వరుస ఫ్లాపులు.. ఒక్క సినిమాతో మళ్లీ రేసులోకి వచ్చిన స్టార్స్
రవితేజకు ఇలాంటి టర్న్ రావడం ఇదే మొదటిసారి కాదు. ఇక ఇదే తరహాలో గతంలో వరుస ఫ్లాప్స్ చూసి ట్రాక్ లోకి వచ్చిన హీరోల లిస్టులోకి వెళితే..
హీరో కెరీర్‌లో ఒక్క హిట్ ఎంత బూస్ట్ ఇస్తుందో రవితేజ ‘ఇరుముడి’తో మరోసారి రుజువైంది. కొన్నేళ్లుగా సినిమాలు వస్తున్నా బాక్సాఫీస్ దగ్గర సరైన రిజల్ట్ పడలేదు. ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘మాస్ జాతర’ ఇలా వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. ఇప్పుడు ‘ఇరుముడి’ మాత్రం మొదటి వీకెండ్ నుంచే మంచి వసూళ్లతో వెళ్తోంది. రవితేజకు ఇలాంటి టర్న్ రావడం ఇదే మొదటిసారి కాదు. ఇక ఇదే తరహాలో గతంలో వరుస ఫ్లాప్స్ చూసి ట్రాక్ లోకి వచ్చిన హీరోల లిస్టులోకి వెళితే..
గబ్బర్ సింగ్
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘గబ్బర్ సింగ్’ కూడా అలాంటి సినిమానే. ‘జల్సా’ తర్వాత ‘పులి’, ‘తీన్ మార్’, ‘పంజా’ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పవన్‌కు మళ్లీ పెద్ద హిట్ ఎప్పుడు వస్తుందనే పరిస్థితి వచ్చినప్పుడు 2012లో ‘గబ్బర్ సింగ్’ వచ్చింది. హరీశ్ శంకర్ పవన్ ఇమేజ్‌ను సరిగ్గా వాడుకోవడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. ఆ ఒక్క సినిమా తర్వాత పవన్ మార్కెట్ మళ్లీ గట్టిగా నిలబడింది.
ఇష్క్
నితిన్‌కు ‘ఇష్క్’ ఇంకా పెద్ద బూస్ట్ ఇచ్చిన సినిమా. ఒకటి రెండు కాదు.. వరుసగా డజను వరకు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కెరీర్ పూర్తిగా డౌన్‌లో ఉన్న సమయంలో వచ్చిన ‘ఇష్క్’ మంచి హిట్ అయింది. ఆ తర్వాత ‘గుండె జారి గల్లంతయ్యిందే’ కూడా వర్కవుట్ కావడంతో నితిన్ మళ్లీ హీరోగా మంచి ట్రాక్‌లోకి వచ్చాడు. ఒక్క ప్రేమకథ అతని కెరీర్‌ను మళ్లీ సెట్ చేసింది.
చిత్రలహరి
సాయి ధరమ్ తేజ్‌కు కూడా ‘చిత్రలహరి’ ముందు పరిస్థితి బాగాలేదు. ‘తిక్క’, ‘విన్నర్’, ‘జవాన్’, ‘ఇంటెలిజెంట్’, ‘తేజ్ ఐ లవ్ యూ’ ఇలా వరుసగా సినిమాలు మిస్ ఫైర్ అయ్యాయి. ‘చిత్రలహరి’ మాత్రం డీసెంట్ హిట్ ఇచ్చి అతనికి కొంత రిలీఫ్ ఇచ్చింది. వెంటనే ‘ప్రతి రోజూ పండగే’ పెద్ద విజయం కావడంతో ఆ రికవరీ మరో స్థాయికి వెళ్లి మార్కెట్ కూడా పెరిగింది.
క్రాక్
రవితేజకు గతంలో ‘క్రాక్’ ఇదే పని చేసింది. ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘డిస్కో రాజా’ తర్వాత వచ్చిన ‘క్రాక్’ పెద్ద హిట్ అయింది. గోపీచంద్ మలినేని మళ్లీ రవితేజ మాస్ ఇమేజ్‌ను సరిగ్గా పట్టుకున్నారు. రాజా ది గ్రేట్ కూడా మరో హిట్ మూవీ. కానీ ఆ హిట్ తర్వాత కూడా కెరీర్ పూర్తిగా సాఫీగా వెళ్లలేదు. కొన్ని సినిమాలు ఆడగా, మళ్లీ వరుసగా ఫ్లాపులు వచ్చాయి.
ఇప్పుడు ‘ఇరుముడి’ మరోసారి అదే చోట రవితేజకు హిట్ ఇచ్చింది. తేడా ఏంటంటే ఈసారి ఆయన రెగ్యులర్ మాస్ జోన్ నుంచి కాస్త బయటకు వచ్చి ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న కథ చేశారు. తర్వాత హసిత్ గోలి, వివేక్ ఆత్రేయ లాంటి దర్శకులతో సినిమాలు ఉండటం కూడా కొత్తగా కనిపిస్తోంది. ఇక ‘ఇరుముడి’ తర్వాత మాత్రం నెక్స్ట్ రెండు సినిమాలు సరిగ్గా పడితే ఈసారి కమ్‌బ్యాక్ ఇంకాస్త లాంగ్‌గా వెళ్లొచ్చు.