సౌరవ్ గంగూలీ బయోపిక్ `దాదా` పోస్టర్ కల్లోలంపై స్పందన
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ `దాదా` సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌పై వస్తున్న విమర్శలపై బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు స్పందించారు.
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ `దాదా` సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌పై వస్తున్న విమర్శలపై బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు స్పందించారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో నిర్మాతలు, చిత్ర బృందం తొందరపడకుండా.. నిలకడగా సరైన పద్ధతిలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడి కథను తెరకెక్కించేటప్పుడు ఎంతో ఓపిక, వివరాలపై స్పష్టత అవసరమని ఈ అనుభవం నిరూపించిందని తెలిపారు.
ఈ వివాదం జూలై 8న గంగూలీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మొదలైంది. 2002లో లండన్‌లోని లార్డ్స్ మైదానంలో నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయం తర్వాత గంగూలీ చొక్కా విప్పి.. జెండా ఊపుతూ చేసిన చారిత్రాత్మక సంబరాలను రాజ్‌కుమార్ రావు రీ-క్రియేట్ చేస్తూ ఈ పోస్టర్‌ను రూపొందించారు. అయితే ఈ పోస్టర్ నాణ్యత, ఎగ్జిక్యూషన్ సరిగా లేవని.. చూడటానికి ఇది కృత్రిమంగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా డిజైన్ చేసినట్లుగా ఉందంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ విమర్శలపై స్పందిస్తూ.. చిత్ర బృందానికి ఈ అనుభవం ఒక మంచి పాఠంగా ఉపయోగపడిందని రాజ్‌కుమార్ రావు అన్నారు. అభిమానుల స్పందన ద్వారా గంగూలీకి ఉన్న క్రేజ్ ఎంత గొప్పదో.. ఆయన జీవితంపై ప్రజలకు ఉన్న భావోద్వేగం ఎంత డెప్త్ ఉన్నదో స్పష్టమైందని చెప్పారు. తొందరపడి పనులు పూర్తి చేయడం కంటే.. సమయం తీసుకుని ప్రతీ సన్నివేశాన్ని పక్కాగా తీర్చిదిద్దడం ఎంత ముఖ్యమో టీమ్ గ్రహించిందని ఆయన వివరించారు.
ఈ పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు రాజ్‌కుమార్ రావు కోల్‌కతాలో గంగూలీతో కలిసి చాలా సమయం గడిపారు. కోల్‌కతాలోని గంగూలీ నివాసంతో పాటు చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కూడా చిత్రీకరణలో పాల్గొన్నారు. గంగూలీ తన జీవితంలో ఎదుర్కొన్న హెచ్చుతగ్గులు, మానసిక స్థితిని అర్థం చేసుకునేందుకు ఆయనతో విస్తృతంగా చర్చించానని..గంగూలీ ఎంతో ఓపెన్‌గా తన జీవితాన్ని తన ముందుంచారని రావు ప్రశంసించారు.
ఒకవైపు `దాదా` ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతుండగానే రాజ్‌కుమార్ రావు తన తదుపరి చిత్రం `ప్రహార్: ది ఉజ్వల్ నికమ్ స్టోరీ` విడుదలకు సిద్ధమవుతున్నారు. అవినాష్ అరుణ్ దర్శకత్వంలో, దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ కోర్టు రూమ్ డ్రామాలో వామికా గబ్బి, జైదీప్ అహ్లావత్ వంటి ప్రముఖ నటులు నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.