45 రోజుల్లో థియేట‌ర్లలోకి.. 'రామాయ‌ణం' ప్ర‌చారానికి స‌రిపోతుందా?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `రామాయణం` విడుద‌ల‌కు ఇంకెంతో దూరం లేదు.

Update: 2026-09-29 03:32 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `రామాయణం` విడుద‌ల‌కు ఇంకెంతో దూరం లేదు. ఈ ఏడాది దీపావ‌ళికి సినిమాని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ ప్ర‌చారం కోసం చిత్ర‌బృందం త‌పిస్తోంది. ఈ బ‌హుభాషా చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా విడుదల చేసిన బిహైండ్ ది సీన్స్ (బీటీఎస్‌) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దర్శకుడు నితీశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రా తెరకెక్కిస్తున్న ఈ మహాకావ్యానికి సంబంధించిన ఈ ప్రత్యేక అప్‌డేట్ రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కావడం విశేషం. ఈ వీడియోలో సినిమా తారాగణం, నిర్మాణ విలువలు, సాంకేతిక నిపుణుల ప్రతిభ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా, సీతాదేవిగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. అలాగే టెలివిజన్ రామాయణంలో రాముడిగా అలరించిన సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ పాత్ర కేవలం ఒక నటనా అనుభవం మాత్రమే కాదని.. ఎంతో బాధ్యతతో కూడుకున్నదని రణ్‌బీర్ కపూర్ పేర్కొన్న మాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను రంగంలోకి దించడం దీని ప్రత్యేకత. `మ్యాడ్ మాక్స్` చిత్రానికి పనిచేసిన ప్రఖ్యాత స్టంట్ కొరియోగ్రాఫర్ గై మోరిస్, `అవతార్` ఫేమ్ మూవ్‌మెంట్ కోచ్ టెర్రీ నోటరీ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా.. దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందిస్తుండటం భారతీయ సినీ వర్గాల్లో భారీ అంచనాలను పెంచేసింది.

ఇన్నాళ్లు ఎలాంటి ప్రచారానికి దూరంగా ఉన్న చిత్ర యూనిట్ ఒక్కసారిగా ఈ వీడియోను వదలడంతో ప్రేక్షకులు, నెటిజన్లు ఫిదా అయిపోయారు. విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) రంగంలో అగ్రగామిగా ఉన్న డిఎన్ఈజి సంస్థ దీనికి వర్క్ చేస్తుండటంతో ప్రతీ ఫ్రేమ్ అత్యంత సహజంగా, అద్భుతంగా కనిపిస్తోంది. కాస్ట్యూమ్స్ డిజైనింగ్, లైటింగ్ , బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని ఇస్తాయని ఈ గ్లింప్స్ స్పష్టం చేస్తోంది.

మొత్తానికి `రామాయణం` చిత్రం కేవలం ఒక సినిమాగా కాకుండా.. భారతీయ చలనచిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టు ఎక్కించే ఒక అద్భుత దృశ్యకావ్యంగా నిలవబోతుందని ఈ బీటీఎస్‌ వీడియో రుజువు చేస్తోంది. రాముడి రూపంలో రణ్‌బీర్ కపూర్ గెటప్... సీత‌గా సాయిపల్లవి అభినయం .. అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల స‌హ‌కారంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం సినీ అభిమానులు అత్యుత్సాహంతో ఎదురుచూస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే ఈ దీపావ‌ళిని వ‌ర్ణ రంజితంగా మార్చేందుకు రామాయ‌ణం సిద్ధ‌మ‌వుతోంది. అయితే దీపావ‌ళి రావ‌డానికి ఇంకో 45 రోజుల స‌మ‌యం అయినా లేదు.. ఈ కొద్ది స‌మ‌యాన్ని న‌మిత్ బృందం ఎలాంటి ప్ర‌మోష‌న్ చేయ‌బోతోంది? బ‌హుభాష‌ల్లో రిలీజ్ చేయాలి కాబ‌ట్టి దానికి సంబంధించి ఎలాంటి ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించారు? అనేది అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.

Full View
Tags:    

Similar News