120 కోట్ల ఖరీదైన భారీ ఇంట్లోకి స్టార్ కపుల్ గృహప్రవేశం
బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్ - దీపికా పదుకొనే ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో తమ కలల నివాసాన్ని సిద్ధం చేసుకున్నారు.;
బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్ - దీపికా పదుకొనే ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో తమ కలల నివాసాన్ని సిద్ధం చేసుకున్నారు. సుమారు రూ. 119 కోట్ల భారీ వ్యయంతో కొనుగోలు చేసిన ఈ విలాసవంతమైన మాన్షన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అరేబియా సముద్ర తీరాన.. ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన ఈ భవనం కేవలం నివాసం మాత్రమే కాదు.. ఈ జంట సామాజిక హోదాకు వారి అభిరుచికి ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ నివాసంలోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇది బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నివాసమైన `మన్నత్` కు అతి సమీపంలో ఉండటం. బాంద్రాలోని `సాగర్ రేష్మ్` అపార్ట్‌మెంట్‌లో 16, 17, 18 , 19వ అంతస్తులలో ఇది విస్తరించి ఉంది. ఇది ఒక `క్వాడ్రప్లెక్స్` నివాసం.. అంటే నాలుగు అంతస్తులు ఒకే ఇంటి భాగంగా ఉంటాయి. సుమారు 11,266 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగిన ఈ ఇల్లు ముంబై రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్స్ లో ఒకటిగా నిలిచిపోయింది.
ఈ భవనం నుండి అరేబియా సముద్రం అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. దీనికి అదనంగా 1300 చదరపు అడుగుల ప్రత్యేకమైన టెర్రస్ ఏరియా కూడా ఉంది. ఇది ఈ జంట ప్రైవేట్ వేడుకలకు ప్రశాంతమైన సాయంత్రాలకు వేదిక కానుంది. ఇక ముంబై వంటి నగరంలో వాహనాల పార్కింగ్ అనేది ఒక పెద్ద సవాలు.. కానీ ఈ నివాసానికి ఏకంగా 19 పార్కింగ్ స్లాట్లను కేటాయించడం చూస్తుంటే, ఈ ప్రాజెక్ట్ ఎంతటి పక్కా ప్రణాళికతో నిర్మితమైందో అర్థం చేసుకోవచ్చు.
కేవలం కొనుగోలు ధర మాత్రమే కాకుండా, ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం సుమారు రూ. 7.13 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు తెలుస్తోంది. రణవీర్ తండ్రి జుగ్జీత్ సుందర్‌సింగ్ భవ్నానీకి చెందిన సంస్థ ద్వారా ఈ లావాదేవీలు జరిగాయి. ఇంటి లోపలి డిజైన్... ఇంటీరియర్ పనులను రణవీర్-దీపికా జంట తమ సొంత అభిరుచులకు అనుగుణంగా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆధునికతతో పాటు సౌకర్యాలకు ఈ నివాసం కేరాఫ్ అడ్రస్‌గా నిలవనుంది.
త్వరలోనే ఈ జంట తమ కొత్త గృహంలోకి మారేందుకు సిద్ధమవుతోంది. సముద్రపు అలల హోరు, స్టార్ సెలబ్రిటీల పొరుగు, మరియు అత్యాధునిక సౌకర్యాల నడుమ ఈ నివాసం బాలీవుడ్ లో ఒక ఐకానిక్ హోమ్ గా మారడం ఖాయం. ఇప్పటికే తమ నటనతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ఈ జంట, ఇప్పుడు తమ వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఈ కలల సౌధాన్ని ముస్తాబు చేసుకుంటున్నారు. దురందర్ 2 గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో రణ్ వీర్ కి ఈ లాంచింగ్ కూడా ఒక గొప్ప విజయంగా పరిగణించాలి.