ఇరుముడి స్ట్రాటజీ.. రణబాలికీ వర్కౌట్ అవ్వాలంటే..
సినిమా మీద ఇంట్రెస్ట్, ప్రేక్షకుల రెస్పాన్స్, కథలోని కొత్తదనం కూడా కీలకమే. రణబాలి విషయంలో కూడా అంతే.
సినిమా టికెట్ రేట్లు పెంచితేనే భారీ వసూళ్లు వస్తాయా.. స్టార్ హీరో మూవీ అంటే మొదటి రోజే రికార్డులు కొల్లగొట్టాలా.. అలా కాకుండా వేరేగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది.. ఇప్పుడు రణబాలి విషయంలో అదే హాట్ టాపిక్ గా మారింది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి సినిమాకు వర్కౌట్ అయిన టికెట్ రేట్ల స్ట్రాటజీని ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా కూడా నమ్ముకుంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ రణబాలి. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే ఆ సినిమా విజయ్ కెరీర్ లోనే భిన్నమైన చిత్రంగా రాబోతోంది. ఇప్పటికే ఆ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు టికెట్ ధరలు పెంచడం లేదని మేకర్స్ స్పష్టం చేయడం మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా మారింది. నైజాం, ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ధరలకే సినిమాను రిలీజ్ చేయాలనే నిర్ణయం ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది.
సాధారణంగా భారీ చిత్రాలు విడుదలవుతున్నాయంటే టికెట్ ధరల పెంపుపై చర్చ మొదలవుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు మొదటి కొన్ని రోజులు ధరలు పెంచడం ద్వారా ఎక్కువ వసూళ్లు సాధించాలని నిర్మాతలు భావిస్తుంటారు. దీనివల్ల మొదటి రోజు కలెక్షన్లు భారీగా కనిపించినా, టికెట్ ధరలు సామాన్య ప్రేక్షకులకు భారంగా మారే అవకాశం ఉంటుంది. ఒక ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఇలాంటి సమయంలో సాధారణ ధరలకే సినిమా అందుబాటులో ఉంటే ఎక్కువ మంది థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడే ఇరుముడి స్ట్రాటజీ గుర్తుకొస్తోంది. టికెట్ ధరలు పెంచకుండా కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని ఆ సినిమా ప్రూవ్ చేసింది. ధరలు అందుబాటులో ఉండటంతో పాటు సినిమా నచ్చితే అందరికీ చెప్పడం, కుటుంబంతో కలిసి చూడటం వంటి ఎలిమెంట్స్ వసూళ్లను పెంచుతాయి.
అయితే ఆ విధానం ప్రతి సినిమాకు ఒకేలా వర్కౌట్ అవుతుందని చెప్పలేం. సినిమా మీద ఇంట్రెస్ట్, ప్రేక్షకుల రెస్పాన్స్, కథలోని కొత్తదనం కూడా కీలకమే. రణబాలి విషయంలో కూడా అంతే. ఒకవైపు టికెట్ ధరలు పెంచకపోవడం ప్రేక్షకులకు అనుకూలంగా మారితే, మరోవైపు పోటీలో ఉన్న సినిమాల ధరలు, విడుదల సమయంలో ఉండే పరిస్థితులు ఎఫెక్ట్ చూపుతాయి. అయితే, తక్కువ ధరలు ఉన్నాయనే కారణంతోనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అనుకోవడానికి లేదు. సినిమా బాగుందనే టాక్ బయటకు రావాలి.
అప్పుడే వరుసగా థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా భారీ అంచనాలున్న సినిమాకు మొదటి రోజు వసూళ్ల కంటే ఎక్కువ రోజులు స్టేబుల్ గా వసూళ్లు రావడం కూడా ముఖ్యం. టికెట్ రేట్లు పెంచకపోవడం వల్ల ఎక్స్ ట్రా ఇన్కమ్ తగ్గవచ్చు. కానీ ప్రేక్షకుల సంఖ్య పెరిగి, సినిమా ఎక్కువ రోజులు బాగా ఆడితే అది కవర్ అయిపోతుంది. అందుకే ఆ నిర్ణయం నిర్మాతలకు ఎంతవరకు లాభం తెస్తుందనేది సినిమా రిజల్ట్ పైనే ఆధారపడి ఉంటుంది.