ్యమా అనిపిస్తుంది. కానీ హీరో అండ్ టీమ్ మాత్రం చిటికెలు వేసినంత సులభంగా అన్నీ కనిపెట్టేసి వీడియోను క్రాక్ చేసి పడేస్తుంది. ఈ తంతు అంతా చూస్తే నోట మాట రాదు. మొత్తంగా చెప్పాలంటే రవిబాబు అంటే మహా తెలివైన రైటర్-డైరెక్టర్ అని ఇంతకుముందున్న ముద్రను గత పదేళ్లలో వచ్చిన అనేక సినిమాలు కొంచెం కొంచెం చెరుపుతూ రాగా.. ఇప్పుడు ‘రేజర్’తో మొత్తంగా ఆ ఫీలింగ్ వాషౌట్ అయిపోతుంది.

నటీనటులు: రవిబాబు ఈ సినిమాలో చేసినవి రెండే పనులు. ఐతే ఫైట్లు చేయడం.. లేదంటే సీరియస్ గా ఒక చూపు చూడడం. మొత్తం సినిమాలో అంతకుమించి ఏమీ చేయలేదు. తన కుటుంబాన్ని కోల్పోయాక బాధతో ఏడ్చే సీన్ ఒకటి ఉంది కానీ.. ముఖానికి వేసుకున్న మేకప్ వల్ల అందులో ఎక్స్ ప్రెషన్ ఏమీ కనిపించలేదు. కథలో కీలకంగా ఉండే చిన్న పాప పాత్రలో చేసిన అమ్మాయి బాగా నటించింది. తనీష్ కనిపించిన కాసేపు ఓవరాక్షన్ చేశాడు. బెనర్జీ పర్వాలేదు. హోం మంత్రి పాత్ర చేసిన నటుడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అతడి కొడుకుల పాత్రలు చేసిన వాళ్లలో ఒకతను పర్వాలేదు. ఇంకొకతని నటన పేలవం. హీరో టీంలోని ముగ్గురిలో బాల నటుడిగా చేసిన కుర్రాడు ఒకడు బాగా చేశాడు. మిగతా ఇద్దరూ అవసరానికి మించి నటించారు.

సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘రేజర్’ పర్వాలేదు. రవిబాబు థ్రిల్లర్ సినిమాల్లో ఎప్పుడూ వినిపించే సౌండ్సే ఇందులోనూ ఉన్నాయి. రాజేష్ నేపథ్య సంగీతంలో కొత్తదనం లేదు కానీ.. ఈ స్టోరీ నడతకు తగ్గ మ్యూజిక్కే ఇచ్చాడు. చరణ్ మాధవనేని ఛాాయాగ్రహణం బాాగాేే సాగింది. నిర్మాణ విలువలు ఏమీ బాగా లేవు. రవిబాబు ఎప్పుడూ కెమెరా.. ఆర్ట్ వర్క్ మాయాజాలంతో ఒక లొకేషన్లోనే అటు ఇటు తిప్పి సన్నివేశాలు తీసేస్తుంటాడు. ఇందులో కూడా అదే చేశాడు. కానీ హింసను చూపించే సన్నివేశాల కోసం వాడిన విజువల్ ఎఫెక్ట్స్ ఘోరంగా తయారయ్యాయి. ఆ సీన్లన్నీ నాసిరకంగా అనిపిస్తాయి. ఇక రవిబాబు కథ గురించి.. సత్యానంద్ స్క్రీన్ ప్లే గురించి కానీ చెప్పడానికి ఏమీ లేదు. స్క్రిప్టులో ఔట్ డేటెడ్ వాసనలు గుప్పుమంటాయి. రవిబాబు టేకింగ్ కూడా అందుకు తగ్గట్లే సాగింది.

చివరగా: రేజర్.. తట్టుకోలేని ‘హింస’

రేటింగ్ -1.5/5

Tags:    

Similar News