ప‌వ‌న్‌తో అయినా ర‌జ‌నీతో అయినా సీక్వెల్ పెద్ద రిస్కే!

మైండ్ బ్లోయింగ్ విజువ‌ల్స్ సీక్వెల్‌లో ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అందుకోసం దర్శకుడు స్క్రిప్టు దశలోనే తీవ్రమైన గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.

Update: 2026-10-10 22:30 GMT

ఏదైనా ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయం సాధించి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాక.. దానికి సీక్వెల్ తెరకెక్కించడం అనేది దర్శకులకు అత్యంత పెద్ద రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ప్రేక్షకుల కోణంలోనూ, దర్శకుడి కోణంలోనూ విశ్లేషిస్తే ఇక్కడ దర్శకుడిపై అపారమైన ఒత్తిడి ఉంటుంది. పార్ట్-1 కంటే అద్భుతమైన కంటెంట్, మైండ్ బ్లోయింగ్ విజువ‌ల్స్ సీక్వెల్‌లో ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అందుకోసం దర్శకుడు స్క్రిప్టు దశలోనే తీవ్రమైన గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ చిన్న లూప్‌హోల్ కనిపించినా.. కథ కథనాల్లో తడబడినా లేదా మొదటి భాగం కంటే తక్కువ స్థాయిలో చూపించినా అభిమానులు అస్సలు క్షమించరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, రజనీకాంత్ వంటి మాసివ్ ఫ్యాన్ బేస్ ఉన్న అగ్ర కథానాయకుల విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది సదరు దర్శకుడి కెరీర్‌కే పెద్ద మైనస్‌గా మారే ప్రమాదం ఉంది.

ఇప్పటికే భారతీయ చిత్రసీమలో వచ్చిన బాహుబలి 2, కేజీఎఫ్ 2, పుష్ప 2, స్త్రీ 2, దురంధర్ 2 వంటి సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయంటే దానికి కారణం ఆ దర్శకులు ఎంతటి ఒత్తిడి ఎదుర్కొన్నా కథనం విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకపోవడమే. పార్ట్-1 కంటే ఎంతో గ్రాండ్‌గా కథను నడిపించి థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాకయ్యే అనుభూతిని అందించారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి అగ్నిపరీక్షనే పవన్ కళ్యాణ్ `ఓజీ` సీక్వెల్ -OG 2 విషయంలో దర్శకుడు సుజీత్, అలాగే రజనీకాంత్ జైలర్ సీక్వెల్- జైల‌ర్ 2 విషయంలో దర్శకుడు నెల్సన్ ఎదుర్కొంటున్నారు. ఒక రికార్డు బ్రేకింగ్ హిట్ సినిమాకు కొనసాగింపుగా మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదని ఇద్దరూ గుర్తిస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌తో `ఓజీ` గ్రాండ్ సక్సెస్ తర్వాత దర్శకుడు సుజీత్ ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నానితో కలిసి `బ్లడీ రోమియో` అనే స్టైలిష్ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయి షూటింగ్‌కు సిద్ధమవుతోంది. అయితే మరోవైపు పవన్ కళ్యాణ్‌తో ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన `ఓజీ 2` స్క్రిప్ట్ సిద్ధం చేసే విషయంలో సుజీత్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. `గంబీరా యూనివర్స్`ను మరింత విస్తరిస్తూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సీక్వెల్ పనులు అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో పవన్-సుజీత్ మధ్య చర్చలు జరిగాయి. బౌండ్ స్క్రిప్ట్ విష‌యంలో సుజీత్ రాజీకి రాకూడ‌ద‌ని భావిస్తున్నార‌ట‌. నాని సినిమా పూర్తికాగానే సుజీత్ `ఓజీ 2` పూర్తిస్థాయి ప్రీ-ప్రొడక్షన్, షూటింగ్ పనుల్లోకి అడుగుపెట్టనున్నారు.

అటు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన `జైలర్`చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడం కూడా అలాంటి భాద్యతతో కూడుకున్న సవాలే. ఆ సవాలును స్వీకరిస్తూ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ `జైలర్ 2`ను గ్రాండ్ గా తెర‌కెక్కించి, విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల రజనీకాంత్‌తో `కూలీ` లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసి, ఆశించిన స్థాయిలో మెప్పించలేక దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీవ్ర విమర్శలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి తనకు రాకూడదని నెల్సన్ అత్యంత జాగ్రత్తగా `జైలర్ 2` స్క్రిప్ట్‌ను తీర్చిదిద్ది సెట్స్ కెళ్లార‌ని తెలుస్తోంది. ఈ సీక్వెల్‌తో మరో బంపర్ హిట్ కొట్టి, భారతీయ చిత్రసీమలోని అత్యుత్తమ దర్శకుల సరసన తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని నెల్సన్ తపిస్తున్నారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్, రజనీకాంత్ లాంటి అగ్ర తారలతో సీక్వెల్స్ తీయడం అనేది కత్తిమీద సాము లాంటిదే. అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో నెల్సన్ త‌న సినిమాని ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. అదే స‌మ‌యంలో సుజీత్ కూడా స్క్రిప్టు విష‌యంలో రాజీ ప‌డ‌కూడ‌ద‌ని చాలా ప్రీవ‌ర్క్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ ఆశిస్తున్న రేంజ్‌లో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి రజనీ, పవన్ కెరీర్లలో మరో మైలురాయిగా ఈ సీక్వెల్స్‌ను నిల‌బెడ‌తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఎలాంటి తప్పు జరగకుండా పార్ట్-1 ను మించేలా ఈ సినిమాలు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News