బాలయ్య ది గ్రేట్: మళ్లీ సింహంలాగా ఉరుకుతున్నాడు!
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఎంతో ఊరటనిచ్చే.. ఆనందాన్ని కలిగించే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఎంతో ఊరటనిచ్చే.. ఆనందాన్ని కలిగించే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ `దాదా` సినిమా షూటింగ్ నేటి నుంచి మళ్లీ పట్టాలెక్కింది. `వీరసింహారెడ్డి` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ ఏడాది జూన్‌లో చిత్రంలోని ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా బాలయ్యకు స్వల్ప గాయమైంది. దీనికి సంబంధించి చిన్న శస్త్రచికిత్స జరగడంతో వైద్యుల సలహా మేరకు ఆయన కొద్దిరోజులు షూటింగ్‌కు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారని.. మునుపటి కంటే మరింత జోష్‌తో సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారని సమాచారం.
తాజా షెడ్యూల్ వివరాల ప్రకారం.. ఈరోజు (సెప్టెంబర్ 29) నుండి మైసూర్ వేదికగా `దాదా` కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. మొదటగా ఇతర ప్రధాన నటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్న దర్శకుడు గోపీచంద్ మలినేని, అక్టోబర్‌లో స్వయంగా బాలకృష్ణను ఈ షెడ్యూల్‌లో జాయిన్ చేసుకోనున్నారు. సెట్స్‌లో బాలయ్య అడుగుపెట్టగానే ఆయనపై కొన్ని భారీ యాక్షన్ సీన్లతో పాటు.. బలమైన ఎమోషనల్ అండ్ డ్రామా ఎపిసోడ్స్‌ను షూట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన చందమామ కాజల్ అగర్వాల్ కథానాయకగా నటిస్తుండగా.. యంగ్ హీరో మంచు మనోజ్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేయగా.. ఈ కొత్త షెడ్యూల్‌తో మిగిలిన పెండింగ్ పనులను వేగవంతం చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయాలని ముందుగా ముహూర్తం ఫిక్స్ చేసినా షూటింగ్ బ్రేక్ కారణంగా రిలీజ్ డేట్పై కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అయితే మేకర్స్ అన్ని అడ్డంకులను అధిగమించి సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. మొత్తానికి బాలయ్య పూర్తి ఆరోగ్యంతో రీ-ఎంట్రీ ఇస్తుండటంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటూ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.