ర‌ష్మిక వ‌ర్సెస్ శ్ర‌ద్దాక‌పూర్? ఎవ‌రు గ్రేట్!

ఈ రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు త్వరలోనే పట్టాలెక్కడానికి సిద్ధమవుతుండటంతో ఇద్ద‌రిలో ఎవరు బెస్ట్ పెర్ఫార్మర్‌గా నిలుస్తారనే ఆసక్తికర చర్చ పరిశ్రమలో మొదలైంది.

Update: 2026-06-11 13:30 GMT

భారతీయ సినీ పరిశ్రమలో `మహానటి` చిత్రం సాధించిన అద్భుత విజయం తర్వాత ప్రముఖుల జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరించే బయోపిక్‌ల ట్రెండ్ ఊపందుకుంది. సాధారణ చిత్రాలతో పోలిస్తే బయోపిక్‌లలో నటించడం నటీనటులకు పెద్ద సవాలుతో కూడుకున్న విషయం. తాజాగా నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మిక మందాన- బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఇద్దరూ భారతీయ సంస్కృతి, సంగీత రంగాలలో చెరపలేని ముద్ర వేసిన ఇద్దరు లెజెండరీ మహిళల బయోపిక్‌లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు త్వరలోనే పట్టాలెక్కడానికి సిద్ధమవుతుండటంతో ఇద్ద‌రిలో ఎవరు బెస్ట్ పెర్ఫార్మర్‌గా నిలుస్తారనే ఆసక్తికర చర్చ పరిశ్రమలో మొదలైంది.

కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోయే చిత్రంలో రష్మిక మందాన కథానాయికగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. `జెర్సీ` వంటి ఎమోషనల్ క్లాసిక్ చిత్రాన్ని అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్లామరస్, కమర్షియల్ పాత్రలలో మెప్పించిన రష్మికకు ఇది కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన , సవాలుతో కూడిన పాత్ర అని చెప్పొచ్చు. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి హావభావాలను, పవిత్రమైన వ్యక్తిత్వాన్ని వెండితెరపై పండించడం రష్మిక నటనా జీవితానికి పెద్ద పరీక్ష కానుంది.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జానపద కళాకారిణి, తమాషా నృత్య సామ్రాజ్ఞి వీతాబాయి నారాయణ్ కావకర్ బయోపిక్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి `ఈట` అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. జానపద కళల కోసం, తన నృత్యం కోసం జీవితాన్ని ధారపోసిన ఒక అసాధారణ మహిళ కథ ఇది. శ్రద్ధా కపూర్ తన కెరీర్‌లో ఇప్పటికే హసీనా పార్కర్ బయోపిక్‌లో నటించిన అనుభవం ఉన్నప్పటికీ ఒక జానపద నర్తకిగా, భావోద్వేగాలతో కూడిన పాత్ర ఆమెకు సరికొత్త ఇమేజ్‌ను తెచ్చిపెడుతుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇద్దరు నటీమణుల పాత్రలను పరిశీలిస్తే.. రష్మిక పోషిస్తున్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్ర అత్యంత శోభాయ మానమైనది, శాస్త్రీయమైనది , ప్రశాంతతతో కూడుకున్నది. కేవలం కళ్ల కదలికలతో, ముఖ కవళికలతో ఆ పాత్రలోని దైవత్వాన్ని పండించాల్సి ఉంటుంది. శ్రద్ధా కపూర్ పోషిస్తున్న వీతాబాయి పాత్ర అత్యంత ఉద్వేగభరితమైనది. జానపద నృత్యం , నటనలో విపరీతమైన ఎనర్జీ అవసరమైన పాత్ర. అంటే ఒకరు క్లాసికల్ రూట్‌లో వెళ్తుంటే.. మరొకరు పక్కా మాస్-ఫోక్ ఎమోషనల్ రూట్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇలా ఒకే సమయంలో ఇద్దరు క్రేజీ స్టార్ హీరోయిన్లు రెండు భిన్నమైన సంస్కృతులకు చెందిన ఐకానిక్ మహిళల బయోపిక్‌లతో తలపడనుండటం భారతీయ సినిమాకు శుభపరిణామం. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధించే వసూళ్ల కోణంలో కాకుండా.. నటీమణులుగా రష్మిక, శ్రద్ధా కపూర్‌ల కెరీర్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రెండు చిత్రాలలో ఏ నటి తన పాత్రకు వంద శాతం న్యాయం చేసి `మహానటి` సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ సాధించిన స్థాయి మెప్పును అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News