25 ఏళ్ల ప్ర‌యాణంలో రాజమౌళి సంచ‌ల‌నాలు!

తెలుగు సినిమా చరిత్రను `బాహుబలి`కి ముందు.. `బాహుబలి`కి తర్వాత' అని చెప్పుకునేలా మార్చిన ఏకైక దర్శకధీరుడు రాజమౌళి.

Update: 2026-09-29 04:09 GMT

తెలుగు సినిమా చరిత్రను `బాహుబలి`కి ముందు.. `బాహుబలి`కి తర్వాత' అని చెప్పుకునేలా మార్చిన ఏకైక దర్శకధీరుడు రాజమౌళి. 2001 సెప్టెంబర్ 27న జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన `స్టూడెంట్ నంబర్ 1` చిత్రంతో వెండితెరకు పరిచయమైన జక్కన్న తాజాగా ఇండస్ట్రీలో విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సీరియల్ దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించి నేడు హాలీవుడ్ దిగ్గజాలు సైతం అబ్బురపడే స్థాయికి ఎదిగిన జ‌క్క‌న్న‌ ప్రయాణం భారతీయ చలనచిత్ర రంగానికే గర్వకారణంగా నిలిచింది.

`స్టూడెంట్ నంబర్ 1` ఘనవిజయంతో బోణీ కొట్టిన రాజమౌళి అటుపై కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. `సింహాద్రి` చిత్రంతో మాస్ ఆడియెన్స్‌లో పూనకాలు తెప్పించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ఆపై రగ్బీ క్రీడ నేపథ్యంలో రూపొందించిన `సై`, పవర్‌ఫుల్ ఎమోషన్స్‌తో తెర‌కెక్కించిన `ఛత్రపతి`, మాస్ యాక్షన్‌కి బెంచ్‌మార్క్‌గా నిలిచిన `విక్రమార్కుడు` వంటి చిత్రాలతో తన మార్క్‌ను సుస్థిరం చేసుకున్నారు. ప్రతి చిత్రంలోనూ కథానాయకుడి పాత్రను సరికొత్తగా ఆవిష్కరించి యాక్షన్ ఎలివేషన్లలో కొత్త గ్లామర్ తీసుకొచ్చారు.

మాస్ యాక్షన్ చిత్రాలకే పరిమితం కాకుండా కథనంలో విభిన్నమైన ప్రయోగాలు చేయడం రాజమౌళి ప్రత్యేకత. `యమదొంగ`తో సోషియో-ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన జ‌క్క‌న్న అటుపై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన `మగధీర` చిత్రంతో తెలుగు సినిమాను టెక్నికల్ వండర్‌గా మార్చేశారు. పునర్జన్మల నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ పరంగా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పింది. ఇక ఒక చిన్న ఈగను ప్రధాన పాత్రగా పెట్టి `ఈగ` వంటి వినూత్నమైన చిత్రాన్ని తెరకెక్కించి తనలోని క్రియేటివిటీకి హద్దులు లేవని నిరూపించారు.

తెలుగు సినిమా ప్రాంతీయ సరిహద్దులను దాటి అంతర్జాతీయంగా అడుగులు వేయడానికి `బాహుబలి` సిరీస్ నాంది పలికింది. `బాహుబలి: ది బిగినింగ్`, `బాహుబలి: ది కన్‌క్లూజన్` చిత్రాలతో భారతీయ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ రాజమౌళి కొల్లగొట్టారు. పాన్-ఇండియా అనే పదానికి అసలైన అర్థం చెప్పారు. సౌత్ సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ చిత్రంతో నార్త్ ఇండియా ఆడియెన్స్‌ను అల‌రించి దేశంలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా ఎదిగారు.

బాహుబలి బాటలో మరో గ్లోబల్ స్పెక్టాకిల్‌గా `ఆర్ఆర్ఆర్` తెర‌కెక్కింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం గ్లోబల్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. చిత్రంలోని `నాటు నాటు` పాటకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు లభించడం తెలుగు సినిమా చరిత్రలోనే నెవర్ బిఫోర్ మూమెంట్‌గా నిలిచింది. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు, సాంకేతిక నిపుణులు సైతం రాజమౌళి విజన్‌ను ప్ర‌శంసించ‌డంతో రాజమౌళి గ్లోబల్ బ్రాండ్‌గా అవతరించారు.

పాతికేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఒక్క ఓటమి కూడా ఎరుగని ఏకైక దర్శకుడిగా రాజమౌళి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాకూ తనే ఒక బెంచ్‌మార్క్ సెట్ చేసుకుంటూ ముందుకుసాగుతున్న జక్కన్న, ప్రస్తుతం మైథాలజీ .. టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో `వారణాసి` అనే హై-వోల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్ తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమా విజ‌యం సాధిస్తే గ్లోబ‌ల్ వైడ్ రాజ‌మౌళి ఇమేజ్ రెట్టింపు అవుతుంది. పాతికేళ్ల మైలురాయిని చేరుకున్న రాజమౌళి మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి, భారతీయ సినిమా జెండాను ప్రపంచ వేదికలపై మరింత ఎత్తున ఎగ‌రేయాల‌ని సినీ ప్రపంచం ఆకాంక్షిస్తోంది.

Tags:    

Similar News