హిట్ తర్వాతే రవితేజ లెక్క తప్పుతోందే!
ఇప్పుడు ఇరుముడితో మళ్ళీ స్ట్రాంగ్ హిట్ దక్కింది. ముఖ్యంగా రవితేజకు ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ కలిసొచ్చినప్పుడు ప్రేక్షకులు ఇంకా బాగా రిసీవ్ తీసుకుంటారని ఈ సినిమా మరోసారి గుర్తు చేసింది.
ఇరుముడితో రవితేజ మళ్లీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ చూశాడు. కొన్నేళ్లుగా వరుసగా సరైన రిజల్ట్ రాక ఇబ్బంది పడుతున్న సమయంలో వచ్చిన సక్సెస్ ఇది. కానీ రవితేజ కెరీర్‌ను వెనక్కి తిరిగి చూస్తే ఒక ఉహించని రిజల్ట్ కంగారు పెట్టేలా ఉంది. ఈమధ్య మాస్ రాజా పెద్ద హిట్ కొట్టిన ప్రతీసారి, తర్వాత అదే ఫామ్‌లో వెళ్లలేకపోయాడు. హిట్ ఎంత పెద్దగా వచ్చిందో, దాని తర్వాత వచ్చిన ఫ్లాప్ కూడా అంతే గట్టిగా తగిలింది.
2017లో రాజా ది గ్రేట్ మంచి హిట్ అయింది. అనిల్ రావిపూడి ఎంటర్‌టైన్‌మెంట్, అంధుడి పాత్రలో రవితేజ టైమింగ్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. అప్పటికి ఆయన కెరీర్‌లోనే మంచి వసూళ్లు చూసిన సినిమాల్లో అది ఒకటి. కానీ వెంటనే వచ్చిన టచ్ చేసి చూడు మాత్రం డిజాస్టర్ అయింది. ఆ సినిమా కమర్షియల్ గా చాలా నష్టాలు చూడాల్సి వచ్చింది.
క్రాక్ తర్వాత కూడా దాదాపు ఇదే జరిగింది. వరుస ఫ్లాపుల మధ్య 2021 సంక్రాంతికి వచ్చిన క్రాక్ రవితేజకు బలమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. గోపీచంద్ మలినేని మాస్ ఎలిమెంట్స్‌ను సరిగ్గా వాడుకోవడంతో సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఖిలాడి మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ రిలీజ్ తర్వాత సినిమా భారీ ఫ్లాప్‌గా మిగిలింది.
ధమాకా రవితేజను మళ్లీ వంద కోట్ల రేంజ్‌కు తీసుకెళ్లింది. వెంటనే వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి మరో పెద్ద హిట్ అందుకున్నాడు. కానీ అది ఆయన సోలో సినిమా కాదు. సోలో హీరోగా తర్వాత వచ్చిన రావణాసుర మాత్రం ఫ్లాప్ అయింది. అక్కడి నుంచి టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర వరకు వరుసగా అనుకున్న రిజల్ట్స్ రాలేదు. జానర్లు మార్చినా, దర్శకులు మారినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం బ్రేక్ పడుతూనే వచ్చింది.
ఇప్పుడు ఇరుముడితో మళ్ళీ స్ట్రాంగ్ హిట్ దక్కింది. ముఖ్యంగా రవితేజకు ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ కలిసొచ్చినప్పుడు ప్రేక్షకులు ఇంకా బాగా రిసీవ్ తీసుకుంటారని ఈ సినిమా మరోసారి గుర్తు చేసింది. పైగా చాలా రోజుల తర్వాత థియేటర్లలో రవితేజ సినిమాకు లాంగ్ రన్ కూడా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఈ హిట్ తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడు అనేది ఆసక్తిగా మారింది.
హషిత్ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణుతో కలిసి రవితేజ చేయబోయే సినిమా వచ్చే సంక్రాంతికి వస్తోంది. జనవరి 14 రిలీజ్ కూడా ప్రకటించారు. ఇది పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా రానుంది. పైగా రవితేజకు బాగా సెట్ అయ్యే కామెడీ టైమింగ్‌కు ఇందులో మంచి స్పేస్ ఉంటుందనే టాక్ ఉంది. శ్రీ విష్ణుతో ఈ కాంబినేషన్ కూడా కొత్తగా ఉండబోతోంది. గతంలో హిట్ తర్వాత వెంటనే లెక్క తప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈసారి మాత్రం ఇరుముడి ఫామ్‌ను సంక్రాంతి వరకు తీసుకెళ్తాడేమో చూడాలి.