ట్రెండీ టాక్: సౌతిండియా నంబ‌ర్-1 హీరోయిన్?

ప్రస్తుతం ఒక్కో చిత్రానికి ఏకంగా 15 కోట్ల రూపాయల పారితోషికం అందుకునే స్థాయికి ఆమె ఎదిగారు.

Update: 2026-06-02 13:30 GMT

భారతీయ చలనచిత్ర రంగంలో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్న నేడు 15కోట్ల పారితోషికం రేంజుకు చేరుకోవ‌డం నిజంగా ఒక స‌చ‌ల‌నం. అయితే ఈ అసాధారణ విజయం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. ఈ ప్ర‌తిభావ‌ని ఈ స్థాయి ప్రజాదరణ సాధించ‌డం అనేది ఓవర్‌నైట్‌లోనే సాధ్య‌ప‌డ‌లేదు. రష్మిక మొదటి కన్నడ చిత్రం `కిరిక్ పార్టీ` 2016 డిసెంబ‌ర్‌లో విడుదలైంది. ఆ తర్వాత 2018లో వచ్చిన `ఛలో` చిత్రంతో ఈ క‌న్న‌డ బ్యూటీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆపై `గీత గోవిందం` వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సినిమా రంగంలోకి ప్రవేశించిన కేవలం ప‌దేళ్ల ప్రయాణంలోనే ఈ ఎదుగుద‌ల సాధ్య‌మైంది. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి ఏకంగా 15 కోట్ల రూపాయల పారితోషికం అందుకునే స్థాయికి ఆమె ఎదిగారు.

దక్షిణాది చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన రష్మిక ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటిస్తూ అగ్ర కథానాయికగా అవతరించారు. పుష్ప, యానిమల్, పుష్ప 2, ఛావా వంటి భారీ చిత్రాలు బంప‌ర్ హిట్లుగా మారాయి. పుష్ప, యానిమల్ చిత్రాలలో నటించిన సమయంలో పారితోషికం దాదాపు 5 నుండి 6 కోట్ల రూపాయల రేంజుకు చేరుకుందని కథనాలు వచ్చాయి. అయితే వరుస విజయాలతో పాన్-ఇండియా రేంజ్‌లో అత్యంత విజయవంతమైన హీరోయిన్‌గా మారిన రష్మిక ఇప్పుడు ఏకంగా `కాక్ టైల్ 2` చిత్రం కోసం 15 కోట్ల రూపాయల రేంజులో రెమ్యునరేషన్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

ప్రస్తుతం రష్మిక నటిస్తున్న `కాక్ టైల్ 2` చిత్రంలో త‌ను పోషించిన‌ పాత్ర మునుపటి కంటే భిన్నంగా ఉండబోతోంది. ఈ సినిమాలో కాస్త శృంగారభరితమైన పాత్ర‌లో ఘాటైన సన్నివేశాలలోనే నటించడమే కాకుండా, పాత్ర డిమాండ్ మేరకు చేతిలో ఎల్లప్పుడూ ఒక వైన్ బాటిల్‌తో కనిపిస్తూ సరికొత్తగా అలరిస్తోంది. ఈ ప‌దేళ్ల సినిమా ప్రయాణంలో 15 కోట్ల పారితోషికం అందుకునే స్థాయికి చేరిన రష్మిక మందన్న వాస్త‌వ కుటుంబ‌ నేపథ్యం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. కూర్గ్ ప్రాంతంలోని ఒక సాధారణ గిరిజన కుటుంబానికి చెందిన ఒక యువతి సినిమా రంగంలోకి వచ్చి ఇంతటి ఘనవిజయాన్ని సాధించడం అనేది నేటితరం అమ్మాయిలకు, నటి కావాలనుకునే ఎందరో ఔత్సాహిక యువతులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది.

భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకునే కథానాయికల సరసన ఇప్పుడు రష్మిక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఒక్కో సినిమాకు దాదాపు 30 కోట్ల రూపాయలు అందుకుంటుండగా, దీపిక పదుకొనే రేంజ్ 20 కోట్ల రూపాయల వద్ద ఉంది. ఆలియా భట్, కృతి సనన్‌ల సరసన ఇప్పుడు రష్మిక మందన్న కూడా 15 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం నిజంగా విశేషం. దక్షిణాది చలనచిత్ర రంగానికి చెందిన నయనతార లాంటి అగ్ర నాయికను కూడా వెనక్కు నెట్టి రష్మిక ఏకంగా ఇంత పెద్ద స్థానాన్ని అందుకోవడం న‌టిగా అద్భుతమైన ప్రయాణానికి నిదర్శనం.

వైఫల్యాలకు కుంగిపోకుండా... వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కష్టపడితే ఎంతటి ఎత్తుకైనా ఎదగవచ్చని రష్మిక మందన్న కెరీర్ నిరూపిస్తోంది. ప్రాంతీయ సినిమా స్థాయి నుండి బాలీవుడ్ అగ్ర తారల సరసన నిలిచే స్థాయికి చేరుకున్న రష్మిక ప్రయాణం భ‌విష్య‌త్ లో మరిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించే దిశగా దూసుకుపోవాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News