రవిబాబు 'రేజర్'.. ట్రైలర్ ఎలా ఉందంటే?
టాలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం రేజర్ (Razor) ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.;
టాలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం రేజర్ (Razor) ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం ట్రైలర్ ను విడుదల చేయగా, అది ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
ట్రైలర్ ను పరిశీలిస్తే.. రేజర్ మూవీ కథ ఒక చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ఓ వ్యక్తి చేసే పోరాటం చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. పవర్ ఫుల్ రాజకీయ వ్యవస్థతో పాటు నేర ప్రపంచంతో ఢీకొనే కథానాయకుడి ప్రయాణం ఇందులో ప్రధానాంశంగా నిలుస్తోంది. సినిమా ట్యాగ్ లైన్ జస్టిస్ విల్ బీ బ్రూటల్ కు తగ్గట్టుగా ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు ఎఫెక్టివ్ గా, ఎమోషనల్ గా చూపించారు.
వయెలెన్స్, డార్క్ టోన్ తో సినిమా మరింత రియలిస్టిక్ గా ఉండబోతుందని స్పష్టమవుతోంది. సినిమాలో రవిబాబు లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో కనిపించని రా అండ్ రస్టిక్ అవతార్ లో ఆయన కనపడడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. తన కెరీర్ లో అవును, నచ్చావులే, అల్లరి వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందిన రవిబాబు, మరోసారి కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇక రేజర్ చిత్రం విడుదల తేదీకి కూడా ప్రత్యేకత ఉంది. మే 8వ తేదీ రవిబాబు తండ్రి, దివంగత ప్రముఖ నటుడు చలపతిరావు జయంతి. ఆయన జ్ఞాపకార్థంగా అదే రోజు సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించడం విశేషం. దీంతో ఆ సినిమా రవిబాబు కోసం వ్యక్తిగతంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
నిర్మాణ పరంగా కూడా ఆ చిత్రానికి మంచి బలం ఉంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ , సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథ, దర్శకత్వం రెండింటినీ రవిబాబే నిర్వహించడం గమనార్హం. టెక్నికల్ అంశాల పరంగా కూడా సినిమా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఎస్.ఎస్. రాజేష్ సంగీతం అందించగా, చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
యాక్షన్ సన్నివేశాలు సతీష్ పోలోజు డిజైన్ చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్‌లకు మంచి స్పందన లభించగా, ట్రైలర్ తో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. థ్రిల్లర్ జానర్ కు ప్రస్తుతం మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో, రేజర్ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలుస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులతో పాటు క్రైమ్ థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకునే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చెబుతుండగా.. రవిబాబు ఎలాంటి హిట్ అందుకుంటారో అంతా వేచి చూడాలి.